హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీలో మళ్లీ సమ్మె సైరన్ మోగబోతున్నది. ఆర్టీసీ కార్మిక సంఘాలు 13న జేఏసీ ఆధ్వర్యంలో సమ్మెకు వెళ్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇటీవల చేపట్టిన ‘చలో సెక్రటేరియట్’లో ఈ అంశాన్ని వెల్లడించిన కార్మిక సంఘాల నేత లు తమ డిమాండ్లపై ప్రభుత్వ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సమ్మె ద్వారానే హక్కు లు సాధించుకోవాలని నిర్ణయించుకున్నట్టు స మాచారం. దీనిలో భాగంగా ఆర్టీసీ కార్మిక సం ఘాల జేఏసీ నేతలు, ప్రతినిధులు ఈ నెల 2న మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌లోని ఎంప్లాయీస్ యూనియన్ కేంద్ర కార్యాలయం లో అత్యవసరంగా సమావేశం కాబోతున్నట్టు తెలిపారు. ఈ మీటింగ్‌కు ప్రతినిధులంతా సకాలంలో హాజరుకావాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన హామీలు రెండేండ్లు గడిచినా అమలుకాకపోవడం, కనీసం ఆ పార్టీ మ్యానిఫెస్టోలో చెప్పిన అంశాలను కూడా పట్టించుకోకపోవడంపై ఆర్టీసీ కార్మికులంతా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి ‘అపాయింటెడ్ డే’ను ప్రకటించకపోవడంతో తాడోపేడో తేల్చుకోవాలని నిశ్చయించుకున్నారు. అందులో భాగంగా చేపట్టిన ‘చలో సెక్రటేరియట్’ విజయవంతం కావడంతో ఇదే ఊపులో ఇప్పుడు సమ్మె సైరన్ మోగించాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నిర్ణయించినట్టు తెలిసింది.
నిరుడు మే నెలలో చేపట్టిన సమ్మెను ప్రభుత్వం, ఆర్టీసీ ఉన్నతాధికారులు పథకం ప్రకారం నిర్వీర్యం చేశారు. దీంతో ఈసారి అలా జరుగకుండా పక్కా ప్రణాళికతో అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని సమ్మెను విజయవంతం చేయాలని జేఏసీ పట్టుదలతో ఉన్నట్టు తెలిసింది.
శక్కర్‌నగర్, ఫిబ్రవరి 28: నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని ఆర్టీసీ డిపో వద్ద శనివారం ఉదయం ఓ ఉద్యోగి ఆత్మహత్యకు యత్నించాడు. విషయం బయటకు పొక్కకుండా అధికారులు ప్రయత్నించినా, అప్పటికే వైరల్ అయ్యింది. సదరు ఉద్యోగికి రోజు మాదిరిగానే డ్యూటీ కేటాయించగా, తాను ఆ డ్యూటీకి వెళ్లనని, అధికారులు ఇష్టారాజ్యంగా విధులు కేటాయిస్తున్నారని ఆరోపిస్తూ, ఓ తాడుతో డిపో గేట్ ఎక్కి ఆత్మహత్యకు పాల్పడుతుండగా అక్కడే విధుల్లో ఉన్న కొందరు అతడి ప్రయత్నాన్ని అడ్డుకుని, సముదాయించి పంపించారు. ఉద్యోగి ఆత్మహత్యాయత్నంపై డిపో మేనేజర్ విశ్వనాథ్‌ను వివరణ కోరగా.. తొలుత తమ డిపోలో ఇలాంటి ఘటన జరగలేదని చెప్పారు.