బుధవారం 08 జూలై 2020
National - Jun 05, 2020 , 01:21:46

ఇండియా, ఆస్ట్రేలియా కీలక ఒప్పందం

ఇండియా, ఆస్ట్రేలియా కీలక ఒప్పందం

 • సైన్యం.. సహకారం
 • సైనిక బేస్‌ల పరస్పరం వినియోగం
 • ఇండియా, ఆస్ట్రేలియా కీలక ఒప్పందం
 • వర్చువల్‌ సమావేశంలోప్రధానుల చర్చలు
 • రెండు దేశాల మధ్య ఆరు ద్వైపాక్షిక ఒప్పందాలు 

న్యూఢిల్లీ, జూన్‌ 4: ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ సైనిక సహకారంలో ఇండియా, ఆస్ట్రేలియా మైలురాయిగా నిలిచిపోయే ఒప్పందం కుదుర్చుకున్నాయి. రెండు దేశాల సైన్యాలు తమ సైనిక స్థావరాలను పరస్పరం ఉపయోగించుకొనేలా మ్యూచువల్‌ లాజిస్టిక్స్‌ సపోర్ట్‌ అగ్రిమెంట్‌ (ఎంఎల్‌ఎస్‌ఏ)పై సంతకాలు చేశాయి. భారత ప్రధాని నరేంద్రమోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌మారిసన్‌ ఆన్‌లైన్‌లో గురువారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఎంఎల్‌ఎస్‌ఏతోపాటు వాణిజ్యం, విద్య, పన్నులు తదితర ఆరు ఒప్పందాలు కుదిరాయి. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో ఉగ్రవాదంతో శాంతి సుస్థిరతలకు ఇప్పటికీ ముప్పు పొంచే ఉందని ఇద్దరు ప్రధానులు పేర్కొన్నారు. ఏ రూపంలో ఉగ్రవాదం ఉన్నా సహించేదిలేదని సమావేశం తర్వాత ఓ సంయుక్త ప్రకటనలో స్పష్టంచేశారు. 

ఇండియా- ఆసీస్‌ న్యూ మోడల్‌

కరోనా సంక్షోభం నుంచి బయటపడే క్రమంలో భారత్‌- ఆస్ట్రేలియా తమ ద్వైపాక్షిక బంధాన్ని నూతన దారిలోకి తీసుకెళ్తున్నాయని భారత ప్రధాని మోదీ అన్నారు. జీ-20 సమావేశాలు మొదలు కరోనా సంక్షోభం వరకు ప్రధాని మోదీ నిర్మాణాత్మక, సానుకూల దృక్పధంతో కీలక పాత్ర పోషించారని మారిసన్‌ ప్రశంసించారు. ఒక దేశాధినేతతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ద్వైపాక్షిక చర్చలు జరుపటం ప్రధాని మోదీకి ఇదే మొదటిసారి.

ఇండియా- ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఒప్పందాలు

సైనికపరమైన యంత్రాల మరమ్మత్తులు, పునరుద్ధరణ కోసం రెండు దేశాలు తమతమ సైనిక స్థావరాలను పంచుకుంటాయి. సరఫరాలు మరింత వేగంగా జరిగేందుకు చర్యలు తీసుకుంటాయి. ఇందుకోసం ఎంఎల్‌ఎస్‌ఏ ఒప్పందం కుదిరింది. ఇలాంటి ఒప్పందం భారత్‌కు అమెరికా, ఫ్రాన్స్‌, సింగపూర్‌ దేశాలతోఇదివరకే ఉంది.

 • సైబర్‌ సెక్టార్‌, దానికి సంబంధించిన కీలక సాంకేతికత ఇచ్చిపుచ్చకోవటం
 • గనులు, ఖనిజాల తవ్వకాల్లో పరస్పర సహకారం
 • మిలిటరీ టెక్నాలజీని ఇచ్చిపుచ్చుకోవటం
 • ఒకేషనల్‌ విద్యపై ద్వైపాక్షిక ఒప్పందం
 • జల వనరుల రక్షణలో పరస్పర సహకారం
 • ప్రపంచ వాణిజ్య సంస్థలో సంస్కరణలు చేపట్టాలని తీర్మానం


logo