Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు 10లో 12వ రోజు కెప్టెన్సీ టాస్కులు ఉత్కంఠగా సాగాయి. పలు దశల్లో జరిగిన పోటీల అనంతరం రైతు బిడ్డ ఝాన్సీ విజయం సాధించి సీజన్లో తొలి కెప్టెన్‌గా నిలిచారు. చివరి దశలో రామ్ ప్రసాద్‌తో తలపడిన ఝాన్సీ.. వేగంగా టాస్క్ పూర్తి చేసి కెప్టెన్సీని సొంతం చేసుకున్నారు. దీంతో బిగ్ బాస్ ఆమెకు అభినందనలు తెలియజేయడంతో పాటు హౌస్‌లో ప్రత్యేక గదిని కేటాయించారు. కెప్టెన్సీ కంటెండర్లుగా ముఖేష్, షాలిని, ఝాన్సీ, త్రిగుణ్, రామ్ ప్రసాద్ పోటీ పడ్డారు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ప్రకారం ఈ ఐదుగురు జైలులో ఉండగా, మిగిలిన హౌస్మేట్స్ గార్డులుగా వ్యవహరించారు. వంశీ, రోహిత్ గార్డులను నియంత్రించే బాధ్యతలు తీసుకున్నారు. జైలు గేట్లు తెరిచిన వెంటనే కంటెండర్లు బయటకు వచ్చి గోడ దూకి సేఫ్ జోన్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. అయితే గార్డులు తమకు కెప్టెన్‌గా చూడకూడదనుకున్న కంటెండర్‌ను అడ్డుకునే అవకాశం ఉంటుంది.
ప్రతి రౌండ్లో గార్డులకు చిక్కిన కంటెండర్ టాస్క్ నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో గార్డులు రెండు గ్రూపులుగా విడిపోయారు. వర్షిణి, నరేష్, దేబ్జానీ తదితరులు షాలినిని లక్ష్యంగా చేసుకున్నారు. మరోవైపు రామ్ ప్రసాద్, త్రిగుణ్, ముఖేష్ గోడ దూకి సేఫ్ జోన్లోకి చేరుకున్నారు. ఝాన్సీని కూడా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే షాలినిని అడ్డుకునే సమయంలో గార్డుల దృష్టి ఝాన్సీపై నుంచి మళ్లడంతో ఆమె సేఫ్ జోన్లోకి వెళ్లగలిగారు. ఇదే సమయంలో షాలినిని అడ్డుకుంటూ వర్షిణి చేసిన వ్యాఖ్యలు హౌస్‌లో వివాదానికి దారితీశాయి. రామ్ ప్రసాద్ కెప్టెన్ కావాలనేది తమ కోరిక అని, షాలినికి వయసు, అనుభవం తక్కువగా ఉండటంతోనే ఆమెను అడ్డుకుంటున్నామని వర్షిణి చెప్పింది. ఈ వ్యాఖ్యలపై షాలిని తీవ్రంగా స్పందించింది.
కెప్టెన్ కావడానికి వయసే ప్రమాణమా అంటూ షాలిని ప్రశ్నించింది. తన వయసును మధ్యలోకి తీసుకురావాల్సిన అవసరం ఏముందని వర్షిణిని నిలదీసింది. వయసు ఎక్కువగా ఉన్నవారే కెప్టెన్ కావాలనే నిబంధన ఏదీ లేదని, అలాంటప్పుడు ఆటలు ఆడటం ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. ఆ తర్వాత జరిగిన మరో రౌండ్లో గార్డులు ముఖేష్‌ను అడ్డుకున్నారు. అనంతరం త్రిగుణ్ కూడా టాస్క్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. దీంతో చివరికి రామ్ ప్రసాద్, ఝాన్సీ కెప్టెన్సీ పోటీలో నిలిచారు. చివరి దశలో రామ్ ప్రసాద్, ఝాన్సీ మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. బిగ్ బాస్ ఇచ్చిన నిబంధనల ప్రకారం కట్టర్ ఉపయోగించి ఫెన్సింగ్‌ను కట్ చేసి అవతలి వైపుకు చేరుకోవాలి. అక్కడికి చేరుకున్న తర్వాత కెప్టెన్సీ జెండాను ఎగరేసిన వ్యక్తే విజేతగా నిలుస్తారు.
ఈ చివరి టాస్క్‌ను ఝాన్సీ ముందుగా పూర్తి చేశారు. దీంతో బిగ్ బాస్ తెలుగు 10లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ ఎంపికయ్యారు. ఆమె విజయం సాధించడంతో హౌస్‌లో ప్రత్యేక గది కూడా దక్కింది. మొత్తంగా 12వ రోజు ఎపిసోడ్లో కెప్టెన్సీ పోటీతో పాటు షాలిని–వర్షిణి మధ్య జరిగిన వాగ్వాదం కూడా హైలైట్‌గా నిలిచింది.