రవాణాశాఖపై కొన్ని ఆటో సంఘాల నాయకుల పెత్తనం తీవ్రమవుతున్నది. తమ మాట వినకుంటే అధికారులపై బెదిరింపు రాజకీయాలకు దిగుతున్నారు. తాజాగా 5వేల ఆటోల అనుమతి ప్రక్రియలో మరోసారి వారి బెదిరింపు రాజకీయాలు తెరపైకి వచ్చాయి. ప్రభుత్వం గతేడాది 10వేల సీఎన్జీ, 10వేల ఎల్పీజీ ఆటోలకు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో సుమారు 15వేల వరకు ఆటోల విక్రయ ప్రక్రియ పూర్తయింది.
వాహన షోరూంలు ఒక్కో ఆటోపై లక్ష నుంచి 2 లక్షల వరకు ఫైనాన్స్ ముసుగులో అక్రమ వసూళ్లకు పాల్పడ్డాయి. వారి అరాచకాలపై విజిలెన్స్ విచారణ సైతం జరిగింది. దీంతో 20వేల ఆటోల్లో సుమారు 5వేల ఆటోల కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఇప్పుడు ఆర్టీఏ అధికారులు అనుమతిస్తేగానీ ఆ ప్రక్రియ మొదలు కాదు. దీంతో షోరూంలు, కొన్ని ఆటో యూనియన్ల నాయకులు కుమ్మక్కై మళ్లీ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. మిగిలిన 5వేల ఆటోలకు సైతం లైన్ క్లియర్ చేయాలని బెదిరిస్తున్నారు. ఇప్పుడు ఆ 5వేల సీఎన్జీ, ఎల్పీజీలకు అనుమతిస్తే రెట్టింపు ధరలతో మళ్లీ ఆటో కుంభకోణానికి కుట్రపన్నే అవకాశం ఉందని ఆటో డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -సిటీబ్యూరో(నమస్తేతెలంగాణ)
సిటీబ్యూరో, ఆగస్టు 31 ( నమస్తే తెలంగాణ) స్వచ్ఛమైన గాలి, సుస్థిర ప్రజా రవాణా దిశగా హైదరాబాద్ ను నడిపించడమే ప్రభుత్వ లక్ష్యం అని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం సున్నా కార్బన్ ఉద్గారాల లక్ష్యానికి కొన్ని షోరూం డీలర్లు, ఆటో సంఘాల నాయకులు తూట్లు పొడుస్తున్నారు. మొత్తానికే ఈవీ ఆటోలను ఇవ్వాల్సిన సర్కార్ 20వేల సీఎన్జీ, ఎల్పీజీలను విడుదల చేయడంపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎవరి ప్రయోజనాల కోసం కాలుష్య కారక వాహనాలను అంటగడుతున్నారని పర్యావరణ వేత్తలు విమర్శిస్తున్నారు. సాధారణంగా ఇప్పటికే నగరంలో లక్షకు పైగా ఆటోలున్నాయి.
కాలం చెల్లిన పెట్రోల్, డీజిల్ ఆటోలు వేలల్లో ఉన్నాయి. వాటిని రెట్రోఫిట్మెంట్తో ఈవీలుగా మార్చడం లేదా వాటి స్థానంలో కొత్త ఈవీ ఆటోలు అందించడం చేయాలి. కానీ ఆ దిశగా అడుగులు పడటం లేదు. కాలుష్యతీవ్రతను పట్టించుకోకుండా ఆమ్యామ్యాల కోసం నగర భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఓవైపు నగరంలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. సుమారు 90 లక్షలకుపైగా వాహనాలు నగర రోడ్లపై నిత్యం తిరుగుతునే ఉన్నాయి. రోజుకు సుమారు 15 వందల వాహనాలు కొత్తగా రోడ్లపైకి వస్తున్నాయి. ఈ స్థాయిలో వాహనాలు పెరుగుతున్నాయంటే అదే స్థాయిలో కాలుష్యం కూడా పెరుగుతున్నది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో గాలిలో ధూళికణాలు(పార్టికల్ మ్యాటర్) పీఎం 10, పీఎం 2.5 పరిణామాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.
అన్నీ ఈవీ ఆటోలే ఇవ్వాలి..!
పెట్రోల్, డీజిల్ ఆటోలను ఈవీలుగా మార్చేందుకు ప్రభుత్వం ఆటోలపై రూ.200 కోట్లు ఖర్చుపెట్టడానికి సిద్ధమైంది. త్వరలో సీఎన్జీ, ఎల్పీజీలను సైతం ఈవీలుగా మారుస్తామని చెబుతుంది. ఇలాంటి తరుణంలో20వేల కొత్త సీఎన్జీ, ఎల్పీజీ ఆటోలకు అనుమతి ఎందుకిచ్చినట్టు అని పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా కొత్తగా అనుమతివ్వబోయే మిగిలిన 5వేల సీఎన్జీ, ఎల్పీజీలను రద్దు చేసి ఈవీ ఆటోలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ(క్యూర్) ప్రాంతంలో నడుస్తున్న 18,766 పెట్రోల్, డీజిల్ ఆటోరిక్షాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 200 కోట్ల విద్యుత్ మార్పిడి పథకాన్ని ప్రతిపాదించిన విషయం తెలిసిందే అందులో భాగంగా, ఇప్పటికే ఉన్న వాహనాలను ఆధునీకరించడానికి (రెట్రోఫిటింగ్) లేదా కొత్త ఎలక్ట్రిక్ ఆటోలను కొనుగోలు చేయడానికి రూ. 1.50 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనుంది. క్యూర్ ప్రాంతంలో చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్లతో 18,766 అర్హత గల ఐసిఇ ఆటో-రిక్షాలు ఉన్నాయి. వీటిలో 11,254 డీజిల్ తో నడిచేవి కాగా, 7,512 పెట్రోల్ తో నడిచేవని అధికారులు గుర్తించారు.
షోరూం డీలర్ల ఆగడాలతో డ్రైవర్లపై భారం
-సతీశ్ కుమార్, ఆటో డ్రైవర్
ఎల్పీజీ, సీఎన్జీ ఆటోలను షోరూం డీలర్లు రెట్టింపు ధరలకు విక్రయించి ఆటోడ్రైవర్లపై భారం మోపారు. ఫైనాన్స్‌తో ఒక్క ఆటో ధర 6 లక్షలకు చేరింది. ఈవీ ఆటో కొనుగోలుకు చాలా మంది ఆటో డ్రైవర్లు ఆసక్తిగా ఉన్నా షోరూంలు వాటిని ఆలస్యంగా అందించడం, ఎప్పుడొస్తదో కూడా సరైన వివరాలు చెప్పకపోవడంతో చాలా మంది సీఎన్జీ, ఎల్పీజీలనే విక్రయించాల్సి వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఇవ్వబోయే సీఎన్జీ, ఎల్పీజీలను రద్దు చేసి ఈవీ ఆటోలనే ఇవ్వాలి. మొత్తం ఈవీ వాహనాలే అనుకున్నప్పుడు ఇంకా సీఎన్జీ, ఎల్పీజీలు ఎందుకిస్తున్నట్టో ప్రభుత్వానికే తెలియాలి.