భద్రాచలం/ యాదగిరిగుట్ట/ధర్మపురి/ వేములవాడ, డిసెంబర్ 30 : రాష్ట్రవ్యాప్తంగా ముక్కోటి (వైకుంఠ) ఏకాదశి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జామున 5 గంటలనుంచే స్వామివారు ఉత్తరద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. భద్రాచలక్షేత్రంలో గరుడవాహనరూఢుడైన శ్రీరామచంద్రుడు మహావిష్ణువు అలంకారంలో దర్శనమివ్వగా భక్తజనం పునీతులయ్యారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం, పాతగుట్ట క్షేత్రంలో స్వామివారు వైకుంఠనాథుడిగా ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి అనుబంధ భీమేశ్వరాలయంలో స్వా మివారిని దర్శించుకునేందుకు భక్తకోటి పోటెత్తింది. తిరుమల శ్రీవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జనవరి 8న రాత్రి 12 గంటల వరకు 10 రోజులపాటు ఈ దర్శనం కల్పిస్తున్నారు. జనవరి 2 నుంచి 8 వరకు ఎలాంటి టోకెన్లు లేకుండా వచ్చే భక్తులకు సర్వదర్శనం కల్పించనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి, ఏపీ మంత్రులు, మాజీ మంత్రులు, పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు.