ఖమ్మం సిటీ, ఫిబ్రవరి 27: ‘అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేదల ఇండ్లను కూల్చివేశారు. రెండు రోజుల క్రితం ఖమ్మానికి వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎదుట గోడు వెళ్లబోసుకున్న వారిని పెయిడ్ ఆర్టిస్టులని అన్నారు. ఓట్లేసి గెలిపించిన పాపానికి.. మంత్రులుగా ఊరేగుతూ, సిగ్గూ ఎగ్గూ లేకుండా మాట్లాడుతారా? పేదలు మీకు పెయిడ్ ఆర్టిస్టులుగా కనిపిస్తున్నరా? ’ అంటూ బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు మండిపడ్డారు.
ఖమ్మంలోని తెలంగాణ భవన్ (బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం)లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మంలో ఇండ్లు కోల్పోయిన బాధితులను పెయిడ్ ఆర్టిస్టులంటూ హైదరాబాద్‌లో గురువారం జరిపిన ప్రెస్మీట్లో మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించడం అత్యంత బాధాకరమని, గర్హనీయమని అన్నారు. ‘నిలువ నీడలేక, చెట్టుకొకరు, పుట్టకొకరు విసిరివేయబడ్డవారు పెయిడ్ ఆర్టిస్టులా?’ అని నిలదీశారు. ‘ఈ మాట అనడానికి మంత్రికి కనీసం మానవత్వం లేదా?’ అని ప్రశ్నించారు.
ఆయనే ఒక పెద్ద ఆర్టిస్టు అని; దివంగత వైఎస్ఆర్, మాజీ సీఎం కేసీఆర్ దగ్గర బ్రహ్మాండంగా యాక్ట్ చేశారని ఎద్దేవా చేశారు. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి దగ్గర తన యాక్టింగ్‌ను రక్తి కట్టిస్తున్నారని విమర్శించారు. రేపు ప్రధాని మోదీ పంచనచేరి ఇంకా గొప్పగా యాక్ట్ చేసి ‘పద్మ, ఫాల్కే’ అవార్డులకు అర్హత సాధిస్తారని ఎద్దేవా చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుల మీద ఆయనకు వ్యక్తిగత కోపం ఉండవచ్చేమోగానీ.. ఇండ్లు కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వారిపై సిగ్గుమాలిన స్టేట్మెంట్లు ఇవ్వవద్దని హితవు పలికారు.
అసెంబ్లీ సాక్షిగా, ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల సమక్షంలో ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ ఒట్టి బూటకమని తేలిపోయిందని తాతా మధు విమర్శించారు. ప్రభుత్వ భూములైనా, భూదాన్ భూములైనా పేదలందరికీ పట్టాలు ఇచ్చి ఇండ్లు కట్టిస్తామంటూ గతంలో నిండు చట్టసభలో సీఎం ఇచ్చిన మాటను గుర్తుచేశారు. అలాంటప్పుడు వెలుగుమట్లలోని భూదాన్ భూముల్లో పేదలు ఇండ్లు కట్టుకుంటే ఎందుకు కూల్చారని ప్రశ్నించారు.
ఆ భూములు మీ ముగ్గురు మంత్రులవా అని నిలదీశారు. పిట్టల దొర మాదిరిగా నోటికి ఏది వస్తే అది మాట్లాడడం తప్ప ఆచరణలో ఏ ఒక్కటీ మంచి పని చేయలేదని విమర్శించారు. కేవలం మంత్రుల వ్యక్తిగత స్వార్థం, స్వలాభం కోసమే పేదల ఇండ్లను నేలమట్టం చేశారని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వానికి కచ్చితంగా పేదల ఉసురు తగులుతుందని తేల్చి చెప్పారు. కేటీఆర్ ఖమ్మం వస్తున్నారని తెలిసిన వెంటనే ఇండ్లను కూల్చిన కాంగ్రెసోళ్లు కలెక్టర్ వద్దకు వెళ్లి న్యాయం చేస్తామని, పక్కా ఇండ్లను నిర్మించి ఇస్తామని కొందరు మెమోరాండం ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
కాంగ్రెస్ నేతలు చెప్పిన ప్రతీ మాటనూ వింటూ చట్టవిరుద్ధ పనులు చేస్తున్న అధికారులంతా జాగ్రత్తగా మసలుకోవాలని తాతా మధు సూచించారు. వెలుగుమట్లలో ఇండ్లను కూల్చడమే పెద్ద తప్పయితే బాధితులను రోజుకో విధంగా బాధ పెట్టడం మరింత తప్పని, బెదిరించడం దుర్మార్గమని అన్నారు. జైళ్లలోని ఖైదీల మాదిరిగా వారిని ట్రీట్ చేయడం తగదన్నారు.
కేటీఆర్ ఖమ్మం పర్యటనలో అధికారులు చేసిన ఘనకార్యాల జాబితా తమ వద్ద ఉందని అన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షలకు హాజరుకాలేక పోయారని, ఇతర విద్యార్థులు పాఠశాలలకు కూడా వెళ్లలేని దుస్థితిని కల్పించారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా వారికి సరైన వసతి కల్పించాలని, సమయానికి భోజనం పెట్టాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన వారందరికీ తక్షణమే ఇండ్ల పట్టాలు ఇచ్చి, పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే కలిసొచ్చే అన్ని విపక్ష పార్టీలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.
బాధితులను పరామర్శించడం కోసం కేటీఆర్ వస్తే.. కాంగ్రెస్ నేతలు పనికిమాలిన వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. వారికి ధైర్యముంటే వెలుగుమట్ల వద్దకు రావాలని సవాల్ విసిరారు. అప్పుడు రాళ్లు ఎవరికి పడతాయో, పూలు ఎవరికి చల్లుతారో తెలుస్తుందని అన్నారు. కాంగ్రెస్ దౌర్జన్యానికి బలైన వారందరికీ బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
హైకోర్టుకు, సుప్రీం కోర్టుకు, మానవ హక్కుల సంఘాలకు వెళ్లయినా సరే బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే తమ నాయకుడు కేటీఆర్ చెప్పారని గుర్తు చేశారు. ప్రభుత్వం చేతులెత్తేస్తే బాధితులందరికీ ఆహారం, వసతి కల్పించేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇంకో రెండున్నరేండ్లలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ సీఎం అవుతారని అన్నారు.
వెలుగుమట్ల భూదాన్ భూముల్లోనే పేదలకు పట్టాలు ఇచ్చి ఇండ్లు నిర్మించి, దగ్గరుండి గృహ ప్రవేశాలు చేయిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతలు పగడాల నాగరాజు, కూరాకుల నాగభూషణం, ఆర్జేసీ కృష్ణ, ఉప్పల వెంకటరమణ, బిచ్చాల తిరుమలరావు, గుండ్లపల్లి శేషగిరిరావు, తాజుద్దీన్, బంక మల్లయ్య, లింగనబోయిన సతీశ్, బలుసు మురళీకృష్ణ, సద్దాం షేక్, మహ్మద్ రఫీ, నారమళ్ల వెంకన్న, ఆరెంపుల వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.
సుదూరంగా ఉన్న గాజాలో ప్రజలు అవస్థలు పడుతున్న చందంగా ఖమ్మంలో నిరుపేదలు ఆర్తనాదాలు చేస్తుంటే జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రులు ఎక్కడికి వెళ్లారని తాతా మధు ప్రశ్నించారు. పేదల బతుకులు ఛిద్రమవుతుంటే మొఖం చాటేసిన వారు.. చీకటి మాటున, తెరచాటున సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఎద్దేవా చేశారు.
ఎందుకు నోరు విప్పడం లేదో జిల్లా ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘పేదలందరికీ భూదాన్ ట్రస్ట్ నుంచి పట్టాలు కూడా ఇచ్చారు. వాటి ఆధారంగానే కొందరు గుడిసెలు వేసుకున్నారు. మరికొందరు ఇండ్లు కట్టుకున్నరు.’ అని అన్నారు. అలాంటి పేదల ఇళ్లను ఎందుకు కూల్చారని ప్రశ్నించారు. నిలువ నీడ కూడా లేని పేదలు.. కాంగ్రెస్ మాయ మాటలను నమ్మి ఓట్లేశారని అన్నారు.
వారు ఓట్లేస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఇక్కడి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. ‘ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని చెంపలేసుకోండి’ అంటూ సలహా ఇచ్చారు. నాలుగు రోజుల క్రితం వెలుగుమట్లలో జరిగిన దారుణ ఘటన ప్రజాస్వామ్యం దాడిగా మధు అభివర్ణించారు. రాజ్యాంగ పరిరక్షణ అంటూ రాజ్యాంగ బుక్ పట్టుకొని వీధుల్లో తిరిగే రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నించారు.
రెక్కాడితే డొక్కాడని మేము ఖమ్మం నగరంలో కూలి పనులు చేసుకుంటూ.. అప్పులు తెచ్చుకుని కట్టుకున్న ఇంటిని అధికారులు ఒక్కసారిగా యంత్రాలతో కూల్చి వేశారు. ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు పోయి.. తెచ్చిన అప్పులు తీరక రోడ్డున పడాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఇండ్లు కూల్చివేసి చేతులు దులుపుకుంది. మాలాంటి పేదలకు అండగా నిలిచి, మా దగ్గర నుంచి ఇండ్ల కోసం కొందరు వసూలు చేసిన డబ్బులను తిరిగి ఇప్పించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లు కోల్పోయిన నిరుపేదలకు కొత్త ఇండ్లు మంజూరు చేసి ఆదుకోవాలి.
-బీరెల్లి సరిత, బాధితురాలు
భూదాన్ భూముల్లో ఇండ్లు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం వెంటనే ఇంటి స్థలంతోపాటు ఇండ్లు మంజూరు చేయాలి. తొమ్మిదేండ్లుగా ఇక్కడే ఉంటున్న మా ఇంటిని కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చడం అన్యాయం. ప్రజా ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే పేదల ఇండ్లను కూల్చివేసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే పేదలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ఉండేందుకు ఇల్లు లేక, కూలి పనులు లేక ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాం. ప్రభుత్వం మమ్ముల్ని ఆదుకోవాలి. నీడ కల్పించాలి.
-బొర్రా సింధు, బాధితురాలు