Farooq Abdullah : తాజాగా జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాంతోపాటు అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దాడికి పాల్పడిన తీవ్రవాదుల వివరాల్ని వెల్లడించాలని, వారి గుర్తింపును బహిరంగపరచాలని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. ఇన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నా అసలు తీవ్రవాదులు ఎక్కడినుంచి వస్తున్నారు అంటూ ఫరూక్ ప్రశ్నించారు. తాజా ఘటనల నేపథ్యంలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రెండు రోజుల క్రితం కుల్గాంలో ఉగ్రవాదులు దాడి చేసి, ఇద్దరు వలస కార్మికుల్ని కాల్చి చంపారు.
అలాగే, అనంత్‌నాగ్‌లో కూడా ఒక పోలీసు అధికారికి కాల్చివేశారు. ఈ నేపథ్యంలో మరోసారి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి జరగడంతో ఆందోళన నెలకొంది. దీనిపై ఫరూక్ మాట్లాడారు. ‘‘ఈ హత్యలు ఎవరు చేస్తున్నారో ప్రభుత్వం ప్రజలకు వెల్లడించాలి. వాళ్లను ఉగ్రవాదులు చంపారని మాత్రమే చెప్పారు. సరిహద్దులు మూసి ఉన్నా సరే అసలు తీవ్రవాదులు దేశంలోకి ఎలా ప్రవేశిస్తున్నారు అనేదే అసలైన ప్రశ్న. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదం అంతమైందని చెప్పిన లెఫ్టినెంట్ గవర్నర్ వ్యాఖ్యలు తప్పని చూపించడానికి హంతకుల నిజస్వరూపాల్ని బయటపెట్టడం అవసరం. మనమే కాదు.. ప్రపంచం అంతా ఉగ్రవాదుల్ని చూడాలి. తీవ్రవాదం అంతమైందా..? పరిస్థితులు ఎలా మారాయో చూడండి’’ అంటూ ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. మరోవైపు 2019లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూకాశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదాను తొలగించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర హోదాను తొలగించి, కేంద్ర పాలిత ప్రాంతంగా విభజించింది. జమ్మూ-కాశ్మీర్‌తోపాటు, లదాక్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేసింది. దీనిపై కూడా ఫరూక్ అబ్దుల్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్‌కు కేంద్రం రాష్ట్ర హోదాను తిరిగి పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు.
అలాగే, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (పీవోజేకే)లో జరుగుతున్న మారణహోమాన్ని కూడా ఫరూక్ వ్యతిరేకించారు. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ ఆందోళన చేపట్టిన వారిపై పాక్ ప్రభుత్వం కాల్పులు జరపడంతో గత వారం 50 మందికిపైగా మరణించారు. దీనిపై ఫరూక్ మాట్లాడుతూ.. ‘‘పీవోజేకేలో ఉన్నది మన సోదరులే. వాళ్లు ఎదుర్కొంటున్న పరిస్థితుల్ని చూస్తే బాధ కలుగుతుంది. ఐక్యరాజ్యసమితికి మానవ హక్కుల సంఘం ఉంది. వారు ఒక బృందాన్ని పంపి అక్కడ ఏం జరుగుతుందో చూడాలి. ఈ విషయంలో ప్రపంచం అంతా మౌనంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. మన దేశం కూడా దీని గురించి ఏమీ చెప్పడం లేదు’’ అంటూ ఫరూక్ వ్యాఖ్యానించారు.