బోనకల్లు, ఆగస్టు 14 : పంట భూములకు చుక్కనీరు అందించలేని జాలిముడి కాల్వకు రూ.5 కోట్లతో మరమ్మతులు చేపట్టడం ఏమిటని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు ధ్వజమెత్తారు. జాలిముడి ప్రాజెక్టు కాల్వను రాయన్నపేట, ఆళ్లపాడు గ్రామాలకు చెందిన రైతులు పరుచూరి అప్పారావు, పరుచూరి శ్రీనివాసరావు, కొరంపల్లి హనుమంతరావు, కందుల వెంకటేశ్వర్లు, బొమ్మినేని వెంకటేశ్వర్లు, పిట్టల కృష్ణతో కలిసి శుక్రవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బోనకల్లు, మధిర మండలాల్లో 4,700 ఎకరాలకు సాగునీరు అందిస్తామంటూ ఆనాడు నిర్మించిన జాలిముడి ప్రాజెక్టు కాల్వ కేవలం నిధులు కొల్లగొట్టడానికే ఉపయోగపడిందని ఆరోపించారు.
70 నుంచి 80 అడుగుల లోతులో కాలువ ఉంటే.. దాని పైన పొలాలు ఉన్నాయని, గ్రావిటీ ద్వారా నీరు ఎకడైనా పైకి పారుతుందా? 2012లో శంకుస్థాపన చేసి 2013లో ప్రారంభించిన ఈ కాల్వ ద్వారా ఇప్పటివరకు ఒక ఎకరానికైనా నీరందిందా అని ఆయన ప్రశ్నించారు. కాల్వల మరమ్మతు అంటూ స్థానిక నాయకులు, కాంట్రాక్టర్లకు బంగారు బాతులా మారిందని, ఈ ఏడాది కూడా నీళ్లు రాని కాల్వ మరమ్మతు కోసం రూ.5 కోట్లు మంజూరు చేయడం నిధుల దుర్వినియోగానికి నిదర్శనమని విమర్శించారు. 2012-13లో కాల్వ నిర్మాణ సమయంలో భూములు కోల్పోయిన రైతులు పరిహారం కోసం కోర్టును ఆశ్రయిస్తే.. అనుకూలమైన పరిహారం అందించాలని 2023 అక్టోబర్ 6న హైకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు.
డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార బాధ్యతలు చేపట్టి 31 నెలలు అవుతున్నా, రైతులు పలుమార్లు వినతులు సమర్పించినా రూపాయి పరిహారం ఇవ్వకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. భూములు కోల్పోయిన రైతులకు పూర్తి పరిహారం చెల్లించేంతవరకు కాలువ మరమ్మతు పనులను జరగనిచ్చేది లేదని, బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నిలిచి పోరాడుతుందని స్పష్టం చేశారు. మధిర ఏఎంసీ మాజీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, బీఆర్ఎస్ నాయకులు జంగా రవి, వేమూరి ప్రసాద్, మోదుగుల నాగేశ్వరరావు, పారా ప్రసాద్, బంధం నాగేశ్వరరావు, కాకాని శ్రీనివాసరావు, గద్దల వెంకటేశ్వర్లు, వల్లెబోయిన కొండలరావు, తెల్లబోయిన నాగేశ్వరరావు, ఇటికాల శ్రీనివాసరావు, రెడ్డిబోయిన వద్దండు, ఎనమద్ది శ్రీనివాసరావు, కృష్ణారావు, వెంగళ కనకయ్య, కిన్నెర పాపారావు, నరేశ్, నాగరాజు, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.