Online Shopping | కారేపల్లి, అక్టోబర్ 6: దసరా, దీపావళి ఆఫర్లతో ఆన్లైన్ షాపింగ్ జోరందుకున్న వేళ సింగరేణి మండల ప్రజలకు మాత్రం పిన్కోడ్ సమస్య అడ్డంకిగా మారింది. 507122 పిన్కోడ్ నమోదు చేస్తే ‘మీ ప్రాంతానికి డెలివరీ సేవలు అందుబాటులో లేవు’ అంటూ కొన్ని ఈ-కామర్స్ సంస్థలు ఆర్డర్లను స్వీకరించడం లేదని స్థానికులు చెబుతున్నారు.
కొద్దిమంది వినియోగదారులు ఆర్డర్లు పెట్టి డెలివరీ తీసుకోకపోవడం వంటి ఘటనల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు. ఫలితంగా నిజాయితీగా ఆన్లైన్ సేవలను వినియోగించే వారూ ఇబ్బందులు పడుతున్నారు. అవసరమైన వస్తువుల కోసం పక్క ప్రాంతాల చిరునామాలను ఉపయోగించాల్సి వస్తోందని అంటున్నారు.
పిన్కోడ్ ఆధారంగా కొన్ని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు సేవలను పరిమితం చేస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. క్రెడిట్ కార్డులు, గృహోపకరణాలు, ద్విచక్ర వాహనాలపై ఈఎంఐ సౌకర్యాలు పొందడంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. దసరా సందర్భంగా మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నా.. డెలివరీ పిన్కోడ్ దగ్గరే ఆర్డర్లు ఆగిపోతున్నాయని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొద్దిమంది తప్పిదాలకు అందరూ బాధితులు కావాల్సి వస్తుందని, ఆర్డర్లు తీసుకోని వినియోగదారులపై వ్యక్తిగతంగా చర్యలు తీసుకుని, అర్హత ఉన్న ఇతరులకు సేవలు అందించాలని కోరుతున్నారు. 507122 పిన్కోడ్ సమస్యను సంబంధిత సంస్థలు పరిష్కరించి ఆన్లైన్ డెలివరీ, బ్యాంకింగ్, క్రెడిట్, ఫైనాన్స్ సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.