హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూలు అంటేనే అన్యాయాలు, అసమానతలకు అవకాశమివ్వడం. వివక్ష, ప్రాంతీయతత్వం, ఆశ్రితపక్షపాతం, అవకతవకలు.. పైరవీలకు కేరాఫ్ అడ్రస్. పోస్టుకు ఇంత అని బహిరంగంగా విక్రయించేందుకు మార్గం సుగమం చేయడమే. స్థూలంగా ప్రతిభకు పాతరేయడం. ఇలాంటి వివాదాస్పద ఇంటర్వ్యూ విధానాన్ని కాంగ్రెస్ సర్కార్ తిరిగి ప్రవేశపెట్టింది. డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీలో ఇంటర్వ్యూలను పునరుద్ధరించింది. ఇదే తరహాలో మిగిలిన ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూలను ప్రవేశపెట్టబోతున్నది. దీనిపై నిరుద్యోగులు, జేఏసీ నేతలు మండిపడుతున్నారు. దీన్ని ఇంటర్వ్యూల పేరిట తమకు అనుకూలంగా ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగాలను కట్టబెట్టే కుట్రగా అభివర్ణిస్తున్నారు.
ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రకటించింది. జీవో-4 ద్వారా ఇంటర్వ్యూలను పునరుద్ధరించింది. పైగా ఈ పోస్టులను టీజీపీఎఎస్సీ ద్వారానే భర్తీచేస్తామన్నది. అనేక అక్రమాలకు చోటు కల్పిస్తున్న ఇంటర్వ్యూ విధానాన్ని గత కేసీఆర్ సర్కార్ ఎత్తివేసింది. 2022 ఏప్రిల్ 11న జీవో- 47 ద్వారా టీజీపీఎస్సీలో భర్తీ చేసే అన్ని రకాల, అన్ని క్యాటగిరీ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను రద్దుచేసింది. దీంతో గ్రూప్ -1, గ్రూప్ -2, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ వంటి పోస్టులను పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగానే భర్తీ చేసే అవకాశం ఏర్పడింది. ఐఏఎస్ పోస్టు తర్వాత అంతటి ప్రాధాన్యం గల గ్రూప్-1లో లేనిది అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను పెట్టడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.
ఉమ్మడి ఏపీ నుంచి మొదలుకుంటే ఇంటర్వ్యూ విధానంలో గతంలో అనేక అక్రమాలు జరిగాయి. 2011 గ్రూప్-1 రిక్రూట్మెంట్లో అనేక అవకతవకలు జరుగడంతో ఏపీపీఎస్సీ అపనిందలు మూటగట్టుకోవాల్సి వచ్చింది. 2007 గ్రూప్ -1లోనూ ఇదే జరిగింది. 2007 గ్రూప్ -1 రాతపరీక్షలో రెండో ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఇంటర్వ్యూలో 20 మార్కులే వేశారు. దీంతో డిప్యూటీ కలెక్టర్ కావాల్సిన అభ్యర్థి ఆర్టీవో ఉద్యోగంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అదే రాయలసీమ అభ్యర్థులకు ఇంటర్వ్యూలో 85 మార్కులు వేశారు. తెలంగాణలోని కొందరు అభ్యర్థులకు 13, 15మార్కులే వేయడంతో వారంతా ఉన్నత ఉద్యోగాలు పొందలేకపోయారు. ఇలాంటి వివక్షకు తావు లేకుండా.. పక్షపాతానికి అవకాశం లేకుండా.. ఉద్యోగాల భర్తీ అత్యంత పారదర్శకంగా జరగాలని అస్తవ్యస్తమైన విధానం తెలంగాణలో ఉండరాదన్న సదుద్దేశంతోనే కేసీఆర్ సర్కార్ ఇంటర్వ్యూలను రద్దు చేసింది.
యూజీసీ మార్గదర్శకాలను అనుసరించి కొత్త విధానాన్ని అనుసరించినట్టు ప్రభుత్వం పేర్కొన్నది. యూజీసీ మార్గదర్శకాల్లో ఎక్కడా రాత పరీక్ష గురించి ప్రస్తావనే లేదు. మరీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష ఎందుకన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొంతకాలం క్రితం యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్కు జీవో-21ని ప్రభుత్వం జారీచేసింది. ఈ జీవోలో రాత పరీక్ష గురించిన ప్రస్తావనే లేదు. 70% అకాడమిక్ మార్కులు, 30% ఇంటర్వ్యూకు మార్కులు కేటాయించారు. డిగ్రీ కాలేజీల్లోని టీచింగ్ పోస్టులను సైతం అసిస్టెంట్ ప్రొఫెసర్ పేరుతోనే పిలుస్తున్నారు. వీటి భర్తీకి మాత్రం 40 మార్కులకు రాత పరీక్ష ఉంటుందని జీవో-4 ద్వారా ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఒకే రాష్ట్రంలో ఒకే పోస్టుకు రెండు రకాల విధానం ఎలా ఉంటుందని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
ఇది వరకు డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకి 500 మార్కులుండేవి. జనరల్ స్టడీస్‌కు 150 మార్కులు, సబ్జెక్టుకు 300 మార్కులు (రెండు మార్కుల ప్రశ్నలు 150), మరో 50 మార్కులకు ఇంటర్వ్యూ/డెమో ఉండేది. కానిప్పుడు దీన్ని 100 మార్కులకు కుదించారు. ఈ 100 మార్కుల్లో రాత పరీక్షకు కేవలం 40 మార్కులే ఉంటాయి. ఈ 40 మార్కులకు ఒక మార్కునిచ్చే 40 ప్రశ్నలిస్తారా..? లేక అర మార్కునిచ్చే 80 ప్రశ్నలిస్తారా.? అన్న విషయంపై స్పష్టతలేదు. గతంలో సంబంధిత సబ్జెక్టులో పీజీ, నెట్ లేదా సెట్, పీహెచ్డీ ఉంటే సరిపోయేది. కానిప్పుడు కొత్తగా అకాడమిక్ మార్కులను ప్రామాణికంగా తీసుకుంటామన్నారు. అంటే డిగ్రీ, పీజీ మార్కులను లెక్కలోకి తీసుకుంటారు. మొత్తంగా ఇది గందరగోళానికి దారితీయనున్నది.