ఖమ్మం రూరల్, ఆగస్టు 13 : ఇటీవల మరణించిన తమ మనుమడి జ్ఞాపకార్థం తాత- నానమ్మలు పాఠశాలకు వంటగది నిర్మాణం చేపట్టి అందజేసిన సంఘటన గురువారం ఖమ్మం రూరల్ మండలంలో చోటుచేసుకుంది. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎం.వెంకటాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ.70 వేల వ్యయంతో వంట గదిని నిర్మించి వితరణగా అందించారు. గ్రామ మాజీ సర్పంచ్ గుర్రం అచ్చయ్య–ధనమ్మ మనవడు యడ్లపల్లి సందీప్ ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందాడు. అతడి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు పాఠశాలకు వంటగదిని నిర్మించి అందించారు. మాజీ సర్పంచ్ గుర్రం అచ్చయ్య మాట్లాడుతూ.. సందీప్ జ్ఞాపకార్థం విద్యార్థులకు ఉపయోగపడే సేవా కార్యక్రమం చేపట్టడం సంతృప్తినిచ్చిందన్నారు. ప్రతి నెల విద్యార్థులకు వివిధ రకాల అంశాలపై వ్యాసరచన, ఉపన్యాసం, క్వీజ్ మొదలగు పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు రూ.1,500 అందించడం జరుగుతుందన్నారు.
ప్రధానోపాధ్యాయుడు జి. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఇదే పాఠశాలలో పనిచేసి పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయురాలు కృపాభాయి విద్యార్థుల భోజన సౌకర్యం కోసం రూ.25 వేల విలువైన బల్లాలను అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వేగినాటి విజయ్‌కుమార్, ఉప సర్పంచ్ కొళ్లపూడి సుమతి, మందపల్లి నాగమణి, యడ్లపల్లి వెంకటరామయ్య, నండ్ర ప్రసాద్, బందెల వెంకయ్య, ఏఏపీసీ చైర్మన్ రెంటాల భాగ్యమ్మ, మందటి వెంకటరమణ, కుర్ర వెంకన్న,శీలం శ్రీనివాస్, రెంటాల నాగేశ్వరరావు, వార్డు సభ్యులు గుమ్మడి వీరబాబు, రెంటాల శివ, తోకల వెంకన్న, బేతంపూడి నాగరాజు, గుర్రం రమేష్, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

మనుమడి జ్ఞాపకార్ధం పాఠశాలకు వంటగది నిర్మాణం