(Venkaiah Naidu) హైదరాబాద్: తెలుగు భాష, సంస్కృతి అభ్యున్నతి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చూపుతున్న చొరవ అభినందనీయమని భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రశంసనీయమని చెప్పారు. భాషాభివృద్ధికి సీఎం కేసీఆర్ చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ మాదిరిగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భాష, సంస్కృతి, కళలను కాపాడుకునేందుకు చొరవ తీసుకోవాలని సూచించారు. ఆధునిక కాలానికి అనుగుణంగా తెలుగు భాషను ప్రతి ఒక్కరికీ చేరువ చేసేందుకు మరింత కృషి జరుగాలన్నారు. అలాగే, సాంకేతిక పదాలకు సంబంధించి తెలుగు సమానార్ధక నిఘంటువు రూపొందించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు.
ఆదివారం ఉదయం నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాయలం వ్యవస్థాపక దినోత్సవంలో ఉపరాష్ట్రపతి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కవి, విమర్శకుడు డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య, కూచిపూడి నాట్యాచార్యులు కళాకృష్ణకు విశిష్ఠ పురస్కారాలను ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. అనంతరం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ నేపథ్యంలో ఏర్పాటుచేసిన ఏక్ భారత్ – శ్రేష్ఠ్ భారత్ ప్రదర్శనను వెంకయ్యనాయుడు ప్రారంభించారు.
తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు భాష అభివృద్ధి కోసం ఏర్పడటంతోపాటు దేశవ్యాప్తంగా భాషాప్రాతిపదికన ఏర్పాటైన రెండో విశ్వవిద్యాలయం కావడం మనందరికీ గర్వకారణమని వెంకయ్యనాయుడు అన్నారు. తెలుగు భాషాబోధన, పరిశోధన, ప్రచురణ, విస్తరణ సేవల ద్వారా తెలుగు భాషను, సాహిత్యాన్ని, సంస్కృతిని, చరిత్రను పరిరక్షించుకుంటున్న విశ్వవిద్యాలయ సంకల్పాన్ని అభినందించారు. దేశంలో పరిపాలనా భాషలుగా మాతృభాషలే ఉండాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. పరాయి పాలకులు మన భాష సంస్కృతుల పట్ల ప్రతికూల భావాన్ని, ఆత్మన్యూనతను మన మనసుల్లో నాటే ప్రయత్నం చేశారన్నారు. కొందరు నేటికీ వాటిని గుడ్డిగా అనుసరించడం బాధాకరమన్నారు. ఈ ఆత్మన్యూనతను వదిలించుకుని భాష సంస్కృతుల గొప్పతనాన్ని ఘనంగా చాటుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హోంశాఖామాత్యులు మహమూద్ అలీ, తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బీ వినోద్ కుమార్, తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి టీ కిషన్ రావు, రిజిస్ట్రార్ భట్టు రమేష్, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
చర్మ క్యాన్సర్ ఎందుకు వస్తుందో కారణం తెలిసిపోయింది!
సోరియాసిస్ బాధితులకు గుడ్‌న్యూస్.. శాశ్వత పరిష్కారం దొరికినట్టే
నొప్పి లేని, మచ్చ రాని వీనోట్స్ సర్జరీ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..