దమ్మపేట, ఆగస్టు 04 : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశంలోని శ్రమజీవులపై దాడిని తీవ్రం చేసిందని, ప్రజలకు అందుతున్న కొద్దిపాటి సబ్సిడీలు కూడా పూర్తిగా రద్దు చేస్తుందని, స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే పని చేస్తుందని సీఐటీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ అన్నారు. ఈ నెల 10న జైలు భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దమ్మపేట పట్వారిగూడెం ఆరోగ్య కేంద్రాల్లో మంగళవారం ఆశ వర్కర్ల సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మిక చట్టాలు సవరించి లేబర్ కోడ్లు తీసుకురావడం వల్ల ఒకవైపు కంపెనీల లాభాలు పెరుగుతుంటే, మరోవైపు కార్మికుడు తన కుటుంబాన్ని పోషించడానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడన్నారు. స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని, కనీస వేతనం రూ.42 వేలు ఇవ్వాలని, 8 గంటల పని దినం అమలు చేయాలని, కార్మిక రైతు వ్యతిరేక దేశ ప్రయోజనాలకు విరుద్ధమైన ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని, ఈ నెల 10న జరిగే ప్రభుత్వ కార్యాలయాల దిగ్బంధనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ మురహరి రఘు, రామకృష్ణ, సునీత, శ్రీలత, సరోజినీ, రాధ, నాగమణి పాల్గొన్నారు.