గురువారం 04 జూన్ 2020
National - May 17, 2020 , 17:45:12

ఆరు వేల మంది ఖైదీలకు బెయిల్‌

ఆరు వేల మంది ఖైదీలకు బెయిల్‌

చెన్నై: మన దేశంలోని చాలా జైళ్లు సామర్ధ్యానికి మించి ఖైదీలతో నిండిపోయి ఉన్న విషయం తెలిసిందే. అయితే, కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఖైదీలను జాగ్రత్తగా చూడాల్సిన రావడం జైళ్ల శాఖ అధికారులకు కత్తిమీది సాములా తయారైంది. ఏ ఖైదీ జ్వరం వస్తుందో.. అది కరోనా అయితే మరెందరికి అంటిస్తాడో అని అధికారులు బెంబేలుపడిపోతున్నారు. దీని నుంచి బయటపడేందుకు తమిళనాడు ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకొని దాన్ని అమలుచేయాలని హైకోర్టుకు సూచించింది. అదేంటంటే రిమాండ్‌ ఖైదీలు, అండర్‌ ట్రయల్ ఖైదీలకు కరోనా నుంచి విముక్తి కల్పించేందుకు వారికి వెంటనే బెయిల్‌ ఇవ్వడం ఒక్కటే మార్గమని పేర్కొన్నది.

తమిళనాడు ప్రభుత్వ సూచన మేరకు హైకోర్టు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జైళ్ల నుంచి దాదాపు ఆరు వేల మందికి బెయిల్‌ మంజూరుచేసింది. బెయిల్‌ దొరికిన వారు బయటకు వెళ్లిపోతే సెంట్రల్‌జైలు, ఐదు మహిళల జైళ్లతో కలిపి మొత్తం 135 జైళ్లలో కేవలం 13,500 మంది ఖైదీలు ఉంటారని జైళ్ల శాఖ స్పష్టంచేసింది. తమిళనాడులోని అన్నిజైళ్లలో మౌలిక సదుపాయాలు బాగానే ఉన్నాయని, అలాగే ఏనాడూ ఇక్కడి జైళ్లలో రద్దీ లేదని ఒక అధికారి చెప్పారు. కరోనా వైరస్‌ కేసులు వెలుగు చూడకముందు జైళ్ల నుంచి బయటకు వెళ్లినవారి సెలవును జూన్‌ ఒకటో తేదీ వరకు పొడిగిస్తూ అధికారులు నిర్ణయం  తీసుకొన్నారు. కాగా, సందర్శకుల రద్దీని తగ్గించేందుకు అన్ని జైళ్లలో స్మార్ట్‌ఫోన్‌లు అందించగా.. కుటుంబసభ్యులతో మాట్లాడేందుకు ఖైదీలకు వీడియో కాల్‌ సౌకర్యం అందుబాటులో ఉంచారు. 


logo