e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News ప్రతి మూత్రపిండ రోగీ డయాలసిస్‌ చేయించుకోవాలా? అసలు ఎవరికి అవసరం?

ప్రతి మూత్రపిండ రోగీ డయాలసిస్‌ చేయించుకోవాలా? అసలు ఎవరికి అవసరం?

మూత్రపిండ సమస్యలు అనగానే డయాలసిస్‌ గుర్తుకొస్తుంది. దవాఖానల చుట్టూ పరుగులు పెట్టే రోగులు కండ్లముందు కనిపిస్తారు. కిడ్నీ సమస్యలను తొలి దశలోనే గుర్తిస్తే డయాల సిస్‌ వరకూ వెళ్లాల్సిన పరిస్థితే రాదని భరోసా ఇస్తున్నారు నిపుణులు. వైద్య రంగంలోని ఆధునిక ఆవిష్కరణల కారణంగా గతంతో పోలిస్తే డయాలసిస్‌ ఎంతోకొంత సౌకర్యవంతంగా మారిందని భరోసా ఇస్తున్నారు.

‘మొక్కయి వంగనిది మానై వంగునా’ అన్న నానుడి ఆరోగ్యం విషయంలోనూ వర్తిస్తుంది. రోగం ఏదైనా సరే, తొలి దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే ఆదిలోనే అడ్డుకట్ట వేయవచ్చు. కొన్ని రకాల వ్యాధులు ముదిరితే జీవిత కాల సహజీవనం తప్పదు. ఇలాంటి దీర్ఘకాలిక రుగ్మతల్లో మూత్రపిండ వ్యాధి ఒకటి. ఈ మధ్యకాలంలో కిడ్నీ రోగుల సంఖ్య పెరిగిపోతున్నది, దాంతో పాటే డయాలసిస్‌ తప్పనిసరైనవారి సంఖ్య కూడా. దేశ జనాభాలో 12 నుంచి 17 శాతం శాశ్వత కిడ్నీ రోగులు ఉన్నట్టు తాజా నివేదికలు చెబుతున్నాయి. వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించకుండా, గుర్తించినా నిర్లక్ష్యం చేయడం వల్లనే చాలా సందర్భాల్లో కిడ్నీలు శాశ్వతంగా విఫలం అవుతున్నాయి. సాధారణంగా మూత్రపిండాలు తీవ్రంగా దెబ్బతిన్నా కూడా, 90 శాతం రోగుల్లో ఎలాంటి లక్షణాలూ కనిపించవు. అందుకే ఈ సమస్యను ‘సైలెంట్‌ కిల్లర్‌’గా అభివర్ణిస్తారు వైద్యులు. సగానికి సగం మందిలో కిడ్నీ వైఫల్యానికి ప్రధాన కారణం మధుమేహమే. ప్రతి మూత్రపిండ రోగీ డయాలసిస్‌ చేయించుకోవాలా? అసలు ఎవరికి డయాలసిస్‌ అవసరం? ఒకసారి ప్రారంభిస్తే జీవితాంతం చేయించుకోవాలా?.. ఇలా సగటు మనిషిలో ఎన్నో సందేహాలు.

మూత్రపిండ వైఫల్యం
కిడ్నీ ఫెయిల్యూర్‌ అనేది రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది తాత్కాలిక వైఫల్యం. చికిత్స తీసుకుంటే, నెలా రెండు నెలల్లో తగ్గిపోతుంది. కాకపోతే నిపుణుడి పర్యవేక్షణలోనే వైద్యం జరగాలి. రెండోది శాశ్వత వైఫల్యం. ఈ దశకు చేరుకొనేసరికి మూత్రపిండాలు పూర్తిగా దెబ్బతిని, పనిచేయడం మానేస్తాయి. రోగులు జీవితాంతం చికిత్స తీసుకోవాల్సిందే.

- Advertisement -

డయాలసిస్‌ ఎప్పుడు?
రక్తాన్ని వడపోసి శరీరంలోని మలినాలను, విషాలను విసర్జించడానికి తోడ్పడే వ్యవస్థే.. మూత్ర
పిండాలు. వీటి పనితీరు మందగిస్తే, కృత్రిమ పద్ధతుల్లో ఆ పని జరిపించాల్సి ఉంటుంది. లేదంటే, ఒంట్లో వ్యర్థాలు పేరుకుపోతాయి. డయాల సిస్‌లో జరిగేది ఆ శుద్ధి ప్రక్రియే. అలా అని, ప్రతి రోగికీ డయాలసిస్‌ అవసరం కాకపోవచ్చు. తాత్కాలిక వైఫల్యమైనా, శాశ్వత వైఫల్యమైనా మొదట మందులతోనే చికిత్స చేస్తారు. పూర్తిగా మొరాయించినప్పుడు మాత్రం డయాలసిస్‌ తప్పదు. కిడ్నీ దెబ్బతిన్న ప్రతి ఒక్కరికీ డయాలసిస్‌ తప్పదనుకోవడం పొరపాటే.

సీరం క్రియాటినిన్‌ పాత్ర
క్రియాటినిన్‌ అనేది శరీరంలోని వ్యర్థ పదార్థం. కిడ్నీల పనితీరు దెబ్బతినడంతో ఒంట్లో పేరుకు పోతుంది. ఇది హానికర పరిణామం. అలా అని, రక్తంలో క్రియాటినిన్‌ శాతం పెరిగినంత మాత్రాన డయాలసిస్‌ అవసరం కాకపోవచ్చు. అన్నిసార్లూ డయాలసిస్‌ అనేది క్రియాటినిన్‌ శాతంపై ఆధారపడి ఉండదు. రోగి పరిస్థితి స్థిరంగా ఉండి, రక్తంలో పొటాషియం, ఆమ్లాలు నియంత్రణలో ఉన్నప్పుడు.. శ్వాస సమస్య లేకుండా, ఆకలి సరిగ్గా ఉన్నప్పుడు.. సీరం క్రియాటినిన్‌ 10 శాతం ఉన్నా డయాలసిస్‌ అవసరం కాకపోవచ్చు. అలా కాకుండా, రోగి ఆరోగ్యం నిలకడగా లేకుండా రక్తంలో పొటాషియం పెరిగిపోయినప్పుడు లేదా కిడ్నీతో పాటు గుండె పనితీరు తగ్గినప్పుడు.. సీరం క్రియాటినిన్‌ తక్కువగా ఉన్నా కూడా డయాలసిస్‌ అనివార్యం అవుతుంది.

సంకేతాలు…
శరీరంలో వ్యర్థాలు బాగా పెరిగిపోయి, ఊపిరి తిత్తుల్లో నీరు చేరినప్పుడు డయాలసిస్‌ మినహా మరో మార్గం లేదు. మందులకు కూడా తగ్గనంత స్థాయిలో రక్తంలో సీరం పొటాషియం, ఆమ్లాలు పెరిగిపోయినప్పుడు, రక్తంలో పెరిగిపోయిన సీరం క్రియాటినిన్‌ శరీరంలోని ఇతర భాగాల పనితీరుమీద దుష్ప్రభావం చూపినప్పుడు, రక్తంలో విషపూరిత పదార్థాలు పెరిగిపోయి ఆకలి పూర్తిగా తగ్గిపోయినప్పుడు.. డయాలసిస్‌ తప్పనిసరి.

జీవితాంతమా?
మూత్రపిండ రోగులు జీవితాంతం డయాలసిస్‌ చేయించుకోవాలనుకోవడం సరికాదు. మూత్రపిండాలు తాత్కాలికంగా వైఫల్యం చెందినవారు నెల నుంచి రెండు నెలలపాటు చేయించుకుంటే సరిపోతుంది. విధి నిర్వహణలో తాత్కాలికంగా విఫలమైన మూత్రపిండాలు మళ్లీ శక్తిని పుంజుకొనేవరకు డయాలసిస్‌ వ్యవస్థ బాధ్యత నిర్వర్తిస్తుంది. అన్నీ సర్దుకున్నాక డయాలసిస్‌తో పనిలేదు. శాశ్వతంగా కిడ్నీలు విఫలమైన వారికి మాత్రం జీవితాంతం తప్పదు. అయితే, శాశ్వత కిడ్నీ ఫెయిల్యూర్‌ రోగుల్లో కూడా, మూత్రపిండ మార్పిడి చేయించుకుంటే డయాల సిస్‌ను పక్కన పెట్టొచ్చు.

డయాలసిస్‌ – రకాలు
డయాలసిస్‌ స్థూలంగా రెండు రకాలు.
మొదటిది, హీమో డయాలసిస్‌ (హెచ్‌డీ).
రెండు, పెరిటోనియల్‌ డయాలసిస్‌ (సీఏపీడీ).

హీమో డయాలసిస్‌ (హెచ్‌డీ):
హీమో డయాలసిస్‌లో యంత్రం సాయంతో రక్తాన్ని శుద్ధి చేస్తారు. రోగి రక్తనాళాల్లోకి ఒక సన్నటి పైప్‌ (క్యాథటర్‌)ను అమర్చడం ద్వారా లేదా ఓ మైనర్‌ సర్జరీతో రక్తాన్ని డయాలసిస్‌ యంత్రానికి పంప్‌ చేసి శుద్ధి చేస్తారు. హెచ్‌డీ డయాలసిస్‌ కోసం రోగి వారంలో రెండుమూడు సార్లు హాస్పిటల్‌కు వెళ్లాల్సి ఉంటుంది.

పెరిటోనియల్‌ డయాలసిస్‌ (సీఏపీడీ)
పెరిటోనియల్‌ డయాలసిస్‌లో రోగి హాస్పిటల్‌కు వెళ్లాల్సిన పన్లేదు. ఇంట్లోనే ఏర్పాట్లు చేసుకోవచ్చు. దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు రైలు, బస్సు, విమానాల్లో కూడా డయాలసిస్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ పద్ధతిలో రక్తం సహజ పద్ధతిలో శుద్ధి అవుతుంది. రోగి నాభి కింద స్వాన్‌ నెక్‌ క్యాథటర్‌ అనే ట్యూబ్‌ను అమరుస్తారు. ఈ ట్యూబ్‌కు పెరిటోనియల్‌ బ్యాగ్స్‌ జతచేస్తారు. ఇందులో రెండు సంచులు ఉంటాయి. ఒక సంచిలో రెండు లీటర్ల పెరిటోనియల్‌ ఫ్లూయిడ్‌ ఉంటుంది. మరో సంచి ఖాళీగా ఉంటుంది. ఈ వ్యవస్థను రోగి కడుపులోని ట్యూబ్‌కు కనెక్ట్‌ చేసినప్పుడు కడుపులోని నీరంతా ఖాళీ బ్యాగులోకి వచ్చేస్తుంది. ఫ్లూయిడ్‌తో నిండిన సంచిలోని నీరు కడుపులోకి వెళ్తుంది. ఈ ప్రక్రియలో కడుపులోని ‘పెరిటోనియల్‌ మెంబ్రేన్స్‌’ జల్లెడలా పనిచేస్తూ రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది రక్తాన్ని సహజ పద్ధతిలో కడిగేస్తుంది. దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం… రోజూ మూడుసార్లు చేసుకోవాలి. పెరిటోనియల్‌ డయాలసిస్‌ పద్ధతిలో నీటిని ఎంతసేపు కడుపులోకి పంపాలి, ఎంతసేపటి తర్వాత బయటికి తీయాలనేది వైద్యుల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అలా కాకుండా ‘సైక్లర్‌’ అనే యంత్రాన్ని అమర్చుకుంటే నీటిని సెట్‌ చేయాల్సిన పన్లేదు. దానంతట అదే కడుపులోని నీటిని ఖాళీ సంచిలోకి పంపుతుంది. ఫ్లూయిడ్‌ బ్యాగులోని నీటిని కడుపులోకి చేరుస్తుంది.

కొత్త టెక్నాలజీ
డయాలసిస్‌ అనేది రక్తాన్ని శుద్ధి చేసే ఒక పద్ధతి. ఇందులో కొత్త సాంకేతికతలూ వస్తున్నాయి. గత ఐదారేండ్ల కాలంలో హెచ్‌డీఎఫ్‌ (హీమో డయా ఫిల్టరేషన్‌) అనే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. సాధారణ డయాలసిస్‌తో పోల్చితే హెచ్‌డీఎఫ్‌ ద్వారా రక్తంలోని వ్యర్థాలను సమర్థంగా శుద్ధి చేయవచ్చు. ఈ పద్ధతి వల్ల సాధారణ డయాలసిస్‌లో ఉన్నట్టు, శరీరంలోని ఇతర అవయవాలపై దుష్ప్రభావాలు పడవు. రోగి జీవన నాణ్యత పెరుగుతుంది. కానీ, పరిస్థితి అంతవరకూ రాకుండా చూసుకోవడం మంచిది. జీవన శైలిలో, ఆహార విధానంలో మార్పుల ద్వారా ఇది సాధ్యమే.

లక్షణాలు

 • కాళ్ల వాపు, ముఖం వాపు.
 • శ్వాస సమస్యలు.
 • ఎడతెరిపిలేని వాంతులు.
 • మూత్ర విసర్జన తగ్గడం.

ఇవీ జాగ్రత్తలు

 • మధుమేహ రోగులు వ్యాధి నిర్ధారణ జరిగినప్పటి నుంచీ చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుకోవాలి.
 • బీపీ రోగులు రక్తపోటును అదుపులో పెట్టుకోవాలి.
 • వైద్యులను సంప్రదించకుండా పెయిన్‌ కిల్లర్స్‌ వాడకూడదు
 • కనీసం వారంలో ఐదురోజులు, రోజుకు 30 నిమిషాలు వ్యాయామం చేయాలి
 • 40 ఏండ్లు దాటిన వారు ఏడాదికోసారి బీపీ, షుగర్‌ పరీక్షించుకోవాలి.

కారణాలు

తాత్కాలిక వైఫల్యానికి

 • బ్లడ్‌ ఇన్‌ఫెక్షన్స్‌(సెప్సిస్‌).
 • హైపోటెన్షన్‌(లో బీపీ).
 • పెయిన్‌ కిల్లర్స్‌, యాంటిబయోటిక్స్‌ అధికంగా వాడటం.
 • శరీరంలోని విష పదార్థాలు.

శాశ్వత వైఫల్యానికి

 • దీర్ఘకాలిక మధుమేహం.
 • దీర్ఘకాలిక హైపర్‌ టెన్షన్‌.
 • విశృంఖలంగా పెయిన్‌ కిల్లర్స్‌ వాడటం.
 • మహేశ్వర్‌రావు బండారి

డాక్టర్‌ పి.ఎస్‌.వలి, డీఎం (నెఫ్రాలజీ)
నెఫ్రాలజిస్ట్‌ అండ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ ఫిజీషియన్‌
ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నెఫ్రాలజీ అండ్‌ యూరాలజీ, దిల్‌సుఖ్‌నగర్‌, హైదరాబాద్‌.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement