చుంచుపల్లి, ఫిబ్రవరి 27 : వెంకటేష్ ఖని పంచాయతీ పరిధిలోని సెవెన్ ఇంక్లైన్ గుట్టపై ఘనంగా శ్రీ భూనీల సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి కల్యాణ మహోత్సవం నిర్వహించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ కల్యాణ క్రతువు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఉదయం వేళ నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. వేద పండితులు వేద మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా కల్యాణ కార్యక్రమం నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక అలంకరణలు చేసి, పుష్పాలతో గుట్ట ప్రాంగణాన్ని అందంగా ముస్తాబు చేశారు. కల్యాణ వేడుకల సందర్భంగా మంగళ వాయిద్యాలు మారుమోగి భక్తుల్లో భక్తి భావాన్ని మరింత పెంచాయి. నాదస్వరాలు, తాళాలు, డోలు వాయిద్యాల శుభ నాదం మధ్య స్వామివారి కల్యాణం వైభవంగా కొనసాగింది.
కల్యాణ సమయంలో అర్చకులు స్వామివారి దివ్య గుణాలను, కల్యాణ మహిమలను వివరించారు. కల్యాణానంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. స్థానిక ప్రజలు, యువకులు, మహిళలు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని సేవలందించారు. కల్యాణం అర్చకులు విజ్ఞాచారి, ఉదయాచారి శశికిరణ్, గిరిధర చారి పూజారుల ఆధ్వర్యంలో ఈ తంతు జరగగా గని మేనేజర్ ప్రసాద్ కమిటీ మెంబర్ల ఆధ్వర్యంలో కల్యాణం నిర్వహించారు. అతిథులుగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ గణేశ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సెవెన్ ఇంక్లైన్ గుట్టపై ఘనంగా వేంకటేశ్వర స్వామి కల్యాణం