(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌లో ఓ చానల్‌ను క్రియేట్ చేసి డబ్బులు సంపాదించుకోవాలనుకొంటున్నారా? అయితే, అలాంటి క్రియేటర్లకు యూట్యూబ్ భారీ షాక్ ఇచ్చింది. మానిటైజేషన్‌కు (డబ్బు సంపాదనకు) అవసరమైన నిబంధనలను సంస్థ మరింత కఠినతరం చేసింది. యూట్యూబ్ నుంచి ఆదాయం పొందే అర్హత సాధించాలంటే కొత్త కంటెంట్ క్రియేటర్లు మునుపటి కంటే రెండింతల వాచ్‌టైమ్‌ను సంపాదించుకోవాల్సిందేనని తెలిపింది. ఈ మేరకు షార్ట్స్, ప్రకటనలు, ప్రీమియం ఆదాయ భాగస్వామ్యానికి సంబంధించిన యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ (వైపీపీ) నిబంధనలను సంస్థ సవరించింది. కొత్త నిబంధనలు 2027 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్టు పేర్కొంది.
అప్పుడు అలా.. ఇకపై ఇలా..
గతంలో యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించాలంటే కంటెంట్ క్రియేటర్లు గత 365 రోజుల్లో కనీసం 4 వేల వాచ్ అవర్లు లేదా కోటి షార్ట్స్ వ్యూస్ సంపాదించాల్సి ఉండేది. అయితే, కొత్త నిబంధనల ప్రకారం.. డబ్బు సంపాదించాలంటే గత 365 రోజుల్లో 8 వేల వాచ్ అవర్లు లేదా గత 90 రోజుల్లో 2 కోట్ల షార్ట్స్ వీక్షణలు తప్పనిసరి చేసింది. యూట్యూబ్ షార్ట్స్ ద్వారా వచ్చే ఆదాయం కోసం కనీస అర్హతను 90 రోజుల వ్యవధిలో ఒక కోటి షార్ట్స్ వ్యూస్‌గా నిర్ణయించింది. ఈ నిబంధన కొత్త కంటెంట్ క్రియేటర్లకే కాకుండా ఇప్పటికే ఉన్నవారికి కూడా వర్తిస్తుందని తెలిపింది. కాగా, మానిటైజేషన్ కోసం చానల్‌కు వెయ్యి మంది సబ్‌స్ర్కైబర్లు ఉండాలన్న నిబంధనలో మాత్రం ఎటువంటి మార్పు చేయకపోవడం ఊరటనిచ్చే విషయం.
కారణమేంది?
ప్లాట్ఫామ్లో క్రియేటర్ల సంఖ్య భారీగా పెరుగుతుండటం, కంటెంట్ క్వాలిటీ తగ్గుతుండటంతో మానిటైజేషన్ నిబంధనలను కంపెనీ మరింత కఠినతరం చేసినట్టు సమాచారం.
ఆరేండ్ల తర్వాత తొలిసారి
వైపీపీలో భాగంగా 2018లో చివరిసారిగా మానిటైజేషన్ నిబంధనలను కంపెనీ మార్చింది. ఆ తర్వాత ఇప్పుడే మళ్లీ భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. కాగా వైపీపీ ద్వారా ఇప్పటికే 30 లక్షలకు పైగా కంటెంట్ క్రియేటర్లు ఆదాయాన్ని పొందుతున్నట్టు సమాచారం.