Over Weight | బరువు పెరుగుతామనే భయంతో చాలామంది కొన్ని ఆహారాలను పూర్తిగా దూరం పెడుతుంటారు. అయితే అన్ని ఆహారాలు ఒకేలా ఉండవు. జీరో కేలరీ ఆహారాలు అంటూ ఏవీ లేకపోయినా, కొన్ని ఆహారాల్లో పీచు (ఫైబర్), ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల అవి ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. దీంతో ఆకలి తగ్గి, మొత్తంగా తీసుకునే కేలరీల పరిమాణం కూడా తగ్గుతుంది. అంతేకాకుండా ఇవి శరీరానికి అవసరమైన అనేక పోషకాలను కూడా అందిస్తాయి. ఉడికించిన బంగాళాదుంపలను చాలామంది అధిక కార్బొహైడ్రేట్లు ఉన్నాయని దూరం పెడతారు. కానీ ఉడికించిన బంగాళాదుంపలు పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారం. ఇవి ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగించే ఆహారాల్లో అగ్రస్థానంలో ఉంటాయి. ఇందులో ఉండే రెసిస్టెంట్ స్టార్చ్ కరిగే పీచు మాదిరిగా పనిచేసి ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఉడికించిన బంగాళాదుంపలను చల్లార్చి మళ్లీ వేడి చేసి తింటే రెసిస్టెంట్ స్టార్చ్ పరిమాణం పెరిగి మరింత ప్రయోజనం కలిగించే అవకాశం ఉంటుంది.
గుడ్లు శరీరానికి అవసరమైన దాదాపు అన్ని కీలక పోషకాలను అందించే ఆహారం. ఒక గుడ్డులోని ప్రోటీన్‌లో సగం వరకు పచ్చసొనలోనే ఉంటుంది. గుడ్లు ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. ఒక అధ్యయనం ప్రకారం ఉదయం అల్పాహారంగా గుడ్లు తిన్నవారు రోజంతా తక్కువ కేలరీలు తీసుకున్నట్లు, అలాగే వారి బాడీ మాస్ ఇండెక్స్ (BMI) కూడా ఇతరులతో పోలిస్తే తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. చేపల్లో ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు, అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా అధిక బరువు ఉన్నవారిలో ఇవి ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేయడంలో సహాయపడతాయి. సంతృప్తిని కలిగించే ఆహారాల జాబితాలో చేపలు ఇతర ప్రోటీన్ ఆహారాల కంటే మెరుగైన స్థానం పొందాయి. ఒక పూట చేపలు తిన్నవారు తర్వాతి భోజనంలో తక్కువ కేలరీలు తీసుకున్నట్లు అధ్యయనాలు సూచించాయి. పనీర్‌లో కేలరీలు తక్కువగా ఉండగా ప్రోటీన్, కాల్షియం, విటమిన్ బి, ఫాస్ఫరస్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఆకలిని నియంత్రించే సామర్థ్యంలో పనీర్ కూడా గుడ్లతో సమానంగా పనిచేస్తుందని పరిశోధనలు పేర్కొన్నాయి.
పాప్‌కార్న్ ఒక సంపూర్ణ ధాన్య ఆహారం. ఇతర చిరుతిండ్లతో పోలిస్తే ఇందులో పీచు ఎక్కువగా ఉంటుంది. పరిమాణంలో ఎక్కువగా కనిపించినప్పటికీ కేలరీలు తక్కువగా ఉండటంతో కడుపు నిండిన భావన కలిగిస్తుంది. అయితే నూనె లేకుండా గాలితో తయారుచేసిన (ఎయిర్ పాప్డ్) పాప్‌కార్న్ ఆరోగ్యకరమైనది. మైక్రోవేవ్‌లో తయారుచేసే వాణిజ్య పాప్‌కార్న్‌లో కేలరీలు ఎక్కువగా ఉండటంతోపాటు కొన్ని హానికర రసాయనాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. తక్కువ కొవ్వు ఉన్న మాంసాహారం (లీన్ మీట్) ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం. ప్రోటీన్ ఎక్కువగా తీసుకునేవారు సాధారణంగా తక్కువ మొత్తంలోనే ఆహారం తీసుకుంటారని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
ఒక పరిశోధనలో మధ్యాహ్న భోజనంలో ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారం తీసుకున్నవారు, అధిక కార్బొహైడ్రేట్లు తీసుకున్న వారితో పోలిస్తే రాత్రి భోజనంలో 12 శాతం తక్కువ ఆహారం తీసుకున్నట్లు గుర్తించారు. రెడ్ మీట్ ప్రోటీన్ సమృద్ధిగా ఉండే ఆహారాల్లో రెండో స్థానంలో ఉండగా, చికెన్ వంటి మాంసం బరువు తగ్గడంలో తోడ్పడుతుందని చెబుతున్నారు. సాధారణంగా ద్రవ ఆహారం ఘన ఆహారం కంటే తక్కువ సంతృప్తిని ఇస్తుందని భావిస్తారు. అయితే కొన్ని అధ్యయనాల ప్రకారం సూప్‌లు ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. ముఖ్యంగా బ్రోత్ ఆధారిత సూప్‌లను తరచూ తీసుకోవడం వల్ల ఆకలి తగ్గి, క్రమంగా బరువు తగ్గడానికి దోహదపడతాయి. క్రీమ్ ఎక్కువగా ఉండే సూప్‌ల కంటే బ్రోత్ ఆధారిత సూప్‌లను ఎంచుకోవడం మంచిది.