Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి అంటేనే డ్యాన్స్‌కు పెట్టింది పేరు. ఎన్నో దశాబ్దాలుగా తనదైన డ్యాన్స్ స్టైల్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న చిరంజీవి.. ఇప్పటికీ తన ఎనర్జీతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. అలాంటి మెగాస్టార్‌తో కలిసి ఒక్క పాటలో డ్యాన్స్ చేసే అవకాశం వస్తే ఏ హీరోయిన్ అయినా సంతోషంగా అంగీకరిస్తుందని అభిమానులు భావిస్తుంటారు. అయితే హీరోయిన్ ఫరియా అబ్దుల్లాకు మాత్రం చిరంజీవితో కలిసి డ్యాన్స్ చేసే అవకాశం వచ్చినా ఆమె చేయలేదనే విషయం ఇప్పుడు టాలీవుడ్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.ఇటీవల జరిగిన ‘సిగ్మా’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫరియా అబ్దుల్లా గురించి మాట్లాడుతూ మెగాస్టార్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ‘విశ్వంభర’ సినిమాలో తనతో కలిసి ఫరియా ఓ ప్రత్యేక గీతంలో కనిపించాల్సి ఉందని చెప్పారు.
అయితే ఆ అవకాశం ఎందుకు వదులుకున్నారనే విషయాన్ని సరదాగా ప్రస్తావిస్తూ.. తమ ఇద్దరి మధ్య ఎత్తు విషయంలో తేడా ఉందనే విషయాన్ని చిరంజీవి ప్రస్తావించారు. అవసరమైతే తాను హీల్స్ వేసుకుంటానంటూ ఫరియాపై సరదాగా వ్యాఖ్యలు చేయడంతో అక్కడున్నవారంతా నవ్వుకున్నారు.చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఫరియా అబ్దుల్లా ఇప్పటికే నటిగా మాత్రమే కాకుండా మంచి డ్యాన్సర్‌గా, గాయనిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో ప్రత్యేక గీతాల్లోనూ ఆమె సందడి చేశారు. అలాంటప్పుడు చిరంజీవితో కలిసి డ్యాన్స్ చేసే అవకాశం వచ్చినా ఎందుకు చేయలేదనే ప్రశ్న ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.అయితే దీనిపై ఫరియా నుంచి స్పష్టమైన కారణం బయటకు రాలేదు. షూటింగ్ తేదీలు కుదరకపోవడం వల్లనా? ఇతర సినిమా కమిట్మెంట్ల కారణంగానా? లేక చిరంజీవి సరదాగా ప్రస్తావించిన ఎత్తు విషయంలోని కారణమేనా? అనే చర్చ జరుగుతోంది.
అయితే అసలు కారణం ఏమిటనేది ఫరియా స్వయంగా చెబితేనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం మెగాస్టార్‌తో కలిసి డ్యాన్స్ చేసే అరుదైన అవకాశాన్ని ఫరియా మిస్ చేసుకున్నారనే విషయం అభిమానుల మధ్య చర్చగా మారింది. ఇక ఇదే వేడుకలో చిరంజీవి తన తదుపరి చిత్రం ‘కాకా’ గురించి కూడా కీలక విషయాలను వెల్లడించారు. ఈ సినిమాకు తమన్ త్వరలోనే నేపథ్య సంగీతం, రీరికార్డింగ్ పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే సినిమా మొదటి భాగం పూర్తిగా సిద్ధమైనట్లు వెల్లడించారు. ప్రస్తుతం రెండో భాగం చిత్రీకరణ వేగంగా కొనసాగుతోందని, ఇప్పటికే దాదాపు 30 శాతానికి పైగా షూటింగ్ పూర్తయిందని చిరంజీవి చెప్పినట్లు సమాచారం. వచ్చే సంక్రాంతికి ‘కాకా’ ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెబుతూ.. మెగా అభిమానుల్లో సినిమాపై అంచనాలను మరింత పెంచారు.