హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : ‘తెలంగాణ-జర్మనీ’ లాజిస్టిక్ కారిడార్ ఏర్పాటుకు సహకరించాలని జర్మన్ ఇండియన్ బిజినెస్ అలయన్స్ ప్రతినిధులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్ బాబు కోరారు. సోమవారం కెల్ స్టర్ బాక్ నగర మేయర్ మాన్ ఫ్రెడ్ ఓకెల్ నేతృత్వంలో జీఐబీఏ ప్రతినిధులు సోమవారం సచివాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.
సెమీ కండక్టర్ తయారీ రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా జర్మనీ కంపెనీలను ప్రోత్సహించాలని జర్మన్ ఇండియన్ బిజినెస్ అలయన్స్(జీఐబీఏ) ప్రతినిధులను ఆయన కోరారు. రాష్ర్టాన్ని సెమీ కండక్టర్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు.
రాష్ట్రంలో సెమీ కండక్టర్స్, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, అడ్వాన్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్, ప్రెసిషిన్ ఇంజినీరింగ్, ఆటోమొబైల్, ఆటోమేషన్ తదితర రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, అనుకూలతలను ఈ సందర్భంగా శ్రీధర్ బాబు వారికి వివరించారు. పరిశ్రమల ఏర్పాటుకు వేగవంతమైన అనుమతులు, మౌలిక వసతులు, పెట్టుబడి ప్రోత్సాహకాలు, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాల్లో పూర్తి సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.