ఖమ్మం సిటీ, మార్చి 1: ‘ఇదేం రాజ్యంరో.. దొంగల రాజ్యం, దోపిడి రాజ్యంరో.. నీ రాజ్యం కూలిపోను కదరో.. మూడు రోజులుగా ఇక్కడే పడి ఉన్నా ఎన్నడూ పట్టించుకోలేదు కదారో.. పోలీసుల దెబ్బలకు నా కాలు, చెయ్యి విరిగినయిరో.. మీ వల్ల మా ఇండ్లు, మా వాకిళ్లు పోయినయిరో..’ అంటూ పోలీసుల లాఠీ దెబ్బల ధాటికి ఖమ్మం అంబేద్కర్ భవన్లోంచి ఓ బాధితురాలు కుంటుకుంటూ, తలబాదుకుంటూ వస్తూ చేసిన ఆర్తనాదాలివి. ఖమ్మం భూదాన్ భూముల్లో పేదలు నిర్మించుకున్న ఇళ్లను ఇటీవల నేలమట్టం చేసిన ప్రభుత్వం.. బాధితులను తీసుకొచ్చి ఖమ్మంలోని అంబేద్కర్ భవన్, టీటీడీసీ భవనాల్లోని పునరావాస కేంద్రాల్లో ఉంచింది. అక్కడ వారికి కనీస సౌకర్యాలూ కల్పించలేదు. కనీసం భోజనం కూడా ఏర్పాటుచేయలేదు. బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్రే కొద్ది రోజులుగా రెండు పూజలా భోజనం ఏర్పాటు చేస్తున్నారు.
ఈ క్రమంలో ఆ పునరావాస కేంద్రాల్లో ఉంటున్న బాధితుల వద్దకు పలు పార్టీల నేతలు, ఆయా సంఘాల నాయకులు ప్రతి రోజూ వచ్చి పరామర్శించి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం కూడా హైదరాబాద్‌లోని వివిధ యూనివర్సిటీలకు చెందిన నాయకులు వచ్చి పరామర్శించారు. ఈ సమయంలో బాధితుల గోడు విన్న ఓ విద్యార్థి నాయకుడు స్పందిస్తూ.. బాధితులకు మద్దతుగా దీక్ష చేసేందుకు పూనుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతడు దీక్ష చేయకుండా అడ్డుకున్నారు. అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో బాధితులంతా కలిసి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మాకు మద్దతుగా ఎవరు వచ్చినా ఇలాగే అరెస్టు చేస్తున్నారెందుకు?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో ప్రభుత్వం తీరుపైనా మండిపడ్డారు.
అయినప్పటికీ ఆ విద్యార్థి నాయకుడిని పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించడంతో బాధితులు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులంతా కలిసి బాధితులను, మహిళలను ఈడ్చిపడేశారు. ఒకానొకదశలో లాఠీలకు పనిచెప్పారు. దీంతో బాధితులకు, మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ గాయాల నొప్పుల భరించలేని మహిళలు.. మిన్నంటే రోదనలతో అంబేద్కర్ భవన్ బయటకు వచ్చారు. బాధితులందరూ కలిసి అక్కడే ఉన్న ప్రధాన రహదారిపై పడుకొని నిరసన తెలిపారు. అక్కడికి కూడా వచ్చిన పోలీసులు వారిని రోడ్డుపై నుంచి తొలగించేందుకు ప్రయత్నించారు. దీంతో బాధితులు అక్కడ కూడా పోలీసులను నిలదీశారు. ‘నవ్వు నాశనమైపోను గదరో.. నీపై గత్తర ముత్యాలమ్మ పడగదరో’ అంటూ శాపనార్థాలు పెట్టారు. అయినప్పటికీ బాధితులను పోలీసులు ఈడ్చిపడేశారు. ఆడా, మగా, పిల్లలు, వృద్ధులు అనే విచక్షణ కోల్పోయి లాఠీలకు పనిచెప్పారు. బూటు కాళ్లతో తొక్కుతూ, బండ బూతులు తిడుతూ విరుచుకు పడ్డారు.

పలువురికి తీవ్ర గాయాలు..
కాంగ్రెస్ సర్కార్ ఆదేశాలే శిరోధార్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్న ఖమ్మం పోలీసులు తమ కసాయితత్వాన్ని ప్రదర్శించారు. న్యాయం కావాలని (ఉయ్ వాంట్ జస్టిస్) అడిగిన పాపానికి తమ లాఠీలకు పనిచెప్పారు. మహిళలను మహిళా పోలీసులతోనే నిరోధించాలన్న కనీస నియమాన్ని విస్మరించి కాఠిన్యాన్ని ప్రదర్శించారు. రోడ్డుపై కూర్చున్న వారిని కుళ్లబొడిచారు. ఈ క్రమంలో పలువురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఆ గాయాలను తట్టుకోలేక కొందరు మహిళలు రోదించిన తీరు హృదయ విదారకంగా మారింది. ఒక మహిళ తన సిగ్గూబిడియాన్ని దిగమించి మరీ.. తన ఒంటిపైనున్న చీరను పక్కకు జరిపి తనకు తగిలిన గాయాన్ని చూపిస్తూ రోదించడం పలువురికి కంటతడి తెప్పించింది. వారి ఆర్తనాదాలు ఖమ్మం వీధులు మిన్నంటాయి. కాగా.. టీటీడీసీ, అంబేద్కర్ భనాలను తక్షణమే ఖాళీ చేసి వెళ్లి పోవాలంటూ అధికారులు హుకుం జారీ చేయడం గమనార్హం. లేదంటే మంచినీళ్లు కూడా ఇవ్వబోమంటూ అధికారులు మొండి కేస్తున్నారు. ఈ విషయమై ఖమ్మం కలెక్టరేట్ నుంచి ఇప్పటి వరకు సహాయ సహకారాలు అందించిన రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు సంబంధిత యంత్రాంగమే చెబుతోంది.
బాధితులకు బాసటగా పార్టీలు, సంఘాలు..
వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. తొలుత బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు సారథ్యంలో పార్టీ బృందం ఆందోళనకు తొలి అడుగు పడింది. ఆ తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మానికి రావడంతో సమస్య రాష్ట్ర వ్యాప్తంగా మారింది. అక్కడి నుంచి వామపక్షాలు సైతం కాంగ్రెస్ ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండిస్తూ బాధితులకు న్యాయం చేయకపోతే ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమని ప్రకటించాయి. ఆక్రమంలోనే బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, కాకతీయ, ఉస్మానియా విశ్వవిద్యాలయాలకు చెందిన పలువురు నాయకులు, ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయకులు వచ్చి బాధితులకు మద్దతు పలికారు. దీంతో ఆందోళనకు గురైన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు సరికొత్త నాటకాన్ని తెరమీదకు తెచ్చింది. తాము చేసిందే నిజమని, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించామని కలెక్టర్, అడిషనల్ కలెక్టర్‌తో ప్రకటనలు చేయించిన రేవంత్ సర్కార్ ఖమ్మం ఆర్డీవోను బదిలీ చేయడం సర్వత్రా చర్చానీయాంశంగా మారింది. తాము తప్పు చేశామనే భావనతో, ప్రజల నుంచి పెల్లుబికుతున్న వ్యతిరేకతను కప్పి పుచ్చుకునే భాగంలో అధికారులను పావులు చేసే కుట్రలో పడినట్లు ఉద్యోగ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అండగా నిలుస్తున్న బీఆర్ఎస్..
‘మీకు మంచి నీళ్లు ఇవ్వం.. అన్నం పెట్టం.. తక్షణమే ఖమ్మాన్ని విడిచి వెళ్లిపోండి.. లేదంటే క్రిమినల్ కేసుల పాలవుతారు’.. అంటూ అధికారులు చేస్తున్న బెదిరింపులు వెలుగుమట్ల బాధితులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మాటలన్నదే తడవుగా నాలుగు రోజులుగా పేదలకు మంచినీళ్లు, భోజనం పెట్టకుండా తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తున్నరు. కానీ, ఇటీవల ఖమ్మం జిల్లా పర్యటకు వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇండ్లు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న పేదలకు ఇచ్చిన హామీ, క్షేత్రస్థాయిలో అమలవుతున్న తీరు ప్రతిఒక్కరి మనన్ననలను పొందుతోంది. పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో న్యాయ పోరాటం చేస్తునప్పటికీ, రాజ్యసభసభ్యుడు, బీఆర్ఎస్ పార్లమెంటరీ నేత వద్దిరాజు రవిచంద్ర గత నాలుగు రోజులుగా బాధితులకు ఆహారం అందిస్తున్నారు. ఆదివారం ఆయనే స్వయంగా హాజరై భోజనం వడ్డించి ఆకలి తీర్చడం గమనార్హం. మోసపోతే గోసపడతామంటూ మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటున్నారు.
‘భూదాన్’ బాధితులకు బీఆర్ఎస్ భరోసా
మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
ఖమ్మం సిటీ, మార్చి 1: ఖమ్మం భూదాన్ భూముల్లో ఇండ్లు కోల్పోయిన పేదలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం ఆదివారం పలువురు బాధితులను ఖమ్మం నుంచి హైదరాబాద్ తెలంగాణ భవన్‌కు తీసుకెళ్లి లీగల్ సెల్ బృందంతో మాట్లాడించారు. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ.. భూదాన్ భూముల్లో నిరుపేదలు కట్టుకున్న ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా కూల్చివేసిందని అన్నారు. ఇంటిల్లిపాదికీ నిలువ నీడ లేకుండా రోడ్డున పడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కేటీఆర్ మార్గదర్శకంలో హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లయినా సరే న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. రేవంత్ సర్కారు ఎక్కడైతే ఇండ్లను కూల్చివేసిందో అక్కడే పట్టాలు ఇచ్చి, పక్కా ఇండ్లు నిర్మించేంత వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఖమ్మం నేతలు, లీగల్ సెల్ బాధ్యులు పగడాల నాగరాజు, మేకల సుగుణారావు, బత్తుల మురళి, భూదాన్ బాధితుల సంఘం నాయకులు దేవళ్ల వీరన్న, సంపంగి వెంకటేశ్వర్లు, సంపంగి వెంకటాచలం, బండి శ్రీను, పుప్పాల శ్రీను, జారా ఆంజనేయులు పాల్గొన్నారు.
పేదల ఇళ్లు కూల్చే హక్కునుఏ చట్టం కల్పించింది?

Khammam7
రఘునాథపాలెం, మార్చి 1: పేదల ఇళ్లు కూల్చే హక్కును ఏ చట్టం కల్పించిందని ఎస్టీ కమిషన్ జాతీయ సభ్యుడు జాటోతు హుస్సేన్‌నాయక్ అధికారులను నిలదీశారు. ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదలు కట్టుకున్న ఇళ్లను ప్రభుత్వం ఇటీవల కూల్చిన ప్రాంతాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. పేదల ఇళ్లు కూల్చిన ఘటనను జాతీయ ఎస్టీ కమిషన్ సుమోటాగా విచారణకు స్వీకరించిన నేపథ్యంలో ఆదివారం ఆయన ఖమ్మంలోని భూదాన్ భూముల్లో కూల్చివేతలను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధిత కుటుంబాలకు అదే స్థలంలో ఇళ్లు నిర్మించుకునేలా అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. దీనిపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వకపోతే అధికారులను ఢిల్లీకి పిలిపిస్తామని స్పష్టం చేశారు. బాధితుల గోడు విన్న హుస్సేన్‌నాయక్.. ప్రభుత్వం తీరుపైనా తీవ్రంగా మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం.. పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాల్సింది పోయి ఉన్న ఇళ్లను కూలగొట్టడం కక్ష సాధింపు చర్యకు నిదర్శనమని అన్నారు. దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాలకు చెందిన 700 కుటుంబాలను ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులు రోడ్డున పడేయడం శోచనీయమని అన్నారు. పేదలకు న్యాయం జరిగే వరకు జాతీయ ఎస్టీ కమిషన్ వారికి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వానిది నిరంకుశత్వం
కారేపల్లి, మార్చి 1: కాంగ్రెస్ ప్రభుత్వానిది నిరంకుశత్వమని కారేపల్లి అఖిలపక్ష నాయకులు స్పష్టం చేశారు. గూడు కోల్పోయిన పేదల అండగా నిలుస్తున్న విపక్ష నేతలపై కేసులు పెట్టడం, వారిని భయబ్రాంతులకు గురిచేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు. ఖమ్మం భూదాన్ భూముల్లో పేదల ఇళ్ల కూల్చివేతలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులదే బాధ్యత అని స్పష్టం చేశారు. ఖమ్మం భూదాన్ భూముల్లో పేదలు నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేతలను నిరసిస్తూ ఖమ్మం జిల్లా కారేపల్లిలో అఖిలపక్ష నాయకులు ఆదివారం నిరసన కార్యక్రమం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ.. రెకాడితేగానీ డొకాడని పేదల కష్టార్జితాన్ని నేలమట్టం చేయడం దారుణమని అన్నారు.
పేదలు రూ.లక్షలు అప్పు చేసుకొని ఇళ్లు కట్టుకుంటే.. నిర్మాణ సమయంలో అభ్యంతరం చెప్పని ప్రభుత్వం.. ఇప్పుడు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా తెల్లవారుజామున పోలీసు బలగాలతో వచ్చి పేదల కలల సౌధాలను కూల్చివేయడం, వారికి పుట్టెడు దుఖాన్ని మిగిల్చడం దయనీయమని అన్నారు. వెలుగుమట్ల బాధితులను డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించి ఇవ్వాలని, నష్టపరిహారం చెల్లించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అఖిలపక్ష నాయకులు కొండెబోయిన నాగేశ్వరరావు, వై.ప్రకాశ్, గుగులోత్ తేజానాయక్, భూక్యా చందునాయక్, కే.నరేంద్ర, అన్నారపు కృష్ణ, బీ.వీరు, రాయుడు, మంగయ్య, రాందాస్ తదితరులు పాల్గొన్నారు.
