గువాహటి: ఆత్మ విశ్వాసం, సాధించాలన్న పట్టుదల ఉంటే ఎన్ని అడ్డంకులెదురైనా లక్ష్యం ముందు చిన్నబోతాయని మరోసారి నిరూపించింది అసోం అమ్మాయి జాన్మోని కోవర్. ఇటీవల ఆ రాష్ర్టాన్ని ముంచెత్తిన వరదల కారణంగా సర్వం కోల్పోయి కుటుంబంతో కలిసి చిన్న టెంట్లో తలదాచుకుంటున్న 17 ఏండ్ల కోవర్.. తన కలలను, లక్ష్యాన్ని మాత్రం వదులుకోలేదు. ఈ నెల 7-9 మధ్య ఢిల్లీలో జరిగిన నేషనల్ కరాటే చాంపియన్‌షిప్స్‌లో పాల్గొన్న ఆమె స్వర్ణం గెలిచి అందరి ప్రశంసలూ అందుకుంటున్నది. జాన్మోనిది జోర్హాట్ జిల్లా బోగ్డోయిపొరియా గ్రామం. గతనెల సంభవించిన వరదలతో వారి ఊరు మొత్తం నీటమునిగింది. చేపలు పడుతూ బతుకునీడుస్తున్న వారి కుటుంబం.. వరదల కారణంగా ఇల్లు వదిలి టార్ఫాలిన్ గుడారాల కింద బతుకుతున్నారు. ఐదేండ్ల వయసులోనే కరాటేలో మెళకువలు నేర్చుకున్న కోవర్ ఢిల్లీకి వెళ్లాల్సి ఉన్నా వరదలు, పేదరికం ఆమె లక్ష్యానికి అడ్డంగా నిలిచాయి. కానీ ఆమె స్థితిని తెలుసుకున్న ఫిజిక్స్ వాలా వ్యవస్థాపకుడు అలక్ పాండే.. జాన్మోనికి చేయూతనందించాడు. ఢిల్లీ వెళ్లేందుకు సాయం చేయడమే గాక అక్కడ ఆమె ఖర్చులనూ భరించాడు. వరదలు ఇంటిని ముంచేసినా తన కలలను మాత్రం అడ్డుకోలేకపోయాయి. పోటీల్లో స్వర్ణం గెలిచి ఇంటికి వచ్చిన కోవర్.. కుటుంబంతో కలిసి మళ్లీ అదే గుడారాల్లో నివసిస్తుండటం గమనార్హం.