గ్రేటర్ హైదరాబాద్‌లో లక్ష ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తామని ప్రకటిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర తీసింది. పేదల సొం తింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇస్తామని చెప్తూనే ఫ్లాట్లను కొనుగోలు చేయాలని చెప్తున్నది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ముందుగానే డబ్బులు చెల్లించిన వారికి ఫ్లాట్లు అమ్మే ప్రీలాంచ్ విధానాన్ని తలపించేలా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని మార్చేసింది.
సిటీ బ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ): ఎన్నికల సమయంలో నిరుపేదలు, ఇండ్లు లేనివారికి ఉచితంగా ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చింది. తాజాగా ముందుగానే రూ.6 లక్షలు చెల్లిస్తే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటూ చెప్పడం విస్మయానికి గురిచేస్తోంది. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) నిబంధనలు తుంగలో తొక్కుతూ ప్రీలాంచ్ తరహాలో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ప్రభుత్వం ప్రచారం కల్పిస్తున్నది. రెరా నిబంధనలకు విరుద్ధంగా ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకునేవారు రూ.10వేల టోకెన్ అమౌంట్ చెల్లించాలంటూ ప్రకటన విడుదల చేసింది.
ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ప్రీలాంచ్ ప్రాజెక్టును మార్కెట్లోకి విడుదల చేసినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటన ఉన్నది. ప్రభుత్వం నిరుపేదలకు ఇండ్లు కట్టించి ఇవ్వాలనుకుంటే రెరా నిబంధనల ప్రకారం పూర్తి ఉచితంగా ఇవ్వాలి. అలాంటి ఇండ్లకు ఎలాంటి హంగులు, ఆర్భాటాలు, ప్రచారాలు కల్పించకూడదు. మార్కెటింగ్, ప్రకటనలు, అడ్వాన్స్ బుకింగ్స్, అమ్మకాలు, లబ్ధిదారుల నుంచి ఎలాంటి లావాదేవీలు చేయకూడదు. కానీ అవన్నీ చేస్తే కమర్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు కిందకు వస్తుంది.
అదేవిధంగా గతంలో పేదలకు పంపిణీ చేసిన ఇండ్లు, భవన సముదాయా లు శిథిలావస్థకు చేరినప్పుడు కానీ వాటిని కూ ల్చాల్సి వస్తే వాటి స్థానంలో కొత్తవి నిర్మించవచ్చు. అవి కూడా ఎలాంటి మార్కెటింగ్, లబ్ధిదారుల నుంచి ఆర్థిక లావాదేవీలు జరపకుండా చేయాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం తలపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలోని నిబంధనలు రెరా రూల్స్‌కు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అప్లికేషన్ చేసుకునేవారు టోకెన్ అమౌంట్ చెల్లించాలనడం, దశలవారీగా రూ.6 లక్షలు చెల్లించాలని నిబంధనలు పెట్టడం రెరాను ఉల్లంఘించినట్లే అవుతుందని చెప్తున్నారు.
గ్రేటర్ వ్యాప్తంగా లక్ష ఇండ్లు నిర్మిస్తామని ప్రకటన..
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా లక్ష ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని ప్రభుత్వం మార్కెటింగ్, అడ్వైర్టెజ్‌మెంట్ ప్రారంభించింది. రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రీలాంచ్ ప్రాజెక్టును విడుదల చేసినట్లుగా ఒక బ్రోచర్ విడుదల చేసింది. బ్రోచర్లో ఇందిరమ్మ ఇండ్ల నమూనాలు అంటూ పెద్ద పెద్ద టవర్స్‌ను చూపారు. గ్రేటర్ వ్యాప్తంగా 17 ప్రాంతాల్లో నిర్మిస్తున్నామని లొకేషన్ల పేర్లు బ్రోచర్లో పేర్కొన్నారు. అచ్చం రియల్ ఎస్టేట్ సంస్థ బ్రోచర్లో ఉన్నట్లుగానే ఓఆర్ఆర్, మెట్రో రైలుకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లోనే ఇందిరమ్మ ఇండ్ల టవర్లను నిర్మిస్తున్నట్లు చూపడంతో ఆసక్తి ఉన్నవారు సంప్రదించేందుకు ఫోన్ నంబర్లను కూడా ఉంచారు.
ఇంటి నమూనాలు, ఫర్నీచర్‌తో పాటు ఈస్ట్, వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లలో డిజైన్ ఎలా ఉంటుందో చూపారు. మొత్తం 528 చదరపు గజాల్లో సింగిల్ బెడ్రూం ఇంటిని రూ.5 లక్షల ప్రభుత్వ సబ్సిడీతో అందించనున్నట్లు రియల్ ఎస్టేట్ సంస్థ మార్కెటింగ్‌కు ఏమాత్రం తగ్గకుండా బ్రోచర్ ఉన్నది. రూ.100 అప్లికేషన్ ఫీజు, రూ.10వేలు టోకెన్ అమౌంట్‌తో పాటు మూడు దశల్లో రూ.6 లక్షలు చెల్లించాలని బ్రోచర్లో చూపారు. ఇదంతా పూర్తిగా రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లాగే ఉండటంతో రెరా నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించినట్లు నిపుణులు చెప్తున్నారు. ప్రభుత్వం పేదలకు ఇండ్లను పంపిణీ చేసేందుకు టోకెన్ అమౌంట్‌తో పాటు మార్కెటింగ్ చేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.
ఉచితంగా ఇండ్లివ్వాలి
కంటోన్మెంట్, జూలై 21: అసెంబ్లీ ఎన్నికల సమయంలో అర్హులైన ప్రతీ కుటుంబానికి ఉచితంగా ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం లబ్ధిదారుల నుంచి ఒక్కో ఇంటికి రూ.6 లక్షలు చెల్లించాలని, దరఖాస్తు ప్రక్రియలో రూ.10వేలు కట్టాలని ప్రకటించడం సిగ్గుచేటని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ విమర్శించారు. మంగళవారం రసూల్‌పురాలో ఇందిరమ్మ నగర్లో.. ప్రభుత్వం అందించే ఇందిరమ్మ ఇళ్లను ఉచితంగా కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోస్టర్లను గోడలకు అంటించారు. ఉచిత ఇందిరమ్మ ఇళ్ల పథకం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఇచ్చిన హామీలకు విరుద్దంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్, శ్రీనివాస్ కిరణ్, గంగారాం, రఘు మోని, యాసీన్, త్రివేద్, సాయికుమార్, సాయి ప్రశాంత్. రిషి, అబ్బు, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.