ఏడు దశాబ్ధాల పాత జీహెచ్ఎంసీ చట్టం స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు- 2026 చుట్టూ వివాదాల మబ్బులు ముసురుకుంటున్నాయి. బిల్లులోని పలు నిబంధనలు సామాన్య అపార్ట్మెంట్ కొనుగోలుదారుల మెడకు ఉరితాడుగా మారనున్నాయని, బిల్డర్లు చేసే అక్రమాలకు అమాయక ప్లాట్ల యజమానులను బలిచేయడం అన్యాయమని తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. 271 పేజీలతో విడుదల చేసిన ఈ ముసాయిదాలో సామాన్య పౌరులను తీవ్రంగా ఇబ్బంది పెట్టే అనేక నిబంధనలు ఉన్నాయని ప్రజాసంఘాలు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
– సిటీబ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ): ముసాయిదాలో ఇప్పటివరకు ఉన్న విధానానికి భిన్నంగా భూమి/ఆస్తి మూలధన విలువ ప్రాతిపదికన ఆస్తిపన్ను విధించే ప్రతిపాదన చేశారు. దీనివల్ల పాత జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న నివాసాల ఆస్తి పన్నులు గణనీయంగా పెరిగే ముప్పు ఉందని అంచనా వేస్తున్నారు. ముందస్తు అనుమతి లేని నిర్మాణాలు లేదా అనుమతికి మించి కట్టిన భవనాలపై ప్రస్తుతం ఉన్న 100% జరిమానాను ఏకంగా 300 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. అనుమతి ఉన్న భవనాల్లో సెట్ బ్యాక్ ఉల్లంఘనలు 10% కంటే ఎకువ ఉంటే 50% జరిమానా, నివాస కేటగిరీ భవనాన్ని చిన్నపాటి వ్యాపారానికి ఉపయోగిస్తే 100% పెనాల్టీ విధించేలా కఠిన నిబంధనలు తీర్చిదిద్దారు. సొంత ఖాళీ స్థలాల్లో చెత్త పేరుకుపోతే ప్లాట్ మూలధన విలువలో 0.25% జరిమానా విధించే అధికారాన్ని బల్దియా అధికారులకు కట్టబెడుతున్నారు.
సవరణలకు డిమాండ్..
ఎన్నుకోబడిన కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధుల అధికారాలను తగ్గించి.. మొత్తం నిర్ణయాధికారాన్ని అధికారుల (బ్యూరోక్రసీ) హస్తగతం చేసేలా ఈ బిల్లు ఉంది. ఇది ప్రజాస్వామ్య వికేంద్రీకరణ స్ఫూర్తికే విరుద్ధమని పర్యావరణ పరిరక్షణ, పౌర సమాజ ప్రతినిధి డాక్టర్ దొంతి నర్సింహారెడ్డి ఆరోపించారు. అభివృద్ధి పేరిట పన్నుల బాదుడు, అధికారుల వేధింపులు పెంచే విధంగా ముసాయిదా రూపొందించారని పౌర సమాజం ఆరోపించింది. ఈనెల 24 వరకు ప్రభుత్వం చేపడుతున్న అభిప్రాయాల సేకరణ ప్రక్రియలో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. సామాన్యుడిపై అదనపు భారం పడకుండా బిల్లులోని వివాదాస్పద సెక్షన్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
బిల్లులోని సెక్షన్ 76, 78, 79 ప్రకారం ఆస్తి పన్నును మారెట్ విలువల ఆధారంగా లెకించి, ప్రతి ఏటా గరిష్టంగా 20 శాతం వరకు ఆటోమేటిక్‌గా పెంచేలా ప్రతిపాదించడాన్ని సైబర్ సిటీ రెయిన్ బో విస్టాస్ రాక్ గార్డెన్ రెసిడెన్షియల్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్‌కు క్లాజ్-వారీగా సమగ్ర వినతిపత్రాన్ని సమర్పించింది. నామమాత్రపు పౌర సదుపాయాలు కూడా కల్పించకుండా ఏటా 20 శాతం పన్ను పెంచడం మధ్యతరగతి కుటుంబాలపై మోయలేని భారం మోపడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Ghmc
బిల్డర్ తప్పు చేస్తే నివాసితులను ఇబ్బంది పెడతారా?
బిల్డర్లు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకోకపోవడం, లేదా ప్లాన్ ఉల్లంఘనలకు పాల్పడటం వంటి తప్పులు చేస్తే.. ఆ అపార్ట్మెంట్లలో నివాసముంటున్నవారిపై చర్యలు తీసుకోవడం దారుణమని అసోసియేషన్ ప్రతినిధులు వినతిపత్రంలో పేరొన్నారు. బిల్డర్ లోపాల వల్ల విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ కనెక్షన్లు నిలిపివేయడం సరికాదన్నారు. తప్పు చేసిన బిల్డర్లు, ప్లాన్ల నిర్మాణానికి తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇచ్చిన ఆరిటెక్ట్లు, ఇంజనీర్లపైనే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 24 గంటల ముందస్తు నోటీసుతో బిల్డింగ్‌లను సీల్ చేయడం కాకుండా కనీసం 30 రోజుల వ్యవధి ఇవ్వాలని కోరుతున్నారు.
నిపుణులు సూచిస్తున్న కీలక సవరణలు