హైదరాబాద్, ఫిబ్రవరి28 (నమస్తే తెలంగాణ): ‘కేరళ ఎన్నికల పన్ను’ కోసం ముఖ్యనేత, కీలక నేతలు ఏ అవకాశాన్నీ వదలడం లేదట. అతి తక్కువ సమయంలో కోట్లు కుమ్మరించే మార్గాలను అన్వేషిస్తున్న పెద్దల కన్ను తాజాగా భూములపై పడినట్టు సమాచారం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టిన సంగతి తెలిసిందే. వెయ్యికోట్ల వేటలో భాగంగా ఈ జాబితాను ముందేసుకొని గల్లాపెట్టె తెరిచినట్టు ప్రచారం జరుగుతున్నది. ప్రైవేట్ భూములపై నిషేధం ఎత్తివేయడం, ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్ భూముల రికార్డులను తారుమారు చేయడం, ముఖ్యంగా వివాదాస్పద 5 లక్షల ఎకరాలను సెటిల్ చేయడం ద్వారా రూ.500 కోట్ల నిధులు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చర్చ జరుగుతున్నది.
ఇందుకోసం భూ భారతి పోర్టల్‌లో డిజిటల్ రికార్డులు మారుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకోసం ఏకంగా ఒక సీనియర్ బ్యూరోక్రాట్‌ను ప్రత్యేకంగా నియమించినట్టు సచివాలయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో ఈడీ అటాచ్ చేసిన గాలి జనార్దన్‌రెడ్డికి చెందిన భూములను కూడా కాజేసే పని పెట్టుకున్నట్టు రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే రాష్ట్రంలోని నిషేధిత భూముల మీద కన్నేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం భారీ ఎత్తున భూములను 22ఏలో చేర్చినట్టు ప్రచారం జరుగుతున్నది. ఆ తర్వాత నిషేధిత జాబితాలో ఉన్న భూముల వివరాలను మండలాల నుంచి తెప్పించి నివేదిక సిద్ధం చేసినట్టు చెప్పుకొంటున్నారు.
ఇందులో ప్రభుత్వ భూములు, వివిధ శాఖల ఆధీనంలోని భూములు, అసైన్డ్ భూములు, అటవీ ప్రాంతాలు, కాందీశీకుల భూములు, నీటిపారుదల ప్రాజెక్టులకు కేటాయించిన భూములతోపాటు ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు అటాచ్ చేసిన ఆస్తులు కూడా ఉన్నట్టు రెవెన్యూ వర్గాలు వెల్లడించాయి. మొత్తంగా 93 లక్షల ఎకరాలకు పైగా భూములు నిషేధిత జాబితాలో ఉన్నట్టు చెప్తున్నాయి. ఇందులో దాదాపు 69 లక్షల ఎకరాల మేర పకాగా ప్రభుత్వ భూమి ఉండగా, మిగిలింది పట్టా, వివాదాస్పద భూములు ఉన్నాయని సమాచారం. ఈ భూముల మీదే ప్రభుత్వ పెద్దల దృష్టి పడిందని చెబుతున్నారు. 24 లక్షల ఎకరాల్లో దాదాపు 19 లక్షల ఎకరాలు రైతుల భూములనీ, వాటిని అడ్డగోలుగా నిషేధిత జాబితాలో చేర్చారని రెవెన్యూ శాఖ అంతర్గత విచారణలో తేలినట్టు సమాచారం. ఇవి పోగా మిగతా 5 లక్షల ఎకరాలను వివాదాస్పద భూములుగా గుర్తించినట్టు తెలిసింది. వీటిపైనే ముఖ్యనేత, నంబర్ 2 నేత కన్ను పడినట్టు సమాచారం.
నంబర్ 2 నేత ఒక సీనియర్ ఐఏఎస్ అధికారితో కలిసి నిషేధిత జాబితాలో మార్పులు చేర్పులు చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. నేరుగా యజమానులకు ఫోన్లు చేసి, బేరం మాట్లాడుకుంటున్నట్టు తెలిసింది. మహేశ్వరం మండలం నాగారం గ్రామంతోపాటు దాని సమీప గ్రామాల్లో గాలి జనార్దన్‌రెడ్డికి ఉన్న దాదాపు 65 ఎకరాల భూమిని ఓబుళాపురం మైనింగ్ కేసులో ఈడీ అటాచ్ చేసింది. ఈడీ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ భూమిని నిషేధిత జాబితాలో చేర్చింది. తాజాగా ఈ భూమిని ఆ జాబితా నుంచి తప్పించాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈడీ అటాచ్ చేసిన సర్వే నంబర్లకు బై నంబర్లు వేసి భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించే పనిని స్థానిక రెవెన్యూ అధికారులకు అప్పగించినట్టు సమాచారం.
బీఆర్ఎస్ ప్రభుత్వం గాలి జనార్దన్‌రెడ్డికి సంబంధించిన భూమి సర్వే నంబర్లను పక్కాగా సరి చూసుకొని, గ్రామసభల ద్వారా రైతుల అభిప్రాయాలు తీసుకొని, ఈడీ నంబర్లు సూచించిన నంబర్లను మాత్రమే 22ఏ రికార్డుల్లో పొందుపరిచారు. భూ భారతి అమల్లోకి వచ్చాక వివాదాస్పద భూమి ఉన్న సర్వే నంబర్‌ను నిషేధిత జాబితాలో పెట్టినట్టు సమాచారం. దీంతో జనార్దన్ భూములకు ఆనుకొని ఉన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వారి పేర్లు నిషేధిత జాబితాలో పడ్డాయని, సర్వే నంబర్లను తొలగించే నెపంతో గాలి జనార్దన్‌రెడ్డి భూములకు కూడా ఎసరు పెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది.
నగర శివారులోని కొన్ని దేవాదాయ, వక్ఫ్ భూములకు సంబంధించి నిషేధిత జాబితాలో సర్వే నంబర్ల విభజన లేదని సమాచారం. దీంతో కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి భూముల మీద దృష్టి పెట్టినట్టు తెలిసింది. ముఖ్యనేత, నంబర్ 2 నేత కలిసి వీటిని ప్రైవేట్ భూములుగా మారుస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే రంగారెడ్డి, మేడ్చల్, నల్లగొండ, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో 6 వేల ఎకరాల విలువైన భూముల రికార్డులు తారుమారు చేసి ప్రైవేట్ పట్టా భూములుగా మార్పిడి చేసినట్టు సమాచారం. రిజిస్ట్రేషన్ శాఖ వద్ద పూర్తిస్థాయి సమాచారం లేకపోవడంతో ఈ భూముల రిజిస్ట్రేషన్లు సులువుగా జరుగుతున్నట్టు చెప్తున్నారు. మొత్తంగా 5 లక్షల ఎకరాల ద్వారా రూ.500 కోట్లు పోగేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది.