– సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) కె. వెంకటేశ్వర్లు
– కొత్తగూడెం ఏరియాలో జీవీటీసీ ప్రారంభం
– అప్రెంటిస్‌లకు సర్టిఫికెట్ల ప్రదానం
రుద్రంపూర్, జూలై 30 : సింగరేణి సంస్థ నిర్వహిస్తున్న అప్రెంటిస్ శిక్షణ యువతలో సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడమే కాకుండా వారి భవిష్యత్ ఉపాధికి బలమైన పునాదిగా నిలుస్తుందని సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) కె.వెంకటేశ్వర్లు అన్నారు. సింగరేణి సంస్థలో ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధి, భద్రతా ప్రమాణాల పెంపు లక్ష్యంగా కొత్తగూడెం ఏరియాలోని 3 ఇన్క్లైన్లో ఏర్పాటు చేసిన గ్రూప్ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ (GVTC)ను గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం అప్రెంటిస్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి వివిధ సంస్థల్లో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు సర్టిఫికెట్లను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ (పీ&పీ) మాట్లాడుతూ, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకున్న వారికి ఉపాధి అవకాశాలు మరింత విస్తృతంగా లభిస్తాయని, అప్రెంటిస్ శిక్షణ ఆ దిశగా కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.
కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలెం రాజు మాట్లాడుతూ.. 2025 సంవత్సరంలో వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ (VTC) ద్వారా 2,084 మంది సింగరేణి ఉద్యోగులు, 4,952 మంది కాంట్రాక్ట్ కార్మికులు శిక్షణ పొందగా మొత్తం 7,036 మందికి శిక్షణ అందించినట్లు తెలిపారు. నాణ్యమైన శిక్షణతో పాటు విలువైన పని అనుభవాన్ని అందించడం ద్వారా సింగరేణి దేశానికి నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందిస్తోందన్నారు. అలాగే నిరుద్యోగ యువత కోసం నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా 2025–26 సంవత్సరంలో సింగరేణి ఆధ్వర్యంలో జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ (శంషాబాద్) సహకారంతో శిక్షణ పొందిన పలువురికి ఉద్యోగాలు లభించడం ఆనందదాయకమని పేర్కొన్నారు. శిక్షణ ద్వారా పొందిన విజ్ఞానాన్ని ఉద్యోగ జీవితంలో సమర్థవంతంగా వినియోగించి సంస్థలకు, సమాజానికి ఆదర్శంగా నిలవాలని అభ్యర్థులకు సూచించారు. అనంతరం డైరెక్టర్ (పీ&పీ) జీవీటీసీ శిక్షణా కేంద్రంలోని తరగతి గదులు, ఆధునిక శిక్షణా పరికరాలు, భద్రతా సదుపాయాలను పరిశీలించారు. జీవీటీసీ ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, భద్రతా ప్రమాణాలపై నిరంతర శిక్షణ అందించడం వల్ల ఉద్యోగుల సామర్థ్యం, ఉత్పాదకత, భద్రత మరింత మెరుగుపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జీఎం (హెచ్ఆర్డీ) ఆర్.విజయ ప్రసాద్, కొత్తగూడెం ఏరియా జీఎం ఎం. షాలెం రాజు, వీకేసీఎం ప్రాజెక్టు అధికారి నరసింహరావు, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మల్లికార్జున్ రావు, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్, ఎస్వో టు జీఎం ఎం. గోవిందరావు, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ మొక్కపాటి వెంకటేశ్వర్లు, ఏజీఎం (ఫైనాన్స్) బీభత్స, ఏజీఎం (సివిల్) రామకృష్ణ, కె. రాజారాం, ఏరియా ఇంజనీర్ వి. రామకృష్ణ, విటీసీ మేనేజర్ లక్ష్మణ్, డీజీఎం (ఈ&ఎం) ఏరియా వర్క్‌షాప్ క్రిస్టోఫర్, పర్సనల్ మేనేజర్ ఎల్. తిరుపతి, మేనేజర్ (ఐటీ) శేష శ్రీ, సీనియర్ ఎస్టేట్ ఆఫీసర్ బి. తౌర్య, ఎస్.ఈ. చంద్రశేఖర్, సీనియర్ పీఓ మజ్జి మురళి, ఏరియా అధికారులు, అప్రెంటిస్ అభ్యర్థులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.