బూర్గంపహాడ్, జూలై 30 : సనాతన హిందూ ధర్మ పరిరక్షణ, గోసంరక్షణ, జంతు సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారంలో సేవలందిస్తున్న సామాజిక సేవకుడు టి.గోవిందరెడ్డి జంతు పరిరక్షణ సంస్థ జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. గోవిందరెడ్డి ఆలయాల పరిరక్షణ, హిందూ ధర్మ ప్రచారం, నూతన ఆలయాల నిర్మాణానికి సహకారం, గ్రామాల్లో హనుమాన్ చాలీసా పారాయణాలు, హోమాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలతో పాటు గోవుల అక్రమ రవాణాను అడ్డుకుని వాటిని గోశాలలకు తరలించడం, అనారోగ్యంతో ఉన్న గోవులు, ఇతర జంతువులకు వైద్య సహాయం అందించడం వంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సేవలను గుర్తించిన సదరు సంస్థ తొలుత జిల్లా, అనంతరం రాష్ట్ర స్థాయిలో బాధ్యతలు అప్పగించి, తాజాగా జాతీయ అధ్యక్షుడిగా నియమించింది. ఈ సందర్భంగా గోవిందరెడ్డి మాట్లాడుతూ సంస్థ తనపై ఉంచిన విశ్వాసానికి అనుగుణంగా మరింత బాధ్యతాయుతంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని తెలిపారు.