By Maduri Mattaiah
తెలుగు చిత్రసీమలో ప్రయోగాలు అనగానే అగ్ర కథానాయకుడు నాగార్జున తొలుత గుర్తొస్తారు. ఇమేజ్, స్టార్‌డమ్‌లతో సంబంధం లేకుండా ప్రతి సినిమాతో ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించడానికి తపిస్తుంటారాయన. నూతన దర్శకులను ప్రోత్సహించడంలో ముందుంటారు. నాగార్జున నటించిన తాజా చిత్రం ‘వైల్డ్‌డాగ్’. యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాతో అహిషోర్ సాల్మన్ దర్శకుడిగా పరిచయమయ్యారు. గత చిత్రాల ఫలితాల దృష్ట్యా ఈ సినిమా నాగార్జున కెరీర్‌కు కీలకంగా మారింది. ప్రచార చిత్రాలతో అందరిలో ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రం నాగార్జునకు విజయాన్ని అందించిందా?లేదా? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
కథా విశ్లేషణ..
పూణేలోని జాన్ బేకరీని లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు బాంబుబ్లాస్ట్లకు పాల్పడుతారు. టెర్రరిస్టుల ఆచూకీ కనిపెట్టడం స్థానిక పోలీసులకు సాధ్యం కాకపోవడంతో ఆ కేసును ప్రభుత్వం ఎన్ఐఏ చెందిన విజయ్‌వర్మ(నాగార్జున) టీమ్‌కు అప్పగిస్తుంది. ఉగ్రవాదుల బాంబుదాడుల్లోనే తన కూతురు నవ్య చనిపోవడంతో వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగతంగా ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకుంటాడు. విజయ్‌వర్మ బృందం సాగించిన అన్వేషణలో దేశంలో బాంబు బ్లాస్ట్‌లకు పాల్పడుతున్న ఖాలీద్ అని తెలుస్తుంది. అతడిని పట్టుకోవడానికి విజయ్‌వర్మ ప్లాన్ చేస్తారు. కానీ చివరి నిమిషంలో అది ఫెయిలవ్వడంతో ఖాలీద్ నేపాల్‌కు పారిపోతాడు.
ఖాలీద్‌ను నేపాల్ వెళ్లి పట్టుకోవాలని విజయ్‌వర్మ అనుకుంటాడు. ఉన్నతాధికారుల నుండి అందుకు అనుమతులు లభించవు. చట్టబద్ధంగా కాకుండా అనధికార అండర్‌కవర్ ఆపరేషన్ ద్వారా ప్రాణాలకు తెగించి ఖాలీద్‌ను విజయ్‌వర్మతో పాటు అతడి టీమ్ పట్టుకోవాలని నిర్ణయిస్తారు. ఈ ప్రయత్నంలో వారు విజయవంతం అయ్యారా? నేపాల్‌లో వారికి ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురయ్యాయి?విజయ్‌వర్మ లక్ష్యఛేదనలో ఆర్య(సయామీఖేర్), అలీ రెజా(అలీ రెజా)తో పాటు మిగతావారు ఎలా సాయపడ్డారన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.
హైదరాబాద్‌లోని గోకుల్చాల్, లుంబినీపార్క్ బాంబు దాడుల్లో కీలక నిందితుడిగా ఉన్న యాసిన్ భత్కల్ను ప్రాణాలతో పట్టుకోవడానికి కొందరు ఎన్ఐఏ అధికారులు చేపట్టిన ఓ అపరేషన్‌ను ఆధారంగా చేసుకొని తెరకెక్కిన చిత్రమిది. యథార్థ ఘటనలకు ఫిక్షనల్ అంశాలను జోడించి ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించారు.
టెర్రరిస్ట్ బాంబు దాడులకు పాల్పడటం, వారిని పట్టుకోవడానికి విజయ్‌వర్మ బృందం సాగించే అన్వేషణతో ప్రథమార్థం ఉత్కంఠభరితంగా సాగింది. చట్టానికి దొరకకుండా మారు పేర్లతో తిరుగుతున్న ఉగ్రవాది గురించి నిజాలు తెలుసుకోవడానికి విజయ్‌వర్మ టీమ్ వేసే ప్లాన్స్ ఆసక్తిని రేకెత్తిస్తాయి. నేపాల్‌లో విజయ్‌వర్మ సాగించిన పోరాటానికి యాక్షన్, సస్పెన్స్ మేళవిస్తూ ద్వితీయార్థంలో ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దారు.
ఎన్ఐఏ టీమ్ లీడర్ విజయ్‌వర్మగా నాగార్జున సినిమా పూర్తి భారాన్ని తన భుజస్కందాలపై వేసుకొని నడిపించారు. ఆయన పాత్ర ప్రధానంగానే సినిమా మొత్తం సాగుతుంది. దేశం పట్ల అమితమైన ప్రేమాభిమానాలు కలిగి వృత్తి నిర్వహణకు కట్టుబడి ఉండే నిజాయితీపరుడైన అధికారిగా శక్తివంతంగా ఆయన పాత్రను దర్శకుడు తీర్చిదిద్దారు. అంతర్లీనంగా ఎంతో మనోవేదనను ఎదుర్కొంటున్నా పైకి మాత్రం మానసికంగా బలంగా కనిపిస్తూ తమ టీమ్‌లో ఆత్మస్థెర్యాన్ని నింపుతూ లక్ష్యసాధన కోసం పోరాడే అధికారి పాత్రలో చక్కటి వేరియేషన్స్ చూపించారు.
యాక్షన్ సన్నివేశాల్లో ఉత్సాహంగా నటించారు. ఎన్ఐఏ టీమ్ మెంబర్స్‌గా అలీరెజా మిగతా వారు సహజ అభినయాన్ని కనబరిచారు. సయామీఖేర్ పాత్ర యాక్షన్‌తో తోవినూత్నంగా సాగింది.దియామీర్జా అతిథి పాత్రలో కనిపించింది.
ఊపిరి, మహర్షి చిత్రాలకు రచయితగా పనిచేసిన అహిషోర్ సాల్మన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. తొలి సినిమా కోసం ప్రయోగాత్మక కథాంశాన్ని ఎంచుకున్న ఆయన నిజాయితీగా సినిమాను తెరకెక్కించారు. కమర్షియల్ అంశాల జోలికి పోకుండా పూర్తిస్థాయి అండకవర్ ఇన్వేస్టిగేటివ్ సినిమా ఫీల్‌ను తెలుగు ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేశారు. వార్త పత్రికల్లో వచ్చిన కథనాల్ని ఆధారంగా చేసుకొని చక్కటి మలుపులతో కథను రాసుకున్నారు. ఎక్కువ స్వేచ్ఛను తీసుకోకుండా వాస్తవిక కోణంలోనే కథాగమనాన్ని నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది.
ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ సినిమాల్లో ప్రేక్షకుల ఊహలకు అందకుండా కథ, కథనాల్ని నడిపించడం చాలా ముఖ్యం. ఆ విషయంలో దర్శకుడు కొన్ని చోట్ల తడబడిపోయారు. ఖాలీద్‌ను పట్టుకోవడానికి విజయ్‌వర్మ వేసే ప్లాన్స్‌లో సింపుల్‌గా ఉంటాయి. వాటిని మరింత పకడ్బందీగా రాసుకుంటే బాగుండేది. పతాక ఘట్టాలు బలంగా లేవు. ఉగ్రవాదం, అండర్‌కవర్ ఆపరేషన్స్ నేపథ్యంలో బేబీ లాంటి సినిమాతో పాటు స్పెషల్ ఓప్స్, ఫ్యామిలీమాన్ లాంటి సిరీస్‌లు రూపొందాయి. వాటి ఛాయలతోనే ఈ సినిమా సాగింది. తెలిసిన అంశాలనే చూపిస్తూ వెళ్లారు తప్పితే కొత్త అంశాలను టచ్ చేయలేదు.
సాంకేతిక నేపథ్యం..
సాంకేతికంగా తమన్ నేపథ్య సంగీతం, షానియల్ డియో ఛాయాగ్రహణం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి . సిమ్లా, మనాలిలోని కొండ ప్రాంతాల్లో చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు నవ్యానుభూతిని పంచుతాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.అండర్‌కవర్ ఆపరేషన్ నేపథ్యంలో సాగే ఇలాంటి యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు ఇతర భాషలతో పోలిస్తే తెలుగు తెరపై తక్కువే వచ్చాయి. ఇలాంటి కొత్త ప్రయత్నాన్ని నాగార్జున బృందం సాహసోపేతంగా చేసింది. అయితే ఈ తరహా చిత్రాలను ఆదరించే ప్రేక్షకులు తక్కువే ఉంటారు. వారి ఆదరణను అనుసరించే ఈసినిమా జయాపజయాలు అధారపడి ఉన్నాయి.
రేటింగ్:2.75/5
Review by; MADURI MATTAIAH