మెదక్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ నాయకులపై పోలీసుల కుట్రలు కొనసాగుతున్నాయి. అధికార పార్టీ ఒత్తిడి మేరకు కేసులు తిరగదోడి అరెస్టుల పర్వాన్ని సాగిస్తున్నారు. తాజాగా మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్‌ను శనివారం ఉదయం అరెస్టు చేయడం స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేశారని, ఎమ్మెల్యే వాహనంపై దాడిచేసి హత్యకు యత్నించారని మల్లికార్జున్గౌడ్తోపాటు పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టి సంగారెడ్డి జైలుకు తరలించారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో మెదక్ పట్టణ పోలీసులు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి ఇటీవల అరెస్ట్ చేశారు.
పోలీసులు విచారణ చేయకుండానే అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారని శుక్రవారం మెదక్‌కు వచ్చిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు దళిత సంఘాల నాయకులు, బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఎస్సీ,ఎస్టీ కేసులో అరస్టై బెయిల్‌పై వచ్చిన మల్లికార్జున్ గౌడ్‌ను మెదక్ పోలీసులు శనివారం మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలోని నవాబుపేటలో ఉన్న మల్లికార్జున్ గౌడ్ నివాసానికి శనివారం ఉదయాన్నే పట్టణ సీఐ మహేశ్ 20 మంది పోలీసులతో వచ్చారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారని మల్లికార్జున్ సతీమణి గాయత్రి ఆరోపించారు. రాజకీయ కక్షతోనే టౌన్ పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేసి తన భర్తను అరెస్టు చేశారని, దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు.
హైకోర్టు స్టే ఉన్నా పోలీసులు అక్రమ కేసులు నమోదు చేసి తెల్లవారుజామున ఇంట్లోకి చొచ్చుకు వచ్చారని, మహిళా సిబ్బంది లేకుండా తనను, తన కూతురు, అత్తను నెట్టేసి, ఇంట్లోని ప్రతి రూమ్‌నూ సోదాచేసి అరెస్టు చేశారని గాయత్రి పేర్కొన్నారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారని సీఐని ప్రశ్నిస్తే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, బెదిరించారని ఆవేదన వ్యక్తంచేశారు. తమను ఇబ్బందులకు గురిచేసిన సీఐపై చర్యలు తీసుకోవాలని కోరారు. సీఐ తీరుపై మల్లికార్జున్‌గౌడ్ కుటుంబీకులు శనివారం మెదక్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు.
మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్గౌడ్పై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం దారుణమని మాజీ మంత్రి హరీశ్‌రావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. హైకోర్టు స్టే ఇచ్చినా మల్లికార్జున్గౌడ్పై ఉద్దేశపూర్వకంగా మరో కొత్త కేసు నమోదు చేసి అరెస్టు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. మెదక్‌లో పోలీసులు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై రోజుకో కేసు నమోదు చేసి ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని విమర్శించారు.