యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 29: యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వ డొల్లతనం బయటపడింది. ఆర్భాటానికి చేసే ప్రకటనలకు, అమలుకు సంబంధమే లేదని తేలిపోయింది. ‘బోర్డులోని ఒక్కో సభ్యుడికి రాష్ట్రంలో ధనవంతులుగా పేరున్నదని, ధనికులను ట్రస్టు బోర్డులో చేర్చడం ద్వారా వారిచ్చే ఆర్థిక సహకారంతో యాదగిరిగుట్టను అభివృద్ధి చేయవచ్చు’ అని వైటీడీ (యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు) సభ్యుల నియామకం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి సెలవిచ్చారు. దీనికి తగ్గట్టే ట్రస్ట్ బోర్డు సభ్యులు కూడా తాము సొంత నిధులతో పనులు చేపడుతామంటూ ఆర్భాటంగా ప్రకటనలు చేశారు. తీరా అమల్లోకి వచ్చేసరికి మాత్రం చేతులెత్తేశారు. చివరికి యాదగిరిగుట్టలో అభివృద్ధి పనులకు ‘దాతలు కావలెను’ అంటూ దేవస్థానం సిబ్బంది కరపత్రాలను పంపిణీ చేసే స్థాయికి పరిస్థితి దిగజారింది. ఈ పరిణామాల పట్ల భక్తులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
దేవస్థానాన్ని అప్రతిష్టపాలు చేసేలా ప్రభుత్వం, ట్రస్టు సభ్యులు, అధికారులు ప్రవర్తిస్తున్నారంటూ మండిపడుతున్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ యాదగిరిగుట్ట ఆలయాన్ని సంపూర్ణంగా ప్రభుత్వ నిధులతోనే పునర్నిర్మించిన సంగతి తెలిసిందే. డోనర్ కాటేజీలు, దివ్య విమానగోపుర స్వర్ణతాపడానికి మినహా ఆలయ నిర్మాణంలో ఏ ఒక్క దాత సహకారాన్ని కూడా కేసీఆర్ నాడు కోరలేదు. అలాంటిది ఇప్పుడు పరిస్థితి ఎందుకు తలకిందులైందని భక్తులు, స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నిరుడు మార్చి 18న నిర్వహించిన ప్రపంచ అందాల పోటీలకు దేవస్థాన నిధుల్లో నుంచి రూ.కోటి వినియోగించి, ఇప్పుడు స్వామివారి ఆలయ అభివృద్ధికి భిక్షాటన చేస్తారా? అంటూ మండిపడుతున్నారు.
సుమారు రూ.1,300 కోట్లతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరిగుట్ట ఆలయాన్ని సర్వహంగులు కలిగిన అద్భుత కట్టడాలతో పునర్నిర్మాణం చేశారు. ఆలయంలో నాడు కిలోలకొద్ది బంగారు తాపడం చేయించి ప్రపంచవ్యాప్త ప్రసిద్ధిని తీసుకొచ్చారు. ఈ ఆలయానికి తిరుమల తరహాలో ప్రతిష్ఠను తీసుకొచ్చారు. ఆధ్యాత్మిక శోభ విరజిల్లేలా ప్రత్యేక శిలలతో శిల్పాలను చెక్కించారు. ఆనాటి నుంచి దినదినాభివృద్ధి చెందుతూ వస్తున్న యాదగిరిగుట్ట ఆలయ నిర్వహణ చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది. దేవస్థానంలో అభివృద్ధి పనుల కోసం అడుక్కునే స్థాయికి దిగజారింది. ఏమి విచిత్రమో కానీ, ఇప్పటికే చేపట్టిన నిర్మాణాలకు, ట్రస్ట్ సభ్యులు సొంత నిధులతో చేయిస్తామన్న పనులకూ దాతలు కావాలి అంటూ కరపత్రంలో పేర్కొనడంపై భక్తులు పెద్ద ఎత్తున విస్మయం వ్యక్తంచేస్తున్నారు. సర్కార్ వైఫల్యంపై, దేవస్థానం అసమర్థతపై మండిపడుతున్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా నాడు కేసీఆర్ హయాంలో పూర్తయిన, ప్రారంభమైన అనేక పనులకు ఇప్పుడు వైటీడీ దాతలను ఆహ్వానిస్తున్నది. దీంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పూర్తయిన పనులను మళ్లీ ఎలా చేపడుతారని ప్రశ్నిస్తున్నారు. కొండకింద లక్ష్మీపుష్కరిణి ప్రాంతంలో రూ.8.90 కోట్లతో 18,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీక్షాపరుల మండపాన్ని గతంలోనే నిర్మించారు. ప్రస్తుతం ఈ మండపాన్ని గోదాం కోసం వినియోగిస్తున్నారు. దానిని పక్కనబెట్టి ఇప్పుడు కొండపైన మరో దీక్షాపరుల మండపం నిర్మాణానికి రూ.43.12 కోట్లు కావాలంటూ దాతల సహకారం కోరుతున్నారు.
రాయగిరి మెట్ల బావి వద్ద రూ.43 కోట్లతో వేద పాఠశాల నిర్మాణానికి 2023 జూన్ 21న అప్పటి మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, గొంగిడి సునీత భూమిపూజ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మండపాన్ని టెంపుల్ సిటీపైకి మార్చి, ఇప్పుడు దాతల సహకారాన్ని కోరుతున్నది. మెట్ల మార్గంలో కానోపి షెడ్‌ను హైదరాబాద్‌కు చెందిన అగర్వాల్ నిర్మిస్తున్నట్టు స్థానికులు చెప్తున్నారు. అయినా ప్రభుత్వం మళ్లీ రూ.1.41 కోట్లు కావాలంటూ దాతల సహకారాన్ని కోరుతున్నది. ఇలా ప్రతి పనికీ దాతల సహకారాన్ని కోరడంపై భక్తులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
