YS Sharmila | మోసపు మోదీజీ వైభోగాన్ని పొగిడేంత శ్రద్ధ.. కూటమి ప్రభుత్వానికి గోదావరి ముంపు ప్రాంతాలపై లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ప్రధాని గొప్పోడని, మొనగాడని భజన చేసేందుకున్న ఆసక్తి .. నీట మునిగిన గ్రామాల ప్రజలను ఒడ్డున చేర్చేందుకు లేదని మండిపడ్డారు.
ఒకవైపు ఊళ్లకు ఊళ్లు మునుగుతుంటే, గోదావరి ఉగ్రరూపం దాల్చి 100 గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతుంటే, 20 వేల మందికి పైగా వరదనీటిలో సర్వం కోల్పోయి నిర్వాసితులుగా మారుతుంటే, తక్షణ పునరావాసం కల్పించాలన్న సోయి ప్రభుత్వానికి లేకపోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. వారికి భరోసా ఇవ్వాలన్న భాద్యతను విస్మరించడం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు.
మోదీజీ తిడితేనే మీ కంట కన్నీరొస్తే, నిర్వాసితుల గోస చూసి మరి గుండె తరుక్కుపోవడం లేదా అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. వారి కన్నీటి గోడు వినపడటం లేదా ? తట్ట, బుట్ట సర్దుకుని గ్రామాలు ఖాళీ చేస్తున్న దృశ్యాలు కనిపించలేదా ? వరద ముంపు ఉంటుందని తెలిసి ముందే బాధితులను ఎందుకు సురక్షిత ప్రాంతాలకు తరలించలేదు ? ముంపు గ్రామాలని తెలిసి స్థానికులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని ఇప్పటికే ఎందుకు ఇవ్వలేదు అని నిలదీశారు.
గోదావరి వరద ప్రభావం తగ్గే వరకు ముంపు ప్రాంతాల ప్రజలకు అండగా నిలవాలని.. వారికి పునరావాసం తక్షణం కల్పించాలని.. చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. పునరావాస కేంద్రాల్లో భోజన వసతులు ఏర్పాటు చేయాలన్నారు. నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలన్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి వైద్య సేవలు అందుబాటులో పెట్టాలని.. చిన్నారులు, గర్భిణీల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏటా వచ్చే వరదలను దృష్టిలో పెట్టుకుని పోలవరం ముంపు గ్రామాల ప్రజలకు తక్షణం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని అందించాలని, సురక్షిత ప్రాంతాల్లో మెరుగైన పునరావాసం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.