న్యూఢిల్లీ : భారత దేశపు అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన బాహుబలి ఎల్వీఎం3-ఎం5 రాకెట్‌కు ఉపయోగించిన సీ25 ఎగువ దశ దాదాపు తొమ్మిది నెలల తర్వాత భూమి వాతావరణంలోకి సురక్షితంగా తిరిగి ప్రవేశించింది. ఈ ఏడాది జూలై 30న వాతావరణంలోకి తిరిగి ప్రవేశించినట్టు ఇస్రో తెలిపింది. సీఎంఎస్-03 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఈ రాకెట్ ద్వారా గత ఏడాది నవంబర్ 2న శ్రీహరికోట నుంచి ప్రయోగించి నిర్దేశిత జియోస్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ (జీటీవో)లో విజయవంతంగా ప్రవేశపెట్టారు.
అయితే ఉపగ్రహాన్ని నిర్దేశిత ప్రదేశంలో ఉంచిన తర్వాత పై భాగం సీ25కు ఎలాంటి క్రియాశీలక పాత్ర లేదు. దీంతో దానిని వెనక్కి రప్పించే ప్రక్రియను ఇస్రో చేపట్టింది. ఆ రాకెట్ అట్లాంటా సముద్రంలో పడుతుందని భావిస్తూ, అది తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించే సమయాన్ని జూలై 30న సాయంత్రం 5.38 గంటలుగా అంచనా వేసింది. సాధారణంగా రాకెట్ దశ తన పని పూర్తి చేసిన వెంటనే భూమిపై పడిపోవాల్సిన అవసరం లేదు. దాని కక్ష్య, ప్రయోగ సమయం తదితర అంశాల ఆధారంగా అది నెలలు, సంవత్సరాలు, కొన్ని సార్లు దశాబ్దాల పాటు అంతరిక్షంలో ఉండిపోగలదు.