ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ ఖమ్మం సిటీ/ ఖమ్మం కమాన్‌బజార్, ఫిబ్రవరి 26 : ‘ఇదేనా ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యమంటే ఇండ్లను కూల్చడమేనా?’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కార్ దాష్టీకాన్ని ప్రదర్శిస్తూ ఖమ్మం అర్బన్ వెలుగుమట్ల వినోభాబావే నగర్ భూదాన్ భూముల్లో నేలకూల్చిన పేదల ఇండ్లను గురువారం ఆయన పరిశీలించారు. రోడ్డునపడ్డ బాధితులను అక్కడే పరామర్శించారు. అనంతరం, ఖమ్మంలోని అంబేద్కర్ భవన్లో ఆశ్రయం పొందుతున్న పేదలతో మమేకమయ్యారు. వారి బాధలను విన్న అనంతరం అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. అదే క్రమంలో ‘మేమున్నాం.. న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటాం’ అంటూ బాధితులకు భరోసా కల్పించారు. అనంతరం అక్కడే మీడియా సమావేశంలోనూ కేటీఆర్ మాట్లాడారు.

వెలుగుమట్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు తీరని అన్యాయం చేసిందని కేటీఆర్ విమర్శించారు. గతంలో పలువురు పెద్దలు 62 ఎకరాల ప్రైవేట్ భూమిని భూదాన్ ట్రస్ట్‌కు విరాళంగా ఇచ్చారని గుర్తుచేశారు. భూదానమంటేనే పేదలకు వ్యవసాయానికి లేదా ఇండ్లు కట్టుకోవడానికి ఇచ్చేదని అన్నారు. 2014లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు భూదాన్ ట్రస్ట్ బోర్డు నుంచి 1,895 మందికి ఒక్కొక్కరికీ 100 గజాల చొప్పున పట్టాలు ఇచ్చారని గుర్తుచేశారు. ‘ఇవాళ మీకు హక్కు లేదంటూ ఎవరైనా అన్నా, అవి పట్టాలు కావని చెప్పినా.. తప్పకుండా తప్పు వారిదే అవుతుంది. పట్టాలు కచ్చితంగా ఉన్నాయి. వాటిని నేను చూశాను. 2014 తర్వాత ఎవరి శక్తి మేరకు వారు ఇండ్లు కట్టుకున్నారు’ అని అన్నారు.

ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు మోసగాళ్లని కేటీఆర్ ధ్వజమెత్తారు. భూదాన్ భూముల పక్కనే ఉన్న విలాసవంతమైన విల్లాల కోసం, కాంగ్రెస్ నాయకుల విలాసాల కోసం, మంత్రుల అక్రమ సంపాదన కోసం వారి కన్ను పేదల ఇండ్లపై పడిందని అన్నారు. ముగ్గురూ కూడబలుక్కుని మొత్తం 60 ఎకరాలను ఆక్రమించుకునేందుకు పేదలను మెడలు పట్టి గెంటేశారని విమర్శించారు. ఎలాంటి నోటీసూ ఇవ్వకుండా పోలీసోళ్లను అర్ధరాత్రి వారి ఇండ్ల మీదకు పంపారని ధ్వజమెత్తారు. మిమ్ములను అన్యాయంగా ఇక్కడి నుంచి తరిమేసి బజారున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే అనేకమంది పిల్లలకు చదువు లేకుండా చేశారని అన్నారు. ఆ పిల్లల తల్లిదండ్రుల నోట్లో మన్నుకొట్టి వారికి నిలువ నీడ లేకుండా చేశారని దుయ్యబట్టారు. ‘పైగా మీ పట్టాలు అక్రమమైనవని మంత్రులంటున్నారని అన్నారు. అక్రమమైనవి మీ పట్టాలు కావని, మీ పట్టాలు ముమ్మాటికీ సక్రమమైనవేనని స్పష్టం చేశారు. కానీ అక్రమమైన బుద్ధి, చెండాలపు బుద్ధి, పేదల నోటికాడి బుక్క లాక్కునే బుద్ధి ఇక్కడి ముగ్గురు మంత్రులదని నిప్పులు చెరిగారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తమనెప్పుడూ ఇబ్బందులు పెట్టలేదని వెలుగుమట్ల బాధితులు తనతో చెప్పారని వివరించారు.
వెలుగుమట్ల దాష్టీకంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. అందుకోసం పోరాడుతామని అన్నారు. మీ అందరికీ అక్కడే క్రమబద్ధం చేయాలని, మీ తరఫున అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని పేదలకు అభయమిచ్చారు. ‘మీరు ధైర్యంగా ఉండండి. మీకు బస, భోజన వసతులను ఏర్పాటు చేస్తం. దానితోపాటు న్యాయపరంగా పోరాటం చేస్తాం. ఎవ్వరి దగ్గరా రూపాయి తీసుకోం. మేమే ఖర్చు పెడతాం. మీకు న్యాయం లభించేంత వరకు మీతోనే కలిసి ఉంటాం’ అని కేటీఆర్ అనగానే బాధితుల నుంచి కరతాళ ధ్వనులు మోగాయి. అలాగే, బెదిరిపోయి సంతకాలు పెట్టొద్దని సూచించారు. నమ్మితే మళ్లీ మోసం చేస్తారని తేల్చిచెప్పారు.

కేటీఆర్ వెంట మాజీ మంత్రి పువ్వడ అజయ్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు తాతా మధు, శంభీపూర్ రాజు, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా ఆధ్యక్షుడు రేగా కాంతారావు, బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు, ఉమ్మడి జిల్లా నాయకులు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు, బానోతు హరిప్రియ, బానోతు చంద్రావత్, దిండిగాల రాజేందర్, ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు, వలరాజు, కోటి తదితరులు ఉన్నారు.

‘మీ ముగ్గురు మంత్రులు మాయగాళ్లు. రేపు మీ మధ్యన చిచ్చు పెడతారు. మీలో కొంతమందిని తీసుకొనిపోయి వేలి ముద్రలు వేయించుకుంటారు. అధికారులను పంపించి కొంతమందితో సంతకాలు పెట్టించుకుంటారు. దయచేసి జాగ్రత్తగా, ఐకమత్యంగా ఉండండి.’ అంటూ నిరుపేదలకు సూచించారు. ‘మీకు అక్కడే ఇల్లు కావాలనుకుంటే ఎక్కడా సంతకాలు పెట్టకండి. మీ కుటుంబాలతో సహా అక్కడే ఉండాలనుకుంటే పొరపాటున కూడా ఐకమత్యాన్ని చెదిరిపోనియకండి’ అంటూ హితబోధ చేశారు. మీకు ఇందిరమ్మ ఇండ్లిస్తామంటూ అరచేతిలో వైకుంఠం చూపి మోసం చేస్తారని అప్రమత్తం చేశారు.

‘అందుకే దయచేసి జాగ్రత్తగా ఉండండి. మీరు గెలవాలంటే ఐకమత్యం అవసరం’ అని హితబోధ చేశారు. అక్కడే ఇల్లు కావాలంటే తప్పకుండా న్యాయ పోరాటం చేద్దామని అన్నారు. ‘ఇవాళ అధికారం వాళ్ల చేతుల్లో ఉంది. మొత్తం అధికార యంత్రాంగం వాళ్ల చేతుల్లో ఉంది. పోలీసు బలగాలు వాళ్ల చేతుల్లో ఉన్నాయి. కాబట్టి పేదవాడికి గొంతు లేదనుకుంటున్నరు. కానీ, ఒక్కటి మాత్రం వాస్తవం.
ప్రభుత్వం తప్పు చేసిందని రాష్ట్రం మొత్తం భావిస్తున్నది.’ అని అన్నారు. ఏ తప్పూ చేయకపోతే ఖమ్మం ఆర్డీవోను హడావిడిగా ఎందుకు బదిలీ చేశారని ప్రశ్నించారు. ‘అర్ధరాత్రి వచ్చి ఎందుకు దొంగల్లా ఇండ్ల మీద పడ్డారు. నోటీసులు ఎందుకు ఇవ్వలేదు. గతంలో మీకు కోర్టు ఆర్డర్ ఇచ్చింది. మీకు పట్టాలు లేకపోతే కోర్టు ఆర్డర్ ఇస్తదా? జిల్లాలోని ముగ్గురు మంత్రులు తప్పు చేయకపోతే మీ దగ్గరకు వచ్చి మాట్లాడాలి కదా. తప్పు ప్రభుత్వానిది కాబట్టే మీ ముందుకు రాలేకపోతున్నారు’ అంటూ మండిపడ్డారు. భూములు కొల్లగొట్టే దొంగలు వచ్చి మీ కాలనీపై పడ్డారని, సుప్రీంకోర్టు వరకైనా వెళ్లి న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని అన్నారు.

‘రెక్కలు ముక్కలు చేసుకుని కట్టుకున్న చిన్నగూడును కూల్చివేశారు.. వేలాది మంది పోలీసు, పారా మిలటరీ బలగాలను మోహరించి.. పేదలను మెడలు పట్టి రోడ్డు మీదకు నెట్టారు.. అడిగే దిక్కు లేదనుకున్నరో ఏమో.. తీసుకొచ్చి ఖమ్మంలోని టీటీడీసీ భవనం, అంబేద్కర్ భవనంలో పడేశారు. ఇదేమిటని అడిగిన వారందరినీ అరెస్ట్ చేస్తున్నరు.. ఇంకేముంది రెండు రోజులైతే సమస్య పూర్తిగా సమసిపోతుందనుకుని భుజాలు చరుచుకున్నరు.. కానీ, ఇక్కడ జరుగుతున్న కాంగ్రెస్ సర్కార్ అరాచకం.. పేదలపై ప్రదర్శిస్తున్న జులుం గురించి తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఖమ్మం వచ్చారు.

వెలుగుమట్లలో రేవంత్ ప్రభుత్వం కూల్చిన ఇండ్ల వద్దకు వెళ్లారు. కళ్లలో నీటి సుడులతో ఉన్న బాధితుల సమక్షంలో కూర్చుని అధికార జులుం గురించి ఆరా తీశారు. ఆ క్రమంలో పలువురు ఆయన్ని ఆలింగనం చేసుకుని కన్నీరు మున్నీరయ్యారు. రాష్ట్రంలో కేసీఆర్ సార్ ఉంటే తమకీ దుస్థితి దాపురించేది కాదని వాపోయారు. స్పందించిన కేటీఆర్.. అధైర్య పడొద్దని, అండగా ఉంటామని భరోసా కల్పించిన తీరు స్థానికులకు కొండంత ధైర్యాన్ని తెచ్చి పెట్టింది.
బాధితుల పరామర్శకు కేటీఆర్ వస్తున్నారన్న సమాచారం తెలియగానే అధికార వర్గాల్లో కల్లోలం రేగింది. అంబేద్కర్ భవనంలో తలదాచుకున్న పేదల వద్దకు బుధవారం రాత్రి వెళ్లి ‘కేటీఆర్ వస్తున్నారు.. మీరంతా వెళ్లి పోవాలి’ అని హుకుం జారీ చేశారు. లేదంటే అన్నం కూడా పెట్టమని తెగేసి చెప్పారు. గురువారం ఉదయం మరోసారి బాధితుల వద్దకు వచ్చి కేటీఆర్ వచ్చినప్పుడు మీరు బయటికి రావడానికి వీల్లేదని చెప్పడం శోచనీయం.

కాంగ్రెస్ పార్టీని, మంత్రులను తిట్టినా క్రిమినల్ కేసులు పెడతామని భయాందోళనకు గురి చేయడం గమనార్హం. ఉదయం టిఫిన్ పంపిన అధికారులు మహిళలు, చిన్నారులు, వృద్ధులకు మధ్యాహ్నం భోజనం కూడా పెట్టలేదు. విషయం తెలుసుకున్న కేటీఆర్ తన పక్కనే ఉన్న రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రకు చెప్పగానే ఆయన భోజనాలు తెప్పించి పేదల ఆకలి తీర్చారు.
‘ఇందిరమ్మ ఇండ్లు అన్నారు. ఉన్న ఇండ్లు పోగొడుతున్నారు. హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో కూల్చివేతలే. రాష్ట్రమంతటా కూల్చివేతలే. వెలుగుమట్లలో కూల్చివేతలే..’ అని కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజమెత్తారు. మొత్తం రాష్ట్రంలో ప్రజల ఆస్తులను, శక్తిని లాక్కోవడమే తప్ప ఈ ప్రభుత్వం ఏం చేసిందో మీరు ఆలోచించాలి’ అని అన్నారు. ‘అందుకే దండం పెట్టి చెబుతున్నా. మీరు ఐకమత్యంగా ఉంటే మేము సాయం చేయగలుగుతం’ అని హామీ ఇచ్చారు. ఇక్కడకు వేరే పార్టీల వారు వచ్చారు. తప్పకుండా కలిసి కొట్లాడదాం. మాకేం ఇబ్బంది లేదు. ఓట్ల కోసం తాపత్రయ పడాల్సిన అవసరం అంతకన్నా లేదు.

కేవలం పేదలకు న్యాయం చేసేందుకే ఈ ఊరికి వచ్చా. మీకు న్యాయం జరిగేదాకా ఈ ప్రభుత్వంపై కొట్లాడుతా. ఈ ముగ్గురు మోసగాళ్లకు బుద్ధి చెప్పేదాక ఎర్రన్నలతో కూడా కలిసి కొట్లాడతా’ అని స్పష్టం చేశారు. ఇండ్లు కోల్పోయిన వారి తరఫున ఖమ్మం ప్రజానీకమే కాకుండా యావత్ రాష్ట్ర ప్రజానీకమూ ఉందని అన్నారు. ‘మాజీ మంత్రి అజయ్, ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్సీ తాతా మధు వంటి వారందరూ ఇక్కడే ఉన్నారు. మీకు భోజనం, ఇతర వసతులు అన్నీ మేమే చూసుకుంటాం. మీ కాగితాలు, పట్టాల ప్రతులు నా దగ్గర ఉన్నాయి. కోర్టులో కూడా రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మొత్తం మేమే చూసుకుంటాం. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాం. మీ స్థలం మీకు వచ్చేదాక చేయడం మా బాధ్యత. ఎవరూ కంగారు పడొద్దు. ధైర్యంగా ఉండండి’ అంటూ ఆపన్నహస్తం అందించారు.
చాలా ఏళ్లుగా ఇక్కడే గూడు కట్టుకొని బతుకెళ్లదీస్తున్నాం. కరెంటు లేకపోయినా, నీళ్లు రాకపోయినా, రాత్రి వేళల్లో దోమలు కుడుతున్నా బతుకుతున్నాం. రోజు వారీ పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాం. కిరాయిలు కట్టే స్తోమతలేకనే ఇక్కడే ఉంటున్నాం. ఇప్పుడు మా గూడు కూల్చి వెళ్లిపొమ్మకంటే ఎక్కడికెళ్లాలి?
-ఓ మహిళ గోడు
‘జానీమియా అనే సోదరుడు చెప్పాడు. పదేండ్ల నుంచి ఇక్కడే ఉంటున్న. దాదాపు పన్నెండు లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టిన. ఇప్పుడు నా భార్యా, పిల్లలు, కుటుంబం మొత్తం రోడ్డున పడింది ఈ దుర్మార్గమైన ప్రభుత్వం చేబట్టి’ అని ఏడుస్తున్నడు..
-కేటీఆర్
‘ఓ తమ్ముడు నాతో చెప్పాడు. అన్నా నా భార్య తాళిబొట్టు, బంగారం తాకట్టు పెట్టి రూ.7 లక్షలతో ఇల్లు కుట్టుకున్న. కాంగ్రెస్ ప్రభుత్వంలోని అధికారులు వచ్చి కూలగొట్టారు. నేను ఎట్లా కోలుకోవాలి అని ఏడుస్తున్నడు’
-కేటీఆర్
‘ఎర్రయ్య అనే పెద్దమనిషిని కలిసిన. ఆయన చెబుతుండు.. మాది ఏ రకమైన ఇబ్బందులు లేని భూమి అని. భూదాన్ ట్రస్ట్ బోర్డు నుంచి ఇచ్చిన పట్టాలు ఉన్నవి. కొంత మందిమి కరెంటు కోసం దరఖాస్తులు పెట్టుకున్నం. ఇంటి పన్నులు కూడా కొంత మందిమి కడుతా ఉన్నం. ఇంటి నెంబర్లు కూడా చివరి దాకా వచ్చి ఆగింది. ఇప్పుడొచ్చి కూలగొట్టి మమ్ములను మెడలు పెట్టి రోడ్డు మీదకు నెట్టిండ్రు’ అని రోదిస్తున్నడు..
-కేటీఆర్

