బూర్గంపహాడ్, ఆగస్టు 04 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచుతూనే బోధన అభ్యసన పద్ధతులు మెరుగుపర్చాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఈఓ వివాసంతి అన్నారు. మంగళవారం బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి తరగతి గదుల్లో ఉపాధ్యాయుల బోధనను పరిశీలించారు. అనంతరం తరగతి గదిలో విద్యార్ధుల ప్రగతిని తెలుసుకునేందుకు పాఠ్యాంశంలో ప్రశ్నలు వేస్తూ వారి నుంచి సమాధానాలు రాబట్టారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడంతో పాటు అభ్యసన పద్ధతులను మెరుగుపర్చి విద్యార్థుల నుంచి మంచి ఫలితాలు సాధించాలన్నారు. విద్యార్థులకు ప్రభుత్వం నుంచి వచ్చిన పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు ఇచ్చారా, ఇచ్చిన పుస్తకాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారా అని అడిగి తెలుసుకున్నారు.
చదువుతో పాటు ఆటల పట్ల విద్యార్ధులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, అంతేకాకుండా చదువు, క్రీడలతో పాటు విద్యార్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని పీడీ విద్యాసాగర్‌కు సూచించారు. అనంతరం మధ్యాహ్న భోజన నిర్వహణతో పాటు పాఠశాల పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అనంతరం అంజనాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి అక్కడ 3వ తరగతి విద్యార్థులతో అభ్యసన చేయించారు. ఇంగ్లీష్ పదాలకు అర్ధాలు చెప్పాలని వారిని అడిగి సమాధానాలు రాబట్టారు. విద్యార్థుల అభ్యసన సామర్ధ్యం మరింత పెంచేలా ఉపాధ్యాయులు కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ యదుసింహరాజు, ఇన్చార్జి హెచ్ఎం రామకృష్ణ, పీడీ విద్యాసాగర్, పాఠశాలల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.