Prabhas | టాలీవుడ్లో స్టార్ హీరోలకు అభిమానులు మాత్రమే కాదు.. వీరాభిమానులు కూడా ఉంటారు. తమ అభిమాన హీరోల సినిమాల కోసం కొందరు చేసే పనులు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా ప్రభాస్ అభిమాని చెప్పిన ఓ ఆసక్తికరమైన సంఘటన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన అభిమాన హీరో సినిమా టికెట్ దొరకలేదనే కారణంతో ఓ థియేటర్‌ను కొనుగోలు చేసినట్లు ఆయన చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. అనకాపల్లికి చెందిన వ్యాపారవేత్త కాండ్రేగుల నాయుడు ప్రస్తుతం నిర్మాతగా మారారు. ఆయన నిర్మించిన ‘అనకాపల్లి’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన తనకు ప్రభాస్‌పై ఉన్న అభిమానాన్ని, గతంలో జరిగిన ఓ సంఘటనను గుర్తుచేసుకున్నారు.
తాను మొదటి నుంచి ప్రభాస్ అభిమానినని, ప్రభాస్ సినిమా వస్తే కుటుంబం మొత్తం కలిసి థియేటర్‌కు వెళ్తామని నాయుడు తెలిపారు. ఈ క్రమంలో ప్రభాస్ నటించిన ‘మిర్చి’ సినిమా విడుదలైన సమయంలో తన కుటుంబంతో కలిసి సినిమా చూడటానికి వెళ్లినట్లు చెప్పారు. అయితే అప్పటికే థియేటర్ పూర్తిగా నిండిపోవడంతో టికెట్లు దొరకలేదని తెలిపారు.టికెట్ల కోసం థియేటర్ వద్ద చాలాసేపు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని నాయుడు వెల్లడించారు. మధ్యాహ్నం మొత్తం అక్కడే నిలబడి టికెట్ల కోసం రిక్వెస్ట్ చేసినా టికెట్లు లభించలేదని చెప్పారు. ఆ సమయంలోనే తనలో ఓ పట్టుదల ఏర్పడిందని.. ఎప్పటికైనా ఆ థియేటర్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.
తర్వాత అనుకున్నట్లుగానే అనకాపల్లిలోని వెంకటేశ్వర థియేటర్‌ను తాను కొనుగోలు చేసినట్లు నాయుడు చెప్పారు. ఇప్పుడు తాను నిర్మించిన ‘అనకాపల్లి’ సినిమాను అదే థియేటర్లో విడుదల చేస్తున్నానని వెల్లడించారు. ప్రభాస్ సినిమా టికెట్ దొరకకపోవడంతో మొదలైన ఓ ఆలోచన చివరకు థియేటర్ కొనుగోలు చేసే వరకు వెళ్లిందని నాయుడు చెప్పిన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన చెప్పిన ఈ కథ విన్న ప్రభాస్ అభిమానులు తమ అభిమాన హీరోపై ఇలాంటి అభిమానం కూడా ఉంటుందా అంటూ ఆసక్తిగా స్పందిస్తున్నారు.