వరంగల్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నోరు అదుపులో పెట్టుకోకపోతే ఆడోళ్లతో కొట్టిస్తానని మాజీ మంత్రి కొండా సురేఖ సొంత పార్టీ నేతలను హెచ్చరించారు. మంగళవారం వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడారు. తమకు సంబంధించిన వారిపై ఎవరైనా నోరుజారితే ‘ఎక్కడ దొరికితే అక్కడ చిత్తుచేస్తామని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్పర్సన్ గుండు సుధారాణిపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. ‘ఇంకో రెండురోజులైతే ఊసిపోయేటోళ్లు ఒకలున్నరు. నిన్నగాక మొన్న ఎక్కినోళ్లు ఒకలున్నరు. వీళ్లు అసలైనోళ్లా? డూప్లికేటోళ్లా?’ ఆలోచించుకోవాలి.. అని చెప్పారు. ‘వాళ్లను కొట్టేందుకు మొగోళ్లు అవసరం లేదు. మా వెనుక నిలబడిన ఆడోళ్లే కొడ్తరు. తమ ముందు కుప్పిగంతులేస్తే ఊరుకోబోం, నోరుజారితే ఎక్కడ దొరికితే అక్కడ చిత్తుచిత్తుకొట్టి వదిలిపెడ్తం’ అని హెచ్చరించారు.
వరంగల్ కలెక్టరేట్ వినియోగానికి సిద్ధంగా ఉన్నా కాంట్రాక్టర్కు బిల్లుల చెల్లింపు చేయకపోవడం వల్లే ప్రారంభోత్సవానికి ఆలస్యం అవుతున్నదని సురేఖ తెలిపారు. కేసీఆర్ హ యాంలోనే వరంగల్ కలెక్టరేట్ భవన నిర్మా ణం పూర్తయితే.. మూడేండ్లు కావస్తున్నా కాంగ్రెస్ సర్కార్ దానిని ప్రారంభించకపోవడానికి గల కారణాలను నిన్నటి దాకా మంత్రి గా వ్యవహరించిన సురేఖ ‘కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించకపోవడం వల్లే’నని నిస్సహాయత వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. సదరు కాంట్రాక్టర్ సంబంధిత మంత్రికి నిర్దేశిత కమీషన్ ఇవ్వకపోవడం వల్ల బిల్లు చెల్లిం పు ఆగిపోయిందా? ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతల వర్గపోరు వల్ల ఆగిపోయిందా? లేదా మరే ఇతర కారణం వల్ల ఆగిపోయిందా? వంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.