Suriya-Karthi | సౌత్ సినీ ఇండస్ట్రీలో తమదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ బ్రదర్స్ సూర్య, కార్తీ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి థియేటర్లలో కాదు.. ఓటీటీ వేదికలపై తమ సత్తా చాటుతున్నారు. అన్న సూర్య, తమ్ముడు కార్తీ నటించిన రెండు సినిమాలు ఒకేసారి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో టాప్ ట్రెండింగ్‌లో నిలవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సూర్య హీరోగా, మమితా బైజు హీరోయిన్గా నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో మంచి విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.260 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సూర్య కెరీర్లో భారీ విజయాల్లో ఒకటిగా నిలిచింది.
థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది. ఓటీటీలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే ఇండియా ట్రెండింగ్ జాబితాలో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. అంతేకాదు, నాన్-ఇంగ్లీష్ సినిమాల విభాగంలోనూ గ్లోబల్ స్థాయిలో టాప్ ప్లేస్‌లో నిలిచింది. మధ్యలో ట్రెండింగ్ ర్యాంక్‌లో మార్పులు వచ్చినప్పటికీ, తాజాగా మరోసారి నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. మరోవైపు కార్తీ నటించిన ‘సర్దార్ 2’ కూడా ఓటీటీలో దూసుకుపోతోంది. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్‌కు థియేటర్లలో ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. అయితే డిజిటల్ విడుదల తర్వాత పరిస్థితి మారిపోయింది. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ ప్రారంభమైన తర్వాత ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే నంబర్ వన్ ట్రెండింగ్ స్థానాన్ని అందుకోవడం విశేషంగా మారింది.
ఏజెంట్ సర్దార్ పాత్రలో కార్తీ నటన, అంతర్జాతీయ ముప్పు చుట్టూ సాగే కథ, యాక్షన్ అంశాలు ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా ఒకే సమయంలో వేర్వేరు ఓటీటీ వేదికల్లో సూర్య, కార్తీ సినిమాలు నంబర్ వన్ ట్రెండింగ్‌లో నిలవడం వారి డిజిటల్ క్రేజ్‌ను మరోసారి చూపిస్తోంది. థియేటర్లలో విడుదలైన సినిమాలకు ఓటీటీ ద్వారా మరోసారి ప్రేక్షకుల ఆదరణ లభిస్తుండటంతో ఈ స్టార్ బ్రదర్స్ అభిమానులు కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.థియేటర్లలో సూర్య, కార్తీకి ఉన్న క్రేజ్‌కు తోడు ఓటీటీ ప్రేక్షకుల్లోనూ వీరికి మంచి ఆదరణ ఉందని ఈ ట్రెండింగ్ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకే సమయంలో అన్నదమ్ముల సినిమాలు రెండు ప్రముఖ డిజిటల్ వేదికల్లో టాప్‌లో ఉండటం ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.