హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : అల్పపీడన ద్రోణితో రాష్ట్రంలో గడిచిన మూడ్రోజులు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. దక్షిణ కర్ణాటక నుంచి మహారాష్ట్రలోని మరఠ్వాడా వరకు వ్యాపించి ఉన్న ద్రోణి వాయవ్య దిశగా కదులుతున్నది. దీని ప్రభావంతో శుక్రవారం సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ చిరుజల్లులు పడినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శనివారం నుంచి వాతావరణం సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని, దీంతో ఎండలతోపాటు ఉక్కపోతలు భారీగా పెరుగుతాయని పేర్కొన్నది.
రాష్ట్రంలో సాధారణం కంటే 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నట్టు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం సగటున గరిష్ఠంగా 33.3 డిగ్రీలు, కనిష్ఠంగా 21 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు తెలిపారు. శుక్రవారం ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు చేరుకున్నాయని, ఆదివారం నుంచి ఎండలు మండిపోతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మెదక్, మహబూబ్నగర్, రామగుండంలో 34 డిగ్రీలు, హనుమకొండలో 33.5, హైదరాబాద్లో 33.3, నల్లగొండలో 31 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, శనివారానికి గరిష్ఠంగా 37 డిగ్రీలకు చేరే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్లో దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు దాటినట్టు తెలిపారు.