హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో లంచాలకు రుచి మరిగిన కొందరు ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్లు వాటి కోసం ఎంతకైనా తెగిస్తున్నట్టు ఆరోపణలొస్తున్నాయి.. ప్రైవేట్ ప్రాజెక్ట్‌లే కాకుండా.. ప్రభుత్వ ప్రాజెక్ట్‌లకు సైతం లంచాలు డిమాండ్ చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అడిగినంత లంచం ఇవ్వలేదన్న సాకుతో ఏకంగా ఓ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు ఇంతవరకు ఎన్వోసీ జారీచేయలేదని తెలిసింది. ఎన్వోసీ ఇచ్చేందుకు రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. సీఈఐజీకి చెల్లించే అధికారిక ఫీజు రూ.5,100 మాత్రమే. కానీ అనధికారిక చెల్లింపులు రెండు నుంచి పది లక్షలు దాటుతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు.
ఉమ్మడి నిజామామాద్ జిల్లాలో ఓ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయ్యింది. కొంతకాలం క్రితం సీఎం రేవంత్‌రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లపై సమీక్ష సందర్భంగా ఈ ఎత్తిపోతల పథకానికి విద్యుత్తు కనెక్షన్ జారీకాలేదన్న విషయం వెలుగులోకి వచ్చింది. సీఈఐజీ అధికారులు ఎన్వోసీ జారీచేయలేదని తేలింది. దీంతో పంపుల టెస్ట్న్,్ర డ్రైరన్‌లు సాధ్యంకాలేదు. దీనిపై అధికారులు, కాంట్రాక్టర్ ఉన్నతాధికారులకు విన్నవించినట్టు తెలిసింది. ఎట్టకేలకు సీఈఐజీ అధికారులు, మధ్యవర్తుల ద్వారా రూ.10 లక్షలు డిమాండ్ చేశారని, చివరికి రూ.5 లక్షలకు ఒప్పందం కుదరిందని సమాచారం.
రాష్ట్రంలో బహుళ అంతస్తుల భవనాలు, ఐటీ కంపెనీలు, భారీ, చిన్న పరిశ్రమలు, థియేటర్లు, షాపింగ్ మాల్స్, స్టోన్‌క్రషర్లు వంటివాటికి విద్యుత్తు కనెక్షన్ ఇచ్చే ముందు సీఈఐజీ అనుమతులు తప్పనిసరి. అప్పుడే డిస్కం అధికారులు విద్యుత్తు కనెక్షన్ ఇస్తారు. ఒక్కో ఎన్వోసీకి రూ.2- రూ.3 లక్షలు డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది. నిబంధనల మేరకు 11 రోజుల్లో తనిఖీలు పూర్తిచేయాలి. కానీ నెలల తరబడి పెండింగ్‌లో పెడుతున్నారు. సీఈఐజీ పీరియాడికల్స్ ఇన్స్పెక్షన్ పేరిట భారీ దందా నడుస్తున్నది. ఇప్పటికే ఎన్వోసీ జారీచేసిన సంస్థలు, కంపెనీల్లో తనిఖీలు చేసి, భయభ్రాంతులకు గురిచేసి, అందినకాడికి పుచ్చుకుంటున్న ఉదంతాలున్నాయి.