మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 05, 2020 , 02:31:03

కొత్త ప్రాజెక్టుపై ముందుకు పోవద్దు

కొత్త ప్రాజెక్టుపై ముందుకు పోవద్దు

  • డీపీఆర్‌ సమర్పించి అనుమతి తీసుకోవాలి
  • ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసిన కృష్ణాబోర్డు 
  • 3 ప్రాజెక్టులకు తెలంగాణ డీపీఆర్‌లు ఇవ్వాలి
  • 34:66 దామాషాతో కృష్ణాజలాల పంపిణీ
  • తెలంగాణకు 37% కోరిన రజత్‌కుమార్‌
  • కృష్ణాబోర్డు భేటీలో వాడివేడిగా చర్చలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: శ్రీశైలం జలాశయంనుంచి భారీ ఎత్తున కృష్ణాజలాలను పెన్నా బేసిన్‌కు తరలించడానికి ఏపీ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు విస్తరణపై ఎంతమాత్రం ముందుకు పోవద్దని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు మరోసారి స్పష్టం చేసింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సమర్పించి, అనుమతులు తీసుకొన్న తర్వాతే ముందుకు పోవాలని సూచించింది. కేంద్ర జల్‌శక్తి ఆదేశానుసారం ఇప్పటికే లేఖ కూడా రాశామని గుర్తుచేసింది. దీంతో ఏపీ జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్‌దాస్‌, బోర్డు చైర్మన్‌ పరమేశం మధ్య వాడివేడిగా చర్చ జరిగినట్లు తెలిసింది. ఒక దశలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. 

ఏపీ సర్కార్‌ జారీచేసిన జీవో 203 పై తెలంగాణ ఫిర్యాదుచేసిన నేపథ్యంలో కేంద్ర జల్‌శక్తి ఆదేశానుసారం గురువారం కృష్ణాబోర్డు చైర్మన్‌ పరమేశం అధ్యక్షతన సమావేశం జరిగింది. జలసౌధలోని బోర్డు కార్యాలయంలో ఉదయం 12 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగింది. ప్రధానంగా రాయలసీమ ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు విస్తరణపైనే సుదీర్ఘంగా జరిగినట్టు తెలిసింది.  ప్రధానంగా పది అంశాలపై సమావేశంలో చర్చించగా.. రెండున్నర గంటలపాటు కొత్త ప్రాజెక్టులు, డీపీఆర్‌ల సమర్పణ అంశంపైనే వాదోపవాదోలు జరిగాయి. 

కేంద్రం నియమిస్తేనే ఇక్కడ ఉన్నాం

సమావేశం ప్రారంభం కాగానే బోర్డు చైర్మన్‌ పరమేశం ముందుగా కొత్త ప్రాజెక్టుల అంశాన్ని ఎజెండాగా పెట్టారు. తెలంగాణ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌ రాయలసీమ ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు విస్తరణపై ఏపీ జారీ చేసిన జీవో 203ను ప్రస్తావించారు. గత నెలలోనే ఏపీ సర్కార్‌ జీవో జారీచేసినందున ఇది కొత్త ప్రాజెక్టు అని స్పష్టంచేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని, ఏపీ చేపట్టనున్న కొత్త ప్రాజెక్టు వల్ల తమ ప్రాజెక్టులకు నీళ్లు రాకుండా నష్టం జరుగుతుందన్నారు. ఏపీలో కొత్త ప్రాజెక్టు వల్ల ఆ రాష్ర్టానికే చెందిన ముచ్చుమర్రి ప్రాజెక్టుకు కూడా నీళ్లు రావని తెలిపారు. బేసిన్‌లోని ఇతర రాష్ర్టాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరించడం మంచిది కాదని సూచించారు. ఈ క్రమంలో ఏపీ సర్కారు కొత్త ప్రాజెక్టును ఉపసంహరించుకోవాలని కోరారు. ఏపీ తరపున ఆదిత్యనాథ్‌దాస్‌ మాట్లాడుతూ శ్రీశైలం జలాశయం నుంచి నీటిమట్టాల స్థాయిలో పోతిరెడ్డిపాడు ద్వారా ఎన్ని నీళ్లు పోతాయనే వివరాలను పేర్కొన్నారు. 

ఈ క్రమంలో జోక్యం చేసుకున్న బోర్డు చైర్మన్‌ పరమేశం ఇప్పటికే తాము జీవో 203పై ముందుకుపోవద్దని ఏపీ జలవనరులశాఖకు లేఖ రాసినట్టు గుర్తుచేశారు. దీంతో తమది కొత్త ప్రాజెక్టు అని ఎలా సూత్రీకరిస్తారు? అసలు బోర్డుకు ఆ పరిధి ఉన్నదా? వరద జలాలపై రెండు రాష్ర్టాలు ప్రాజెక్టులు కట్టుకొంటున్నాయి కదా? అని ఆదిత్యనాథ్‌ దాస్‌ ఆవేశంగా ప్రశ్నించినట్లు సమాచారం. దీనిపై స్పందించిన పరమేశం.. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కృష్ణా బోర్డు ఏర్పాటైందని, కేంద్రం నియమిస్తేనే తాము ఇక్కడ ఉన్నామన్నారు. బోర్డు పరిధి ఇప్పుడు కాకపోతే రేపు వస్తుంది గానీ, ఒక రాష్ట్రం ఫిర్యాదు చేసినపుడు అడగకుండా ఎలా ఉంటామని అన్నట్టు తెలిసింది. తాము కేవలం డీపీఆర్‌ను అడుగుతున్నామని, ఇవ్వలేమని ఎలా చెప్తారన్నారు. బోర్డుకు డీపీఆర్‌ ఇచ్చి అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్‌ కొత్త ప్రాజెక్టు నిర్మించుకోవచ్చని చెప్పారు.  తాము ప్రభుత్వాన్ని సంప్రదించకుండా డీపీఆర్‌ ను ఇవ్వలేమని ఆదిత్యనాథ్‌  చైర్మన్‌కు తెలిపారు. 


ప్రధాని నోట పాలమూరు ప్రాజెక్టు

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పాతదేనని తెలంగాణ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌ ఆధారాలు చూపించారు. ప్రధాని మోదీ పాలమూరులో పర్యటించినప్పుడు తన ప్రసంగంలో ‘పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పదేండ్లుగా నానుతున్నదని, తాము అధికారంలోకి రాగానే ప్రాజెక్టు చేపడతామ’ని ప్రస్తావించిన వీడియోను సమావేశంలో ప్రదర్శించారు. దీంతో ఈ ప్రాజెక్టు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నదన్న విషయం స్పష్టమవుతుందని తెలిపారు. దీనిపై ఉమ్మడి రాష్ట్రంలో జారీచేసిన జీవోలను కూడా చూపారు. డిండి ఎత్తిపోతల పాతదేనని, ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీవోమేరకు నీటి లభ్యతకు సంబంధించి మార్పుచేశామని పేర్కొన్నారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల.. ఆర్డీఎస్‌లో అంతర్భాగమని, బచావత్‌ కేటాయించిన 15.9 టీఎంసీలను మాత్రమే తాము వాడుకుంటామన్నారు. 19 టీఎంసీల కేటాయింపు ఉన్న పోతిరెడ్డిపాడు ద్వారా 178 టీఎంసీలు వాడుకున్నట్టుగా తాము ఎక్కువ వాడుకోబోమని ఏపీ ఫిర్యాదుపై బదులిచ్చారు. ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లను బోర్డుకు ఇవ్వాలని చైర్మన్‌ పరమేశం సూచించడంతో ప్రభుత్వాన్ని సంప్రదిస్తామని రజత్‌కుమార్‌ చెప్పారు. 

గోదావరి మళ్లింపుపై కేంద్రానికి లేఖ

ఆంధ్రప్రదేశ్‌.. గోదావరిజలాలను కృష్ణాడెల్టాకు మళ్లించడం ద్వారా తెలంగాణకు దక్కాల్సిన వాటాపై వెంటనే తేల్చాలని రజత్‌కుమార్‌ కోరారు. దీనిపై నిర్ణయాన్ని త్వరగా తీసుకోవాలని కేంద్ర జల్‌శక్తికి లేఖరాస్తానని పరమేశం తెలిపారు. బచావత్‌ ఏడో క్లాజు ప్రకారం తాగునీటి కోసం వాడుకొంటున్న కృష్ణాజలాల్లో 20 శాతం మాత్రమే వినియోగ లెక్కల్లో జోడించాలన్న తెలంగాణ ప్రతిపాదనపైనా కేంద్రానికి లేఖ రాస్తామని చెప్పారు. బోర్డు కార్యాలయాన్ని విజయవాడకు తరలించాలని ఏపీ అధికారులు అడుగగా, బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ అమలులోకి వచ్చేవరకు ఇక్కడే కొనసాగించాలని తెలంగాణ కోరింది. శ్రీశైలం, సాగర్‌తోపాటు చాలా ప్రాజెక్టులకు హైదరాబాద్‌ కేంద్రంగా ఉంటుందని, రాకపోకలకు కూడా ఇబ్బంది ఉండదన్నారు. అయితే ఈ అంశాన్ని కూడా కేంద్ర జల్‌శక్తి దృష్టికి తీసుకుపోతామని బోర్డు చైర్మన్‌ తెలిపారు. మిగులుజలాలపై కేంద్రం నియమించిన కమిటీ గడువును జూన్‌ 30 వరకు పొడిగించినట్టుగా పరమేశం ప్రకటించారు. ఈ సమావేశానికి  రెండు రాష్ర్టాల ఈఎన్సీలు మురళీధర్‌రావు, నారాయణరెడ్డితోపాటు రెండు రాష్ర్టాల ఇంజినీర్లు హాజరయ్యారు. 

తెలంగాణకు 37 శాతం వాటా కావాలి

కృష్ణా జలాల పంపిణీపై కూడా సమావేశంలో చర్చించారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా తెలంగాణ 34 శాతం, ఏపీ 66 శాతం పంచుకోవడంపై ఏకాభిప్రాయం కుదిరింది. ఈ సీజన్‌లో వచ్చే వరద ఆధారంగా చేసుకోవాల్సిన పంపిణీపై మరోసారి సమావేశమై చర్చిద్దామని రెండు రాష్ర్టాల అధికారులు బోర్డుకు తెలియజేశారు. కాగా, పట్టిసీమ ద్వారా ఏపీ గోదావరి జలాల మళ్లింపు నేపథ్యంలో తమకు వాటా పెరుగాల్సి ఉన్నదని తెలంగాణ ముఖ్యకార్యదర్శి  రజత్‌కుమార్‌ స్పష్టంచేశారు. దీనిపై తుది నిర్ణయం జరిగేవరకు తెలంగాణ వాటాను 37 శాతానికి పెంచాలని, దీనికి ప్రాతిపదిక ఏమిటన్నదానిపై బోర్డుకు లేఖ రాస్తానన్నా రు. 

ఆ లేఖను పరిశీలించిన తర్వాత చర్చిద్దామని ఏపీ అధికారి ఆదిత్యనాథ్‌ దాస్‌ అన్నా రు. అదేవిధంగా 2019-20 నీటి సంవత్సరంలో తెలంగాణకు ఇంకా 48 టీఎంసీల కోటా మిగిలి ఉన్నందున దానిని ఈ సంవత్సరానికి క్యారీ ఓవర్‌ చేయాలని తెలంగాణ అధికారులు కోరారు. తదుపరి సమావేశంలో  ఈ అంశంపైనా చర్చిద్దామని నిర్ణయించారు. పోతిరెడ్డిపాడుపై టెలిమెట్రీ పరికరాన్ని త్వరగా ఏర్పాటుచేస్తే వివాదం ఉండదని రజత్‌కుమార్‌ బోర్డు చైర్మన్‌కు సూచించారు. కేసీ కెనాల్‌పైనా ఏర్పాటుచేయాలని తెలంగాణ ఈఎన్సీ కోరారు. టెలిమెట్రీల ఏర్పాటుకు తాము ఇవ్వాల్సిన రూ.2.80 కోట్లను వెంటనే ఇస్తామని తెలంగాణ అధికారులు చెప్పగా, తాము ఇవ్వాల్సిన రూ.2.50 కోట్లు కూడా ఇస్తామని ఏపీ తెలిపింది. 

నేడు గోదావరి బోర్డు భేటీ 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలతో శుక్రవారం గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం కానున్నది. బోర్డు చైర్మన్‌ అధ్యక్షతన జరిగే సమావేశంలో గోదావరి నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల డీపీఆర్‌లపైనే ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉన్నది. 


logo