Apple March event : యాపిల్ బ్రాండ్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాపిల్ మార్చ్ ఈవెంట్ వచ్చే వారమే జరగనుంది. సోమవారం ఉదయం నుంచి యాపిల్ న్యూ ప్రోడక్ట్స్ విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని యాపిల్ సీఈవో టిమ్ కుక్ అధికారికంగా వెల్లడించాడు. అయితే, ఏ ఉత్పత్తులు విడుదలవుతున్నాయో వెల్లడించలేదు. కానీ, టెక్ నిపుణుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం యాపిల్ కనీసం ఐదు కొత్త ఉత్పత్తుల్ని మార్కెట్లోకి రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.
మొత్తం ఒకేసారి కాకుండా మూడు రోజులపాటు ప్రత్యేక లాంఛింగ్ ఈవెంట్ల ద్వారా ఈ ఐదు ప్రొడక్ట్స్ మార్కెట్లోకి వస్తాయి. వాటిలో కీలకమైంది యాపిల్ నుంచి రానున్న అఫర్డబుల్ మొబైల్ ఐఫోన్ 17ఈ. దీంతోపాటు ఐప్యాడ్, మ్యాక్ బుక్, మరో రెండు ఇతర ప్రోడక్ట్స్ రానున్నట్లు తెలుస్తోంది. యువతను, ముఖ్యంగా విద్యార్థుల్ని లక్ష్యంగా చేసుకుని, వారికి అందుబాటులో ఉండే ధరలతో ఇవి లాంఛ్ కానున్నాయి. ఐఫోన్ 17ఈ ఎంట్రీ లెవల్ ఫోన్. ఇందులో 6.1 అంగుళాల ఓలెడ్ డిస్ప్లే, 60 హెర్జ్ రిఫ్రెష్‌రేట్, 48 ఎంపీ సింగిల్ మెయిన్ కెమెరా, 12 ఎంపీ సెల్ఫీ కెమెరా, ఏ19 చిప్సెట్, మ్యాగ్ సేఫ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. అలాగే కొత్త ఐప్యాడ్ ఎయిర్ కూడా లాంఛ్ కానుంది. ఇందులో ఎం4 చిప్సెట్ వాడారు. మరో ఎంట్రీ లెవల్ ఐప్యాడ్ కూడా రానుంది. ఇందులో ఏ 18 లేదా ఏ19 చిప్సెట్ వాడారు.
బ్యాటరీ లైఫ్ మరింత మెరుగ్గా ఉంటుంది. అలాగే డిస్ప్లే సైజ్ కూడా మెరుగుపడనుంది. ఈ మూడింటితోపాటు ఒక అందుబాటు ధరలో ఉండే మ్యాక్ బుక్‌ను కూడా లాంఛ్ చేయనుంది. దీని ధర మన కరెన్సీలో రూ.60,000 వరకు ఉండనుంది. ఇది మొదటిసారి మ్యాక్ బుక్ కొనాలనుకునే విద్యార్థుల్ని లక్ష్యంగా చేసుకుని తయారైందని కంపెనీ అంటోంది. వీటితోపాటు ఒక మ్యాక్ స్టూడియో లేదా యాపిల్ స్టూడియోను కూడా డిస్ప్లే చేయబోతుంది.