రుద్రంపూర్, ఫిబ్రవరి 25 : కొత్తగూడెం ఏరియా పరిధిలోని 5-ఇంక్లైన్, మాయాబజార్ గ్రామస్తులు, ధన్బాద్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ రాందాస్ నాయక్ కలిసి సింగరేణి కొత్తగూడెం ఏరియా జీఎం శాలెం రాజును బుధవారం కలిశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ రాందాస్ నాయక్, గ్రామస్తులు తమ ప్రాంతానికి సంబంధించిన పలు సమస్యలను జీఎం దృష్టికి తీసుకువెళ్లారు. సీఎస్ఆర్ నిధులను తక్షణమే విడుదల చేయాలని, స్థానికులకు డీఎల్ఆర్ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, 5-ఇంక్లైన్, మాయాబజార్ గ్రామస్తులకు కేటాయించిన ఇంటి స్థలాలు (సర్వే నెం. 143, గంగా హుస్సేన్ బస్తీ, కొత్తగూడెం పరిధి)లో రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీరు, స్ట్రీట్ లైట్లు వంటి మౌలిక వసతులు వెంటనే కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామస్తుల అభ్యర్థనలపై జీఎం సానుకూలంగా స్పందిస్తూ సంబంధిత అధికారులతో చర్చించి తక్షణ చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పలువురు గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.