హనుమకొండ, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానిక యువతకే 80% ఉద్యోగ అవకాశాలు కల్పించాలని బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉప నాయకుడు హరీశ్‌రావు డిమాం డ్ చేశారు. ‘మా ఉద్యోగాలు మాకే కావాలనే బలమైన నినాదంతోనే నాడు కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారు. అదే స్ఫూర్తితో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగాల కోసం పోరాడుతాం’ అని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ పోరాటంతోనే కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందని, స్థానికులకు ఉద్యోగాలివ్వకుండా బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని విమర్శించారు. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో శనివారం కాజీపేటలో నిర్వహించిన ‘కొలువుల కోసం కొట్లాట’ కార్యక్రమంలో హరీశ్ ప్రసంగించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వల్లే కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని, ఇకడ పరిశ్రమలు రావాలని, ముఖ్యంగా స్థానికులకు ఉ పాధి ఉద్యోగాలు దక్కాలని కోరుకున్నామని, ఈ రోజు ఫ్యాక్టరీ వచ్చినా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా బీజేపీ అన్యాయం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం దేవాదాయ శాఖకు చెందిన 150 ఎకరాల భూములను హైకోర్టు నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకొని కోచ్ ఫ్యాక్టరీ కోసం ఇచ్చిందని గుర్తుచేశారు. కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం అప్పటి బీఆర్ఎస్ ఎంపీ లు రైల్వే మంత్రికి పలుమార్లు విన్నవించారని, పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారని తెలిపారు.
‘కోచ్ ఫ్యాక్టరీ అడిగితే బీజేపీ ప్రభుత్వం వ్యాగన్ ఫ్యాక్టరీ పెడుతామన్నది. అసలు ఇప్పుడు ఇకడ కడుతున్నది వ్యాగన్ ఫ్యాక్టరీనా? లేక కోచ్ ఫ్యాక్టరీనా? అనేది స్పష్టత లేదు. దీనిపై కేంద్రం ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. మహారాష్ట్రలోని లాతూర్ వ్యాగన్ ఫ్యాక్టరీలో 70% స్థానికులకే రిజర్వేషన్లు ఇచ్చారని, తెలంగాణలో కాజీపేట యువతకు ఆ రిజర్వేషన్లు ఎందుకు కల్పించడం లేదని ప్ర శ్నించారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎంపీలు స్థానికుల ఉద్యోగాల గురించి మాట్లాడకుండా ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు వచ్చి ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం చేస్తామని అంటున్నారని, భూము లు ఇచ్చిన నిర్వాసితులు, స్థానికులకు రిజర్వేషన్లు కల్పించకుండా ప్రారంభోత్సవానికి వస్తే ఎకడికకడ అడ్డుకుంటామని హెచ్చరించారు.
మా ఉద్యోగాలు మాకే కావాలి అన్న బలమైన నినాదంతోనే కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారు. రాష్ట్రంలోని యువతకు 95 శాతం ఉద్యోగావకాశాలు కల్పించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు దకేలా రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చిన ఘనత కేసీఆర్‌దే. తెలంగాణ ఏర్పాటు, బీఆర్ఎస్ పోరాటం వల్లే కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది. ఫ్యాక్టరీ వచ్చినా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా బీజేపీ అన్యాయం చేస్తున్నది.
-హరీశ్‌రావు
మహారాష్ట్రలోని లాతూర్ వ్యాగన్ ఫ్యాక్టరీలో 70 శాతం స్థానికులకే రిజర్వేషన్లు ఇచ్చిండ్రు. తెలంగాణలో మన కాజీపేట యువతకు ఎందుకు ఆ రిజర్వేషన్లు కల్పించడం లేదు? మహారాష్ట్రకు ఒక చట్టం, తెలంగాణకు మరో చట్టం ఉంటుందా? రాష్ట్ర ప్రజలు బీజేపీకి 8 మంది, కాంగ్రెస్‌కు 8 మంది ఎంపీలను గెలిపిస్తే వాళ్లు తెలంగాణకు చేస్తున్న నిర్వాకం ఇదేనా?
-హరీశ్‌రావు
కాజీపేట రైల్వే ప్రాజెక్టుల విషయాన్ని సీఎం రేవంత్ పట్టించుకోవడంలేదని హరీశ్ విమర్శించారు. తెలంగాణ యువతకు ఉద్యోగాల కల్పనపై రేవంత్ కేంద్రంలోని బీజేపీ సర్కార్ ను ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. రేవంత్ చేస్తున్న అవినీతి బయటికి వస్తుందనే భయంతోనే మౌనంగా ఉంటున్నారా? అని నిలదీశారు. ‘ఒకప్పుడు దేశంలోనే ప్రసిద్ధిగాంచిన కాజీపేట జంక్షన్ ప్రాధాన్యత రోజురోజుకూ తగ్గిపోతున్నది. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్టణానికి రైల్వే జోన్ ఇచ్చినట్టుగానే కాజీపేటను రైల్వే జోన్‌గా ప్రకటించాలి’ అని డి మాండ్ చేశారు. ‘ప్రధానిని, తనను బడే భాయ్, చోటే భాయ్ అనుకునే రేవంత్ కాజీపేట జంక్షన్‌ను రైల్వే జోన్‌గా మార్చేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదు? బడే భాయ్., చోటే భాయ్ అని బాగా మాట్లాడుతవ్ కదా? మరి ఎందుకు ప్రధాని అంటే భయపడుతున్నవ్? ఆర్ఆర్ ట్యాక్స్ బయటకు వస్తుందనా? నువ్వు చేసిన అవినీతి బయటకు వస్తుందనా?’అని నిప్పులు చెరిగారు. ‘ఢిల్లీలో రైల్వే మంత్రిని కలుస్తున్నావు కదా? స్థానికులకు ఉద్యోగాలివ్వాలని ఎందుకు అడగడం లేదు?’ అని ప్రశ్నించారు.
కాజీపేట రైల్వే ప్రాజెక్టుల విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసలు పట్టించుకుంటలేడు. తెలంగాణలోని యువతకు ఉద్యోగాల కల్పనపై రేవంత్‌రెడ్డి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎందుకు అడగడం లేదో చెప్పాలి. రేవంత్‌రెడ్డి చేస్తున్న అవినీతి బయటికి వస్తుందన్న భయంతోనే మౌనంగా ఉంటున్నారా?
-హరీశ్‌రావు
కాజీపేటలో స్థానికులకు ఉద్యోగాల కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని హరీ శ్ స్పష్టంచేశారు. ఈ అంశంపై రాజ్యసభలో బీజేపీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని చె ప్పారు. అవసరమైతే వినయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్లి రైల్వే మంత్రిని కలిసి స్థానికులకే ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం ఇస్తామని తెలిపారు. స్థానిక యువతకు ఉద్యోగాల సాధన కోసం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టిన వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాసర్ను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని చెప్పారు.
ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని చెప్పి రేవంత్ హామీ ఇచ్చి మోసం చేశారని, ఇప్పటి వరకు 12 పైసలు కూడా ఇవ్వలేదని హరీశ్ మండిపడ్డారు. రేవంత్ వల్ల ఆటోడ్రైవర్ల బతుకులు రోడ్డున పడ్డాయని వాపోయారు. మహాధర్నాలో శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రు లు ఎర్రబెల్లి దయాకర్‌రావు, తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, అరూరి రమేశ్, బానోత్ శంకర్‌నాయక్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, కోచ్ ఫ్యాక్టరీ భూ నిర్వాసితులు, ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు.

సామాజిక ఉద్యమకారుడు, మా ఇల్లు ఆశ్రమ వ్యవస్థాపకుడు గాదె ఇన్నయ్య తండ్రి సాల్మన్‌రెడ్డి (97) శనివారం ఉదయం మరణించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం సాగరంలోని ఆయన నివాసానికి చేరుకుని సాల్మన్‌రెడ్డి భౌతికకాయంపై పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. ఇన్నయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.
-జఫర్‌గఢ్