మహీ ముగించాడు
ప్రొఫెషనల్ క్రికెట్లో, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఓ సువర్ణాధ్యాయం ముగిసింది.
- క్రికెట్‌కు ధోనీ వీడ్కోలు l 19 ఏండ్ల ఐపీఎల్ ఆటకు తెర
- వీడియో కాల్లో టీమ్ మేనేజ్మెంట్ కు నిర్ణయం చెప్పిన ఎంఎస్
- 2027 సీజన్ నుంచి సీఎస్కే మెంటార్ గా కొత్త అవతారం
పసుపు రంగు దుస్తుల్లో ఏడో నంబర్ జెర్సీ ఆటగాడు మైదానంలోకి అడుగు పెడుతుంటే వచ్చే ఆ హోరు ఇక వినిపించదు. డగౌట్ నుంచి అతడు బ్యాట్ పట్టుకుని నడిచి వస్తుంటే కలిగే ఆ అద్భుత దృశ్యం ఇక కనిపించదు. హెలికాప్టర్ షాట్లు.. రెప్పపాటులో చేసే స్టంపింగ్స్.. థర్డ్ అంపైర్ కంటే ముందే తేల్చేసే నిర్ణయాలు ఇక గతం. భారత క్రికెట్ దిగ్గజం, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఆత్మ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ ఆటగాడిగా తన 19 ఏండ్ల సుదీర్ఘ ప్రస్థానానికి తెరదించాడు.
2020 ఆగస్టులో అంతర్జాతీయ కెరీర్ కు వీడ్కోలు పలికిన మహీ ఈ నిర్ణయంతో ప్రొఫెషనల్ క్రికెట్‌ను ముగించాడు. గాయం కారణంగా గత ఐపీఎల్ సీజన్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని 45 ఏండ్ల మహీ ఆటను వదిలేసినా.. సీఎస్కేను మాత్రం వీడటం లేదు. ఇకపై మైదానంలో చెన్నై జట్టును మెంటార్ గా నడిపించనున్నాడు.
చెన్నై: ప్రొఫెషనల్ క్రికెట్లో, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఓ సువర్ణాధ్యాయం ముగిసింది. మెగా లీగ్ లో సీఎస్కేను విజయవంతమైన జట్టుగా తీర్చిదిద్ది.. ముంబైతో సమానంగా ఆ జట్టుకు ఐదు టైటిళ్లు అందించిన ఎంఎస్ ధోనీ తన ఆటకు పూర్తిగా తెరదించాడు. 2020 ఆగస్టులో ఇన్‌స్ట్రాగామ్ పోస్ట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మహీ ఐపీఎల్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని కూడా అంతే అనూహ్యంగా.. అంతే శాంతంగా ప్రకటించాడు. శనివారం జరిగిన సీఎస్కే టీమ్ మేనేజ్ మెంట్ వీడియో కాల్లో ఈ నిర్ణయం వెల్లడించాడని జట్టు సహ యజమాని రూప గురునాథ్ తెలిపారు.
‘ఈ రోజు (శనివారం) మేమంతా వీడియో కాల్లో వచ్చే సీజన్ వ్యూహాలు, వేలంలో తీసుకోవాల్సిన ఆటగాళ్లు, రిలీజ్ చేయాల్సిన ఆటగాళ్ల జాబితాపై సుదీర్ఘంగా చర్చించాం. చివర్లో మా సీఈఓ కాశీ విశ్వనాథన్ రిలీజ్ చేసే ఆటగాళ్ల జాబితా చదువుతుండగా.. “బహుశా అందులో నా పేరు కూడా చేర్చాల్సి ఉంటుందేమో” అని ధోనీ చాలా నెమ్మదిగా అన్నారు. ఆ మాట వినగానే వీడియో కాల్ ఒక్కసారిగా కట్ అయిపోయింది. మళ్లీ కాల్ చేసి..మీరు ఆడరన్న విషయాన్ని ఇంటర్నెట్ కూడా తట్టుకోలేకపోయిందని అని చెప్పాను.
జట్టుకు 200 శాతం న్యాయం చేయలేనని భావిస్తే ధోనీ అస్సలు ఆడరు’ అని రూప భావోద్వేగంతో పేర్కొన్నారు. 2008లో సీఎస్కేలో చేరినప్పటి నుంచి ఆ జట్టుకు కెప్టెన్ గా ఉన్న ధోనీ ఐదు ఐపీఎల్ టైటిళ్లు, రెండు చాంపియన్స్ లీగ్ టీ20 ట్రోఫీ అందించాడు. తన నాయకత్వంలో సీఎస్కే ఏకంగా పది సార్లు ఫైనల్, 12 సార్లు ప్లే ఆఫ్స్ చేరింది. మెగా లీగ్ లో మొత్తంగా 278 మ్యాచ్‌లు ఆడిన మహీ 5,439 పరుగులు సాధించాడు.
నంబర్ 7 జెర్సీకి రిటైర్మెంట్?

ధోనీ లేకుండా సీఎస్కేను ఊహించుకోలేమని, జట్టులో యువ ఆటగాళ్లు ఉన్న ఈ సంధి దశలో అతని అనుభవం ఎంతో విలువైనదని ఫ్రాంచైజీ యజమాని ఎన్. శ్రీనివాసన్, రూప పేర్కొన్నారు. ‘ధోనీ సాధించిన ట్రోఫీలే కాదు, వాటిని గెలిచిన విధానమే అసలైన వారసత్వం. మైదానంలో పసుపు జెర్సీలో మహీని మిస్ అవుతాం కానీ, డ్రెస్సింగ్ రూమ్‌లో యువ ఆటగాళ్లకు దిశానిర్దేశం చేస్తూనే ఉంటాడు’ అని సీఈఓ కాశీ విశ్వనాథన్ అన్నారు. అభిమానుల ఆకాంక్ష మేరకు ధోనీ ఐకానిక్ నంబర్ 7 జెర్సీకి రిటైర్మెంట్ ప్రకటించే అంశంపై తగిన సమయంలో నిర్ణయం సుకుంటామని తెలిపారు.
ధోనీడలో సీఎస్కే..
సూపర్ స్టార్ రజనీకాంత్‌లాగే బయటి రాష్ట్రం (రాంచీ) నుంచి వచ్చి తమిళనాడు దత్తపుత్రుడిగా మారిపోయిన ధోనీ దాదాపు రెండు దశాబ్దాలుగా చెన్నై నగరంతో విడదీయరాని అనుబంధాన్ని పెంచుకున్నాడు. అభిమానులు ‘తలా’ అని పిలుచుకునే మహీ 2008 తొలి సీజన్ వేలంలో సీఎస్కేలో చేరి ఆ జట్టును లీగ్‌లోనే అత్యంత నిలకడైన శక్తిగా తీర్చిదిద్దాడు.
జట్టుకు ముఖచిత్రంలా.. ఐపీఎల్‌కే ఓ పోస్టర్ బాయ్‌లా మారాడు. ఒత్తిడిని తట్టుకుని ఆఖరి ఓవర్లలో మ్యాచ్‌లను ముగించే టీ20 ఫినిషింగ్ కళకు మహీనే ఒక నిర్వచనం అయ్యాడు. 2010, 2011లో రెండుసార్లు టైటిల్ గెలిచి, ఐపీఎల్ ట్రోఫీని నిలబెట్టుకున్న తొలి కెప్టెన్‌గా నిలిచాడు. 2013 స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం తర్వాత సీఎస్కేపై రెండేండ్ల నిషేధం (2016, 2017) విధింనప్పుడు రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
డ్యాడ్స్ ఆర్మీతో డేరింగ్ ఆట
నిషేధం ముగిసి 2018లో సీఎస్కే మెగా లీగ్ లో రీఎంట్రీ ఇచ్చినప్పుడు అందరూ ‘డాడ్స్ ఆర్మీ’ అని వెక్కరించిన జట్టుకు ధోనీ మూడో టైటిల్ అందించి ఔరా అనిపించాడు. ఆ సీజన్ లో మహీ 75.83 సగటుతో 455 పరుగులు చేసి తన బ్యాట్ పవరూ చూపెట్టాడు. మోకాలి గాయం ఇబ్బంది పెట్టినా.. 2023లో గుజరాత్ టైటాన్స్‌పై గెలిచి ఐదో ఐపీఎల్ టైటిల్‌ను అందుకోవడం.. ఫైనల్లో జడేజా విన్నింగ్ షాట్ కొట్టిన వెంటనే ధోనీ అతడిని ఎత్తుకున్న దృశ్యం ట్రోఫీతో సమానంగా చిరస్థాయిగా నిలిచింది.
2024 సీజన్‌కు ముందు రుతురాజ్ గైక్వాడ్‌కు కెప్టెన్సీ అప్పగించిన ధోనీ ఆ సీజన్లో మోకాలి శస్తచ్రికిత్స తర్వాత కేవలం డెత్ ఓవర్లలోనే బ్యాటింగ్ చేశాడు. 2025లో రుతురాజ్ గాయపడటంతో తాత్కాలికంగా తిరిగి సారథ్య బాధ్యతలు నిర్వర్తించినా సీఎస్కే పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. గాయాల కారణంగా 2026 సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయిన ధోనీ ఈ ఏడాది మే 18న చెపాక్‌లో చివరి మ్యాచ్ తర్వాత అభిమానులకు అభివాదం చేస్తూ మైదానంలో కలియదిరిగాడు.
మెరుపులు తగ్గినా.. అదే అభిమానం..
వయసు, గాయాల వల్ల ధోనీ బ్యాట్ పవర్ క్రమంగా తగ్గింది. అతని బ్యాటింగ్ ఆర్డర్ కూడా సందర్భానుసారంగా మారింది. అయినా సరే మహీ బ్యాట్ పట్టుకొని క్రీజులోకి వచ్చే క్షణాల కోసం ఎదురుచూసే అభిమానుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. గత రెండు మూడు సీజన్లుగా డగౌట్ నుంచి అతడు నడుచుకుంటూ రావడమే ఒక వేడుకగా మారింది. ఒక సిక్స్ కొడితే మైదానం ఉప్పొంగిపోయింది.
కానీ, ఎంత మంచి మెడిసిన్ కు అయినా ఎక్స్ పైరీ డేట్ ఉంటుందన్నట్టుగా ఎంత గొప్ప ఆటగాడైన ఏదో రోజు ఆటను ముగించాల్సిందే. ఇప్పుడు మహీ వంతొచ్చింది. ఇకపై మైదానంలో పసుపు జెర్సీలో ఏడో నంబర్ బ్యాటర్ కనిపించకపోయినా రాబోయే సీజన్ నుంచి సీఎస్కే మెంటార్‌గా యువ ఆటగాళ్లకు ధోనీ దిశానిర్దేశం చేయనున్నాడు.
మహీ తప్పుకోవడం వల్ల రుతురాజ్ గైక్వాడ్ వంటి యువతరం నాయకత్వానికి సొంతంగా ఎదిగే అవకాశం దక్కుతుంది. ఏదేమైనా సీఎస్కేతో ధోనీ కలిసి ఉన్నంత కాలం మైదానంలో మహీ కోసం ఆ చప్పట్లు, అభిమానుల ఆరాధన మాత్రం ఎప్పటికీ అలాగే కొనసాగుతాయి. ఇన్నాళ్లూ నాయకుడిగా ధోనీ నీడలో ఓ అసాధారణ జట్టులా మారిన చెన్నై ఇకపై అతని మార్గనిర్దేశంలో ముందుకెళ్లనుంది.
278 ధోనీ ఆడిన మొత్తం మ్యాచ్‌లు. ఐపీఎల్ లో 250 మ్యాచ్ లు ఆడిన తొలి ప్లేయర్.
5,439 లీగ్ లో మహీ చేసినపరుగులు. ఇందులో 24 అర్ధ శతకాలు ఉన్నాయి.
5 చెన్నైకి అత్యధికంగా ఐదు ఐపీఎల్ ట్రోఫీలు (2010, 11,18, 21, 23) అందించి ముంబై మాజీ సారథి రోహిత్ శర్మతో సమంగా నిలిచాడు.
133 ధోనీ కెప్టెన్సీలో 226 మ్యాచ్ లు ఆడిన సీఎస్కే సాధించిన విజయాలు. 58.84 శాతం విక్టరీ రేట్ తో అగ్రస్థానం
205 లీగ్ చరిత్రలో అత్యధిక డిస్మిసల్స్ చేసిన కీపర్ ధోనీ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

