న్యూఢిల్లీ: ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వీ కామకోటిని గోమూత్ర నిపుణుడు(Gau Mutra Expert) అంటూ కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ లోక్‌సభలో విమర్శించారు. నీట్ పేపర్ లీకేజీ నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రకటించిన హైపవర్డ్ కమిటీలో కామకోటి ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ కమిటీలో గోమూత్ర నిపుణుడిని నియమించినట్లు ప్రియాంకా గాంధీ తన లోక్‌సభ ప్రసంగంలో విమర్శించారు. ఆ ఆరోపణలను ఖండిస్తూ ఇవాళ దేశంలోని విద్యావేత్తలు కాంగ్రెస్ నేతకు లేఖ రాశారు. సుమారు 215 మంది వైస్ ఛాన్సలర్లు, మాజీ వీసీలు ఆ బహిరంగ లేఖపై సంతకాలు చేశారు. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వీ కామకోటిని గోమూత్ర నిపుణుడిగా పేర్కొనడం పట్ల విద్యావేత్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం ఉన్నత విద్యావేత్తను అపహాస్యం చేయరాదన్నారు.
ప్రొఫెసర్ కామకోటిని గోమూత్ర నిపుణుడిగావర్ణించడాన్ని వ్యతిరేకిస్తూ నిరాశను వ్యక్తం చేస్తున్నట్లు విద్యావేత్తలు తమ లేఖలో పేర్కొన్నారు. వెటకారం కోసం ఆ వ్యాఖ్యలు చేసినా, లేదా రాజకీయ అవసరాల కోసం చేసినా, అలాంటి వ్యాఖ్యలు తీవ్ర సమస్యలు సృష్టిస్తాయన్నారు. దేశంలోని అత్యంత పటిష్టమైన శాస్త్రీయ, సాంకేతిక విద్యాసంస్థలో ప్రొఫెసర్ కామకోటి డైరెక్టర్‌గా ఉన్నట్లు ఆ లేఖలో తెలిపారు. ప్రతి విద్యావేత్త తరహాలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక హైపోథీసిస్ ప్రజెంట్ చేస్తారని, సంప్రదాయ జ్ఞానాన్ని చర్చిస్తారని, శాస్త్రీయ చర్చల్లో పాల్గొంటారని అన్నారు. ఓ ప్రఖ్యాత విద్యావేత్తకు ముద్ర వేయడం సరికాదన్నారు. ఆయనలోని శాస్త్రీయ దృక్కోణాన్ని అర్థం చేసుకోవాలని అన్నారు.
బ్యాక్టీరియా, ఫంగస్‌ను నియంత్రించే శక్తి గోమూత్రానికి ఉందని గతంలో కామకోటి ఓ స్టడీ ద్వారా వెల్లడించారు.