గతంలో స్కూల్ డ్రెస్‌లు ఇస్తే.. మూడు రోజులకే గుండీలు ఊసిపోతున్నయ్. కుట్లు పోతున్నయ్. తొడుక్కోవడానికి పనికి రాకుండా అయితున్నాయని నాకు చెప్తున్నరు. అందుకే క్వాలిటీ ఉన్న బట్టలు, షూలు, సాక్సులు, దుప్పట్లు, టవల్స్తోపాటు అద్భుతమైన నాణ్యతతో 9 రకాల వస్తువులుండే స్కూల్ బ్యాగ్, ఒక కిట్‌ను పిల్లలకు ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం అంతర్జాతీయ సంస్థల ద్వారా టెండర్లు పిలిస్తే కమీషన్లు తీసుకుంటున్నామని విమర్శలు చేస్తున్నారు. మా విద్యాశాఖాధికారులు విడుతలవారీగా జూలై ఆఖరు వరకు వందకు వంద శాతం వీటన్నింటిని అందిస్తారు. అందుకోసం ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నాం.
– జూన్ 17న రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు
కరీంనగర్, ఆగస్టు 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి పర్యవేక్షించే విద్యాశాఖలోనే అంతులేని అలసత్వం ఉన్నట్టు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. విడతల వారీగా జూలై నెలాఖరు వరకు స్కూల్ డ్రెస్‌లతోపాటు ప్రభుత్వం ప్రకటించిన కిట్స్‌ను అందించి తీరుతామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించి దాదాపు రెండు నెలలు గడుస్తున్నా.. పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి లేదా కొన్ని సందర్భాల్లో ప్రారంభైన వారం రోజల్లో ప్రతి విద్యార్థికీ రెండు జతల స్కూల్ డ్రెస్‌లు అందేవి. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పట్లో అందే అవకాశాలూ కనిపించడం లేదు. దీనిపై ఏ అధికారి కూడా ఫలానా తేదీ వరకు ఇస్తామమని చెప్పడం లేదు. ఫలితంగా కొంతమంది చిరిగిన డ్రెస్సులే వేసుకొని సర్కార్ బడులకు వస్తున్నారు. మరికొంత మంది పిల్లలు యూనిఫామ్ కాకుండా వారి సొంత దుస్తులను వేసుకొని వస్తుండటంతో పాఠశాల పరిసరాల్లో తీరొక్క రంగులు కనిపిస్తుండటం గమనార్హం. స్వయంగా సీఎం వద్ద ఉన్న విద్యాశాఖలోనే ప్రణాళికా లోపం ఉన్నదని చెప్పేందుకు స్కూల్ డ్రెస్‌లు, కిట్లు ఓ నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
2026-27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన కొత్త యూనిఫారాలు, తెలంగాణ ఎడ్యుకేషన్ కిట్లు అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. సర్కార్ బడుల్లో చదివే సుమారు 27లక్షల మంది విద్యార్థులకు రెండు జతల యూనిఫారాలు ఇవ్వాలని నిర్ణయించినట్టు మే నెలలో సీఎం ప్రకటించారు. యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకొని పాఠశాల ప్రారంభమైన రోజే ఒక జత, నెలలోపు రెండో జత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు కానీ అది అమలుకు నోచుకోలేదు. అంతేకాదు.. జూన్ 17న రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ నాణ్యమైన దుస్తులతోపాటు స్కూల్ బ్యాగ్‌ను వందకు వంద శాతం ఇస్తామని గొప్పగా ప్రకటించారు. కానీ ఆచరణలో చూస్తే.. మొత్తం మంది విద్యార్థులకు ప్రభుత్వం చెప్పిన దుస్తువులు, కిట్లు అందాలంటే మరో రెండు నెలల సమయం పట్టేలా ఉన్నదని అధికార వర్గాలే చర్చించుకుంటున్నాయి.
తాజాగా అధికార వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ రోజు వరకు 33జిల్లాలకు డిమాండ్ మేరకు కావాల్సిన యూనిఫామ్ వస్త్రం కూడా పంపిణీ జరగలేదు. బాలురకు నిక్కర్, ప్యాంట్‌కు సంబంధించిన వస్ర్తాన్ని, బాలికలకు వాస్కోట్ కావాల్సిన బట్టను చాలా జిల్లాలకు సరఫరా చేయడాన్ని అధికారులు మరచిపోయారని తెలుస్తున్నది. విషయం తెలుసుకొని.. ఇప్పుడు ఆయా జిల్లాలకు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. దుస్తులను కుట్టే బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించినా.. వారికి అన్ని రకాల వస్త్రం రాకపోవడంతో ఏదికుట్టాలో, ఎలా కుట్టాలో? అని సందిగ్ధంలో పడ్డారు. డ్రెస్‌లు కుట్టిచ్చే బాధ్యతను ఐకేపీ, మహిళా సంఘాలకు ప్రభుత్వం ఆప్పగించింది. అయితే డిమాండ్‌కు అనుగుణంగా వస్త్రం సరఫరా కాకపోవడంతో పూర్తిస్థాయిలో విద్యార్థులకు అందేందుకు మరో రెండు నెలలైనా పడుతుందని జిల్లా అధికారులు చర్చకుంటున్నారు. అలాగే కొత్తగా చేరిన విద్యార్థులకు డ్రెస్‌లు వస్తాయా? రావా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఏటా ఇచ్చే స్కూల్ డ్రెస్‌ల విషయంలో ప్రణాళికా లోపం స్పష్టంగా కనిపిస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో డే స్కాలర్, వసతి గృహం విద్యార్థులకు వేర్వేరుగా అంటే 9నుంచి 24 రకాల వస్తువులతో కూడన కిట్‌ను ప్రతి విద్యార్థికీ అందిస్తామని చెప్పింది. హాస్టల్, గురుకుల విద్యార్థుల ఎడ్యుకేషన్ కిట్‌లో 24 వస్తువులుంటాయని పేర్కొన్నది. అందులో స్కూల్ యూనిఫాం, స్కూల్ బ్యాగ్, షూస్, సాక్సులు, బెల్ట్, టై, ఐడీ కార్డు, స్టేషనరీ కిట్, నోట్‌బుక్స్, పీటీ డ్రెస్, నైట్ డ్రెస్, ట్రాక్‌సూట్, కార్పెట్, బెడ్‌షీట్, బ్లాంకెట్, టవల్, ప్లేట్, గ్లాస్, బౌల్, కప్పు, స్పూన్, ట్రంక్ బాక్స్, ట్రాలీ బ్యాగ్ ఇస్తామని చెప్పారు. డే విద్యార్థులకు తొమ్మిది రకాల వస్తువులుంటాయని ప్రకటించింది. జూన్ 19న ఎల్బీ స్టేడియంలో రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులకు కిట్ల పంపిణీని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది. ఆ తదుపరి ఆరంభ శూరత్వంగానే మిగిలిపోయింది.
ప్రభుత్వం చెప్పినట్టు అన్ని రకాల వస్తువులతో కిట్లు ఎప్పటిలోగా అందరు విద్యార్థులకు అందుతాయంటే.. ఏ అధికారి సమాధానం చెప్పలేని పరిస్థితి. విద్యాశాఖను స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ఆధీనంలో ఉంది కాబట్టి.. అన్నీ ఇన్‌టైమ్‌లోనే జరుగుతాయని భావిస్తారు. కానీ.. ఇక్కడ ప్రతి పని అంచనాలకు భిన్నంగా జరుగుతున్నాయి. స్కూల్ డ్రెస్‌లు, కిట్స్ మాత్రమే కాదు, పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపు కోసం తీసుకునే చర్యల నుంచి మొదలు విద్యారంగ ప్రక్షాళనకు వేసిన కమిటీల వరకు అన్నీంటిలోనూ ప్రణాళికా లోపం స్పష్టంగా కనిపిస్తున్నదన్న విమర్శలున్నాయి. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, దుస్తులు, కిట్ల ఇచ్చే అంశంపై ప్రత్యేక దృష్టిసారించాలన్న విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.