గౌహతి: ఐఐటి గౌహతికి చెందిన ఇద్దరు విద్యార్థినులు ప్రమాదవశాత్తు జారి బ్రహ్మపుత్ర నదిలో పడ్డారు. ఒక విద్యార్థిని నదిలో మునిగి మరణించగా, మరో విద్యార్థినిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. (IIT Guwahati Student Drowns) అస్సాం రాజధానిలోని ఐఐటీ గౌహతిలో చదువుతూ క్యాంపస్ హాస్టల్లో ఉంటున్న ఇద్దరు అమ్మాయిలు శనివారం కొంత సమయం బయట గడిపేందుకు లతియా బగీచా ఘాట్ వద్దకు వెళ్లారు.
కాగా, ప్రమాదవశాత్తు కాలు జారడంతో ఆ ఇద్దరు విద్యార్థినులు బ్రహ్మపుత్ర నదిలో పడ్డారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే జాతీయ విపత్తు ప్రతిస్పందన దళానికి (ఎన్డిఆర్ఎఫ్) చెందిన సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఒక అమ్మాయిని పది నిమిషాల్లో రక్షించారు. మునిగిపోయిన మరో విద్యార్థిని కోసం గజ ఈతగాళ్ల సహాయంతో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. మూడు గంటల తర్వాత ఆమె మృతదేహాన్ని వెలికితీశారు.
మరోవైపు మరణించిన యువతి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ) విభాగానికి చెందిన బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అని ఐఐటి గౌహతి యాజమాన్యం తెలిపింది. ఆమె అకాల మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసింది. తమ విద్యా సంస్థతో పాటు విద్యార్థిని కుటుంబానికి పూడ్చలేని నష్టమని పేర్కొంది. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది.