6 దశల్లో భూముల రీ సర్వే.. రైతుల సమక్షంలోనే భూ కొలతలు
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో భూముల రీ సర్వేకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. భూముల కొలతలు, విస్తీర్ణంలో తేడాలు, భూ హక్కుల వివాదాలు, రెవెన్యూ రికార్డుల్లోని వ్యత్యాసాలకు పరిష్కారం చూపించేందుకు విధివిధానాలు ఖరారు చేసింది.
- సర్వేకు 4 రోజుల ముందే పట్టాదారుకు నోటీసులు
- గ్రామస్థాయి శిబిరాలతో భూ వివాదాలకు చెక్
- భూభారతిలోనే నమోదు.. రికార్డుల అప్‌గ్రేడేషన్
- విధివిధానాలు ఖరారు చేసిన భూపరిపాలన శాఖ
- హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల కలెక్టర్లకు కీలక మార్గదర్శకాలు జారీ చేసిన సీసీఎల్ఏ
హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో భూముల రీ సర్వేకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. భూముల కొలతలు, విస్తీర్ణంలో తేడాలు, భూ హక్కుల వివాదాలు, రెవెన్యూ రికార్డుల్లోని వ్యత్యాసాలకు పరిష్కారం చూపించేందుకు విధివిధానాలు ఖరారు చేసింది. మొత్తం ఆరు దశల్లో భూముల రీ సర్వే నిర్వహిస్తామని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) డీఎస్ లోకేశ్‌కుమార్ వెల్లడించారు. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో రీ సర్వేకు సంబంధించిన ‘స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్’ (ఎస్వోపీ) ను ఆయన శుక్రవారం విడుదల చేశారు. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లకు తెలంగాణ సర్వే, సరిహద్దుల చట్టం-1923, తెలంగాణ భూభారతి చట్టం-2025 నిబంధనలకు అనుగుణంగా ఆరు దశల్లో ఈ సర్వే చేపట్టాలని ఆదేశించారు.
మొదటి దశలో భాగంగా సర్వే బృందాలు భూభారతి పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసిన పహాణీ, ఫీల్డ్ రిజిస్టర్ ప్రతులను తప్పనిసరిగా క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి. సర్వే ప్రారంభించే ముందు గ్రామాల్లో చాటింపు వేయించి, గ్రామసభల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలి. కనీసం నాలుగు రోజుల ముందుగా పట్టాదారులకు నోటీసులు అందజేయాలి. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, అటవీ భూముల సరిహద్దులను గుర్తించేందుకు ఫారం-9, ఫారం-10 నోటీసులు జారీ చేయాలి. సర్వేకు రెండు రోజుల ముందే పట్టాదారులకు జెండాలు అందించి వారి పొలాల సరిహద్దు మూలల్లో నాటించాలని సూచించారు.
విస్తీర్ణంలో తేడా ఉంటే పట్టాదారుకు తెలియజేయాలి
రెండో దశలో క్షేత్రస్థాయిలో భూములను కొలుస్తారు. ఆ వివరాలను ఆన్లైన్లో ఎంట్రీ చేస్తారు. రికార్డుల్లో ఉన్న విస్తీర్ణానికీ, సర్వేలో కొలిచిన విస్తీర్ణానికీ మధ్య తేడాలుంటే పట్టాదారుకు తెలియజేస్తారు. మూడో దశలో తహసీల్దార్ స్థాయిలో క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. వివాదాలను గ్రామ స్థాయిలోనే పరిష్కరిస్తారు. మొత్తం ఎనిమిది రకాల కేసులను ఈ దశలో పరిశీలిస్తారు. గ్రామ స్థాయిలో మూడు, నాలుగు రోజులు క్యాంపులు నిర్వహించి సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తారు.నాలుగో దశలో పైస్థాయి అధికారులు క్షేత్రస్థాయి తనిఖీలు చేయాలి.
సెక్షన్-9 (2) ప్రకారం నోటీసులు జారీ చేసిన తర్వాత అప్పీల్ వ్యవధిలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ), ఆర్డీవో స్థాయి అధికారులు గ్రామాల్లో క్ష్రేతస్థాయి తనిఖీలు నిర్వహిస్తారు. పట్టాదారు అభ్యంతరాలను పరిష్కరిస్తారు. ఐదో దశలో తుది గెజిట్ నోటిఫికేషన్ జారీచేస్తారు. అప్పీళ్లు పరిష్కారమైన తర్వాత ఆర్డీవో ముందస్తు అనుమతితో సర్వే అండ్ ల్యాండ్ అధికారులు జిల్లా గెజిట్‌లో తుది నోటిఫికేషన్లో ప్రచురిస్తారు. ఆరో దశలో భూభారతి కింద ఆర్వోఆర్ అప్డేట్ చేస్తారు. మారిన వివరాలను ఆర్వోఆర్ రికార్డులు, భూభారతి పోర్టల్‌లో అప్డేట్ చేస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

