కుత్బుల్లాపూర్, ఆగస్టు 31: గణేశ్‌నగర్ పద్మానగర్ ఫేస్-1 నివాసితుల సమస్యకు ఎట్టకేలకు శాశ్వత పరిష్కారం లభించింది. నిషేధిత భూముల జాబితా 22(ఎ)కారణంగా తీవ్ర మనోవేదనకు గురవుతున్న ప్లాట్ల యజమానులకు ఊరట లభించింది. స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్రాజులు ప్రత్యేక చొరవతో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరిని కలిసి 12 ఎకరాల భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. పద్మానగర్ ఫేస్-1 వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్రాజులు సోమవారం జిల్లా కలెక్టర్ మనుచౌదరిని స్వయంగా కలిశారు. సర్వే నంబర్ 128/2లో ఐడీపీఎల్ సెంట్రల్ ప్రభుత్వానికి చెందిన 14 ఎకరాలు స్థలంతో పాటు స్థానికంగా 12 ఎకరాలు ప్రైవేట్ భూములు మొత్తం 26 ఎకరాల విస్తీర్ణంతో ఉంది.
కాగా దశాబ్దకాలంగా ఈ సర్వేనంబర్‌లోనే ఐడీపీఎల్ స్థలాలతో పాటు స్థానికుల పట్టాభూములు ఉండడంతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి నెలకొంది. దీనికి తోడు 26 ఎకరాల విస్తీర్ణం పూర్తిగా 22(ఏ) నిషేధిత జాబితాలోకి చేరడంతో ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి, ఇళ్లు నిర్మించుకోలేక, బ్యాంక్ రుణాలు పొందలేక మధ్యతరగతి కుటుంబాలు అనుభవిస్తున్న నరకాన్ని, భూముల స్థితిగతులను, నివాసితులు ఎదుర్కొంటున్న సాంకేతిక, చట్టపరమైన చిక్కులను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ అధికారులతో సమీక్షించి సదరు సర్వే నంబర్లోని మొత్తం 26 ఎకరాల విస్తీర్ణం నుంచి 12 ఎకరాలను తక్షణమే 22(ఏ) నిషేధిత జాబితా నుంచి తొలగించాల్సిందిగా సంబంధిత రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అయితే మిగిలిన 14 ఎకరాల ఐడీపీఎల్ స్థలాలకు సర్వేనంబర్ 128/2/పీగా రూపకల్పన చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఐడీపీఎల్ ఉన్నతాధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.
పెరగనున్న ఆస్తుల విలువ…
పద్మానగర్ ఫేస్-1లోని సర్వేనంబర్ 128/2లో ఉన్న 12 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగింపు నిర్ణయంతో స్థానికంగా నివసించే వందలాది కుటుంబాల సొంతింటి కల నెరవేరేవందుకు మార్గం సుగగమైంది. ఇప్పటి వరకు నిషేదిత జాబితాలో ఉండడంతో ఆస్తుల క్రయవిక్రయాలు, గిఫ్ట్‌డీడ్‌లు నిలిచిపోయాయి. కలెక్టర్ నిర్ణయంతో ఇకపై సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్లు వేగవంతం కానున్నాయి. భూమి స్పష్టమైన టైటిల్లోకి రానుండడంతో బ్యాంకులు, ఆర్ధిక సంస్థల నుంచి గృహ రుణాలు పొందేందుకు మార్గం సుగమం కానుంది.
ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్రాజులకు కృతజ్ఞతలు
పద్మానగర్ ఫేస్-1 వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, స్థానిక ప్రజలు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌తో పాటు ఎమ్మెల్సీ శంభీపూర్రాజులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏండ్లుగా నలిగిపోతున్న తమ సమస్యను సొంత సమస్యగా భావించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఒప్పించి పరిష్కరించినందుకు నిరంతరం రుణపడి ఉంటామని కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేశారు.