Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి మరోసారి తనదైన స్టైల్లో ‘చిరు లీక్స్’కు తెరతీశారు. సాధారణంగా తన సినిమాలకు సంబంధించిన కీలక విషయాలను చిత్రబృందం అధికారికంగా ప్రకటించేలోపే సరదాగా లీక్ చేస్తూ అభిమానుల్లో ఆసక్తిని పెంచే చిరంజీవి.. తాజాగా మరోసారి అదే పని చేశారు. ఈసారి తన 158వ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను స్వయంగా బయటపెట్టారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ మీట్‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సరదా సంభాషణలో తన కొత్త సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు. దీంతో మెగా అభిమానుల్లో ఒక్కసారిగా సందడి నెలకొంది.
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబీ కొల్లి) కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం చిరంజీవి కెరీర్లో 158వ సినిమాగా రూపొందుతోంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ కాంబినేషన్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు ‘కదిరి’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు చిరంజీవి స్వయంగా వెల్లడించారు. ఈ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించకముందే చిరంజీవి లీక్ చేయడంతో ‘చిరు లీక్స్’ హ్యాష్‌ట్యాగ్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ మీట్లో లీక్స్ గురించి ప్రస్తావన వచ్చిన సమయంలో సంగీత దర్శకుడు తమన్ సరదాగా స్పందించారు. ఈ క్రమంలో టీజర్ మ్యూజిక్ పూర్తయిందా? టీజర్ చివరలో ‘కదిరి’ అనే టైటిల్‌ను చూపించారా? అంటూ చిరంజీవి ప్రశ్నించారు.
అయితే అక్కడే అసలు విషయం బయటపడింది. చిరంజీవి నోటి నుంచి ‘కదిరి’ అనే టైటిల్ రావడంతో అభిమానులు, మీడియా ప్రతినిధులకు సినిమా టైటిల్‌పై క్లారిటీ వచ్చేసింది. దీంతో ఈ లీక్‌కు సంబంధించిన వీడియోలు, కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టైటిల్‌తో పాటు సినిమాకు సంబంధించిన మరో కీలక అప్డేట్ కూడా వెలుగులోకి వచ్చింది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ‘కదిరి’ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీంతో మెగా అభిమానులు ఈ టీజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.చిరంజీవి బర్త్‌డే సందర్భంగా టీజర్ రిలీజ్ కానుండటంతో సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. టీజర్లో చిరంజీవి లుక్, పాత్ర స్వభావం, కథకు సంబంధించిన ఏమైనా క్లూస్ ఇస్తారా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ‘కదిరి’లో చిరంజీవి సరసన ప్రియమణి కథానాయికగా నటిస్తున్నారు. దీంతో పాటు కన్నడ నటి రచితా రామ్, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘ఛాంపియన్’ ఫేమ్ అనశ్వర రాజన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఆమె చిరంజీవి మేనకోడలి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.